
అరాచకాలు దాచేసి.. అబద్ధాలు అచ్చేసి!
ఇచ్చిన హామీలే నీటిమూటలనుకుంటే ఇంటింటికీ సుపరిపాలన
అంటూ ముద్రించిన కరపత్రాలు మరీ ఘోరంగా ఉన్నాయంటూ ఉమ్మడి అనంతపురం జిల్లా ప్రజల్లో చర్చ జరుగుతోంది. హామీలు నెరవేర్చామా లేదా అన్నది చెప్పకుండా చేయని పనులపై అబద్ధాలు అచ్చువేసి కరపత్రాలు పంచుతున్నారు. వీటిని చదువుతున్న సామాన్యులు కూడా అర్థం కాక బిక్కముఖం వేస్తున్న పరిస్థితి. ‘సూపర్ సిక్స్’పై ఎక్కడా ఒక్కమాట కూడా చెప్పకనే..
ప్రజల చెవిలో పూలు పెట్టే ప్రయత్నం చేస్త్తున్నారు.
సాక్షి ప్రతినిధి, అనంతపురం: ఉమ్మడి అనంతపురం జిల్లాలో కూటమి ప్రభుత్వ ‘సుపరిపాలనలో తొలి అడుగు’ కార్యక్రమం ప్రారంభమైంది. ఇందులో భాగంగా ఇంటింటికీ వెళ్తున్న కూటమి ఎమ్మెల్యేలు పంచుతున్న కరపత్రాల్లో ఎస్సీ ఎస్టీ, మైనార్టీ మహిళలపై దాడులు గణనీయంగా తగ్గాయని ముద్రించడం సర్వత్రా విమర్శలకు తావిస్తోంది. ఇటీవల శ్రీసత్యసాయి జిల్లా రామగిరి మండలం ఏడుగుర్రాలపల్లెలో దళిత బాలికపై సామూహిక అత్యాచార ఘటన జరిగింది. అనంతపురంలో ఇంటర్ చదివే గిరిజన బాలిక తన్మయి దారుణ హత్యకు గురైంది. ఈ రెండు ఘటనలు జిల్లాలోనే కాదు... రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. ఇక.. కూటమి ప్రభుత్వం వచ్చాక తాడిపత్రిలో ఎస్సీ వర్గానికి చెందిన ఎంపీపీపై దారుణంగా దాడి చేశారు. రాప్తాడు, ధర్మవరం, తాడిపత్రి ఇలా ప్రతి నియోజకవర్గంలోనూ ఎస్సీ,ఎస్టీలపై దాడులు నిత్యకృత్యంగా మారాయి. కానీ, వాటన్నింటినీ దాచి దాడులు తగ్గినట్టు చిత్రీకరించడం చర్చనీయాంశమైంది.
గంజాయి, డ్రగ్స్ ముఠా పేట్రేగి పోతున్నా
కూటమి ప్రభుత్వం వచ్చాక రాయదుర్గం ప్రాంతంలో టీడీపీకి చెందిన ఓ వ్యక్తి ఏకంగా గంజాయి సాగు చేస్తూ దొరికిపోయాడు. తాడిపత్రిలో గంజాయి బ్యాచ్ హల్‌చల్ చేస్తూ పోలీసులకు సవాలుగా మారింది. అనంతపురంలో ఇటీవలే గంజాయి బ్యాచ్ పోలీసులకు పట్టుబడింది. హిందూపురంలో విచ్చలవిడిగా గంజాయి రవాణా అవుతోంది. ఇంత దారుణంగా రెండు జిల్లాలో గంజాయి, డ్రగ్స్ కేసులు నమోదవుతుంటే.. సురక్షిత ఆంధ్రప్రదేశ్ అని, రౌడీషీటర్లు, స్మగ్లర్లపై ఉక్కుపాదం మోపుతున్నట్టు ఏడాది పాలన కరపత్రాల్లో భజన చేశారు.
గుంతల రోడ్లకు గంతలు..
ఉమ్మడి జిల్లాలో గుంతలు పడిన రోడ్లకు కూటమి సర్కారు గంతలు కట్టింది. ఎక్కడ చూసినా రోడ్లు ఛిద్రమై వాహనదారులు ఆపసోపాలు పడుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా రోడ్ల మరమ్మతులకు రూ.866 కోట్లు విడుదల చేశామని కరపత్రాల్లో పొగుడుకున్నారు. కానీ రోడ్లు బాగుపడకపోగా బిల్లులు మాత్రం టీడీపీ నేతల జేబుల్లోకి వెళ్లాయి. మరోవైపు రైతులకు 9 గంటల ఉచిత విద్యుత్ అంటూనే ఇటీవలి కాలంలో కరెంటు కోతలు విపరీతంగా విధించారు.
ముందే రెక్కీ..
ఆకస్మికంగా గ్రామాల పర్యటన చేసే పరిస్థితి కూటమి నేతలకు లేదు. ఎక్కడ పర్యటిస్తున్నారో ఆ ప్రాంతానికి ముందురోజే అనుచరులను పంపించి అక్కడ వ్యతిరేకులెవరైనా ఉంటే బుజ్జగిస్తున్నట్టు తెలిసింది. ఎవరైనా ప్రశ్నించే అవకాశం ఉంటే వారికి ముందే నచ్చజెప్పి వస్తున్నారు. ఎమ్మెల్యేలు ఇంటింటికీ వస్తున్నారన్న విషయం తెలుసుకున్న సామాన్యులు వాట్సాప్ గ్రూపుల్లో సమస్యలను పోస్ట్ చేస్తున్నారు. డ్రైనేజీ, రోడ్లు, కరెంటు స్తంభాలు, డీపీలు, ఆస్పత్రుల్లో వసతులు ఇలా ఒకటేమిటి రకరకాల సమస్యలతో వాట్సాప్ గ్రూపులు మోత మోగుతున్నాయి.
‘సుపరిపాలన’ కరపత్రాల్లో
ఎస్సీ, ఎస్టీలపై దాడులు తగ్గాయని ముద్రణ
క్షేత్రస్థాయిలో భిన్నంగా పరిస్థితి
‘ఉమ్మడి అనంత’లో పెరిగిన అత్యాచారాలు, హత్య ఘటనలు
రైతులకు ఉచిత విద్యుత్ అంటూనే.. విపరీతంగా కోతలు
గంజాయి, డ్రగ్స్‌పై ఉక్కుపాదం అంటూ పత్రాల్లో భజన