పింఛన్ కోసం వెళుతూ పరలోకాలకు..
● కారు ఢీకొని మహిళ మృతి
●కుమారుడికి తీవ్ర గాయాలు
ముదిగుబ్బ: పింఛన్ తీసుకోవడానికి వేరే గ్రామానికి వెళుతుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో రామలక్ష్మమ్మ (72) అనే మహిళ మృతి చెందింది. పోలీసులు, స్థానికులు తెలిపిన మేరకు... ముదిగుబ్బ మండలం ఈదులపల్లికి చెందిన రామలక్ష్మమ్మ పుట్టినిల్లు ధర్మవరం మండలం బిల్వంపల్లి. గతంలో ఆమె కుటుంబమంతా బిల్వంపల్లిలోనే నివాసం ఉండేది. ఆమెకు వితంతు పింఛన్ ఆ ఊరిలోనే వచ్చేది. తర్వాత కొంతకాలానికి ఈదులపల్లికి తిరిగొచ్చారు. పింఛన్ మాత్రం బిల్వంపల్లిలోనే ఉండిపోయింది. దీంతో ఆమె సోమవారం పింఛన్ తీసుకోవడానికి ఒకరోజు ముందుగా ఆదివారం కుమారుడు ఓబుళపతితో కలసి ద్విచక్ర వాహనంపై బిల్వంపల్లికి బయలుదేరింది. మార్గమధ్యంలోని రాళ్ల అనంతపురం వద్ద రోడ్డు దాటుతుండగా వేగంగా వచ్చిన కారు వీరి ద్విచక్ర వాహనాన్ని ఢీకొంది. ఈ ప్రమాదంలో రామలక్ష్మమ్మ అక్కడికక్కడే మృతిచెందింది. తీవ్రంగా గాయపడిన ఓబుళపతిని బత్తలపల్లి ఆర్డీటీ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. కాగా..వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో వలంటీర్లు ఇంటి వద్దకే వచ్చి పింఛన్ ఇచ్చేవారని, ఇప్పుడు ఆ పరిస్థితి లేకపోవడంతో ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయని పలువురు చర్చించుకోవడం కనిపించింది.
తుంపర వర్షం
పుట్టపర్తి అర్బన్: దిత్వా తుపాను ప్రభావంతో శనివారం రాత్రి నుంచి ఆదివారం రాత్రి వరకూ తుంపర వర్షం కురుస్తూనే ఉంది. జడివాన రాకతో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. చలితో వృద్ధులు వణికి పోయారు. శనివారం రాత్రి 9 మండలాల్లో వర్షపాతం నమోదైంది. ఎన్‌పీ కుంట మండలంలో 7.6 మి.మీ, అమడగూరులో 5.4, గాండ్లపెంటలో 2.6, కదిరిలో 2.2, నల్లచెరువులో 2.2, తనకల్లులో 2.2, తలుపులలో 2, నల్లమాడలో 1.6, ఓడీచెరువులో 1.4 మి.మీ వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. అయితే ఆదివారం ఉదయం నుంచి రాత్రి వరకు జిల్లా అంతటా వర్షం కురిసింది. తుపాను ప్రభావంతో మరో మూడు రోజులు వర్షం కురుస్తుందని అధికారులు చెప్పారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, ముఖ్యంగా రైతులు పంట ఉత్పత్తులను జాగ్రత్త పరుచుకోవాలన్నారు.
లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం
మడకశిరరూరల్: భక్తరపల్లి లక్ష్మీనరసింహస్వామి, జిల్లెడుగుంట ఆంజనేయస్వామి బ్రహ్మోత్సవాలు ఆదివారం ప్రారంభమయ్యాయి. స్వామి వార్లను ప్రత్యేకంగా అలంకరించి పూజలు చేశారు. అనంతరం విశ్వక్సేన, రక్షా బంధన, అంకురార్పణ తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు. సోమవారం స్వామివార్లకు ధ్వజారోహణ, అంకురార్పణ, హోమంతో పాటు ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాల సమర్పణ తదితర కార్యక్రమాలు ఉంటాయని దేవదాయశాఖ అధికారులు తెలిపారు.
పింఛన్ కోసం వెళుతూ పరలోకాలకు..
పింఛన్ కోసం వెళుతూ పరలోకాలకు..


