అధికారులు అన్యాయం చేశారు | - | Sakshi
Sakshi News home page

అధికారులు అన్యాయం చేశారు

Jul 3 2025 7:43 AM | Updated on Jul 3 2025 7:43 AM

అధికారులు అన్యాయం చేశారు

అధికారులు అన్యాయం చేశారు

అనంతపురం అర్బన్‌: బదిలీల కౌన్సెలింగ్‌లో అధికారులు తమకు తీవ్ర అన్యాయం చేశారని విలేజ్‌ అగ్రికల్చర్‌ అసిస్టెంట్లు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిబంధనలను అనుసరించలేదన్నారు. ర్యాంక్‌ (మెరిట్‌) ఆధారంగా బదిలీలు నిర్వహించకుండా ఇష్టారాజ్యంగా స్థానాలు కేటాయించారని మండిపడ్డారు. రాజకీయ సిఫారసు ఉన్నవారికి వారు కోరుకున్న స్థానాలు కేటాయించారని వాపోయారు. తమకు జరిగిన అన్యాయాన్ని కలెక్టర్‌ వినోద్‌కుమార్‌ దృష్టికి తీసుకెళ్లేందుకు బుధవారం కలెక్టరేట్‌కు వచ్చిన పలువురు విలేజ్‌ అగ్రికల్చర్‌ అసిస్టెంట్లు మీడియాతో మాట్లాడారు. ఉమ్మడి జిల్లా సచివాలయ విలేజ్‌ అగ్రికల్చర్‌ అసిస్టెంట్లకు గతనెల 28న బదిలీ కౌన్సెలింగ్‌ నిర్వహించారన్నారు. ఆరోజున కౌన్సెలింగ్‌కు హాజరైన తమ నుంచి ఆప్షన్‌ ఫారాలు తీసుకుని..మీ ఆప్షన్లలో ఏదో ఒకటి తర్వాత ఇస్తామని చెప్పారన్నారు. తీరా పోస్టింగ్‌ ఆర్డర్స్‌ ఒకటో తేదీన పంపారని, అందులో తామిచ్చిన ఆప్షన్లకు సంబంధం లేని మండలాల్లో పోస్టింగ్‌ ఇచ్చారన్నారు. ముందు ర్యాంకులో ఉన్న తమను కాదని తరువాత ర్యాంక్‌ వాళ్లకు తమ స్థానాలు ఇచ్చారని ఆరోపించారు. అంతే కాకుండా దివ్యాంగులు, మెడికల్‌, ఒంటరి మహిళలు, స్పౌజ్‌కు ప్రాధాన్యత ఇవ్వలేదన్నారు. ఇలా బదిలీల కౌన్సెలింగ్‌లో అధికారులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించి తమకు అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు చేసిన అన్యాయాన్ని కలెక్టర్‌ దృష్టికి తీసుకెళతామని చెప్పారు. కార్యక్రమంలో అగ్రికల్చర్‌ అసిస్టెంట్లు నేత్ర, జహీర్‌, వాణిశ్రీ తదితరులు పాల్గొన్నారు.

ర్యాంక్‌ ప్రకారం ఇవ్వలేదు

ఉమ్మడి జిల్లాలో నాది 6వ ర్యాంకు. శ్రీసత్యసాయి జిల్లాలో 3వ ర్యాంక్‌. నేను కదిరిలో పనిచేస్తున్నారు. బదిలీల్లో కదిరి, నల్లచెరువు, గాండ్లపెంట ఆప్షన్‌ ఇచ్చా. నాకు ముదిగుబ్బ మండలంలో పోస్టింగ్‌ ఇచ్చారు. నేను ఆప్షన్‌లో ఉంచిన స్థానాలను ఇవ్వకుండా నా తరువాత ర్యాంక్‌ వారికి కేటాయించారు.

– జనార్దన్‌, విలేజ్‌ అగ్రికల్చర్‌ అసిస్టెంట్‌

ఇష్టానుసారంగా ఇచ్చారు

ఉమ్మడి జిల్లాలో నాది 5వ ర్యాంక్‌, శ్రీసత్యసాయి జిల్లాలో 2వ ర్యాంక్‌, నేను తలుపుల మండలంలో పనిచేస్తున్నా. నల్లచెరువు, ఎన్‌పీకుంట, నల్లమాడ మండలాలకు ఆప్షన్‌ ఇచ్చాను. అయితే నా ఆప్షన్లు కాకుండా తనకల్లు మండలం కోటపల్లి సచివాలయంలో పోస్టింగ్‌ ఇచ్చారు. మా తరువాతి ర్యాంకు వారికి మా ఆప్షన్‌ స్థానాలు ఇచ్చారు.

– సుస్మిత, విలేజ్‌ అగ్రికల్చర్‌ అసిస్టెంట్‌

పీహెచ్‌ కోటా అమలు చేయలేదు

పీహెచ్‌ కేటగిరీకి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి. అయితే ఆ కేటగిరీలో ఉన్న నాకు అన్యాయం చేశారు. నేను నల్లమాడ మండలం వేళ్లమద్ది సచివాలయంలో పనిచేస్తున్నా. బదిలీ ఆప్షన్‌ ఇటుకలపల్లి, బత్తపల్లి సచివాలయం–2, ఆత్మకూరు మండలం బి.యాలేరు ఇచ్చాను. అయితే అవేవీ కాకుండా బుక్కపట్నం మండల అగ్రహారం సచివాలయానికి నన్ను బదిలీ చేశారు.

– శిరీష, విలేజ్‌ అగ్రికల్చర్‌ అసిస్టెంట్‌

విలేజ్‌ అగ్రికల్చర్‌ అసిస్టెంట్ల ఆవేదన

రాజకీయ సిఫారసులకు

పెద్దపీట వేశారని ధ్వజం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement