
పంచాయతీకి ట్రాక్టర్ అప్పగింత
సాక్షి, టాస్క్‌ఫోర్స్: ఎట్టకేలకు ఏడాది తర్వాత పేరూరు మేజర్ పంచాయతీకి చెందిన ట్రాక్టర్ తిరిగి పంచాయతీకి చేరింది. స్వచ్ఛ భారత్ పనుల కోసం ప్రభుత్వం పేరూరు పంచాయతీకి ట్రాక్టర్ ఇవ్వగా.. కూటమి సర్కార్ అధికారంలోకి రాగానే టీడీపీ మండల కన్వీనర్ సుధాకర్ వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. సొంత పనులకు వాడుకోవడంతో పాటు ఇతర రైతులకు అద్దెకు ఇస్తూ సొమ్ముచేసున్నాడు. దీనిపై ‘పంచాయతీకే పంగనామం’ శీర్షికన ఈనెల 1వ తేదీ మంగళవారం ‘సాక్షి’ కథనం ప్రచురించింది. అధికారం అడ్డుపెట్టుకుని టీడీపీ నాయకులు సాగిస్తున్న అక్రమాల పర్వాన్ని బట్టబయలు చేసింది. ఈ కథనం తీవ్ర చర్చనీయాంశం కాగా, టీడీపీ నాయకులు నష్ట నివారణ చర్యలకు ఉపక్రమించారు. వెంటనే ట్రాక్టర్‌ను పంచాయతీకి స్వాధీనం చేయాలని ఆదేశించడంతో.. టీడీపీ మండల కన్వీనర్ సుధాకర్ బుధవారం ట్రాక్టర్‌ను పంచాయతీ ఆఫీసు వద్దకు తీసకువెళ్లి కార్యదర్శి సత్యమ్మకు తాళాలు అప్పగించారు. అయితే ఏడాదిగా ట్రాక్టర్‌ను అద్దెలకు ఇచ్చి సంపాదించిన మొత్తాన్నీ పంచాయతీ ఖాతాకు జమ చేయాలని ప్రజలు కోరుతున్నారు.
సీఎం పర్యటనకు
పకడ్బందీ ఏర్పాట్లు
● కలెక్టర్ టీఎస్ చేతన్
ప్రశాంతి నిలయం: ముఖ్యమంత్రి చంద్రబాబు ఈనెల 10న జిల్లాలోని కొత్తచెరువులో పర్యటించే అవకాశం ఉందని, ఇందుకోసం పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ టీఎస్ చేతన్ అధికారులను ఆదేశించారు. బుధవారం ఆయన కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్‌తో కలిసి సీఎం పర్యటన ముందస్తు ఏర్పాట్లపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. తల్లికి వందనం కార్యక్రమంలో పాల్గొనేందుకు ఈ నెల 10న సీఎం చంద్రబాబు కొత్తచెరువులో పర్యటించే అవకాశం ఉందన్నారు. సీఎం పర్యటన ఏర్పాట్లకు సంబంధించి ప్రతి శాఖకు బాధ్యతలు అప్పగించామని, లోటుపాట్లు లేకుండా ప్రణాళికాబద్ధంగా ఏర్పాట్లు చేయాలన్నారు. సీఎం పర్యటించే ప్రాంతాల్లో పోలీసులు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేయాలన్నారు. సీఎం కాన్వాయ్‌లో స్పెషలిస్ట్ వైద్యులతో పాటు అత్యవసర మందులను, అంబులెన్స్‌ను సిద్ధంగా ఉంచుకోవాలని వైద్య, ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. సమావేశంలో డీఆర్‌ఓ విజయసారథి, పుట్టపర్తి, ధర్మవరం, కదిరి ఆర్డీఓలు సువర్ణ, మహేష్, వైవీఎస్ శర్మ, డీపీఓ సమత, డీఆర్‌డీఏ పీడీ నరసయ్య, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి సుబ్బారావు, జిల్లా రవాణా శాఖ అధికారి జే.శ్రీనివాసరావు, డీఎంహెచ్‌ఓ ఫైరోజా బేగం తదితరులు పాల్గొన్నారు.
జలజలా తుంగభద్రమ్మ..
● టీబీ డ్యాం 6 క్రస్ట్ గేట్లు ఎత్తివేత
బొమ్మనహాళ్: ఎగువన వర్షాలు భారీగా కురుస్తుండగా తుంగభద్రమ్మ పరుగులు తీస్తోంది. దీంతో అధికారులు బుధవారం జలాశయం 6 క్రస్ట్ గేట్లను ఎత్తి నదికి నీటిని విడుదల చేశారు. ప్రస్తుతం 14,136 క్యూసెక్కుల నీటిని నదికి వదులుతున్నారు. డ్యాం ఎగువ భాగంలో విస్తారంగా కురుస్తున్న వర్షాల కారణంగా రిజర్వాయర్‌కు పెద్ద ఎత్తున వరద వచ్చి చేరుతోంది. బుధవారం సాయంత్రానికి 32,494 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదైంది. ప్రసుత్తం జలాశయంలో నీటి నిల్వ 1,633 అడుగులకు గాను 1,625.46 అడుగులకు చేరుకుంది. మొత్తం నీటి సామర్థ్యం 105.788 టీఎంసీలు కాగా 78.100 టీఎంసీల నీరు నిల్వ ఉంది. దీంతో బుధవారం మధ్యాహ్నం డ్యాం క్రస్ట్ గేట్లలో నాలుగింటిని, రాత్రి 7 గంటల సమయంలో మరో రెండింటిని ఎత్తి నదికి నీటిని విడుదల చేశారు.

పంచాయతీకి ట్రాక్టర్ అప్పగింత

పంచాయతీకి ట్రాక్టర్ అప్పగింత

పంచాయతీకి ట్రాక్టర్ అప్పగింత