
కూటమి మోసాలను ప్రజలందరికీ వివరిస్తాం
రొద్దం: అలవిగాని హామీలతో అధికారంలోకి వచ్చి ఏడాది కాలంలోనే అన్ని వర్గాలనూ మోసం చేసిన కూటమి సర్కార్ అసమర్థపాలనను ప్రజలందరికీ వివరించేందుకు వైఎస్సార్ సీపీ ‘బాబు ష్యూరిటీ.. మోసం గ్యారెంటీ’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీచరణ్ అన్నారు. బుధవారం ఆమె రొద్దంలో పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక వైఎస్సార్ విగ్రహం వద్ద పార్టీ నేతలతో కలిసి క్యూఆర్ కోడ్‌తో రూపొందించిన ‘బాబు ష్యూరిటీ.. మోసం గ్యారెంటీ’ పోస్టర్లను ఆవిష్కరించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ..కూటమి సర్కార్ చేసిన మోసాలను ప్రజలందరికీ వివరిస్తామన్నారు. ఆరు వారాలపాటు జరిగే ఈ కార్యక్రమాన్ని జిల్లాలోని గ్రామగ్రామానా నిర్వహిస్తామన్నారు. చంద్రబాబు ఇచ్చిన హామీలు..అమలు తీరు..ఏడాది కూటమి పాలనలో ఒక్కో కుటుంబం ఎంతమేర నష్టపోయిందో వివరిస్తామన్నారు.
ఒక్క హామీ నెరవేర్చలేకపోయారు..
ఎన్నికల వేళ చంద్రబాబు ప్రజలందరికీ అరచేతిలో వైకుంఠం చూపారన్నారు. ప్రభుత్వ పథకాలు అందిస్తామంటూ గ్యారెంటీ వారంటీ కార్డులు ఇచ్చారన్నారు. కానీ ఏడాది పాలనలో ఒక్క హామీ నెరవేర్చలేకపోయారన్నారు. నిరుదోగ్య భృతి, అన్నదాత సుఖీభవ, ఆడబిడ్డలకు నెలకు రూ.1,500 ఆర్థిక సాయం, 20 లక్షల ఉద్యోగాలు ఇలా ఏ ఒక్కటీ అమలు చేయలేకపోయారన్నారు. ‘తల్లికి వందనం’ అమలుకూ సవాలక్ష ఆంక్షలు పెట్టారన్నారు. ఉచిత గ్యాస్ ఎవరికి అందుతుందో కూడా తెలియడం లేదన్నారు. పెనుకొండ నియోజకవర్గం నుంచే ప్రాతినిథ్యం వహిస్తున్న బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత... బీసీలకు 50 ఏళ్లకే పింఛన్ పథకం గురించి మాట్లాడటం లేదన్నారు. ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. హామీల నుంచి ప్రజల దృష్టి మరల్చడానికి చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని మండిపడ్డారు. అంతకుముందు ఉషశ్రీచరణ్ వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్ బి.తిమ్మయ్య, ఎంపీటీసీ సభ్యురాలు కురుబ రత్నమ్మ, వైఎస్సార్ సీపీ వాల్మీకి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పొగాకు రామంద్ర, నాయకులు ఎన్. నారాయణరెడ్డి, చిలకల రవి, సి.నారాయణరెడ్డి, సినిమా నారాయణ, లక్ష్మీనారాయణరెడ్డి, అమీర్, నరేంద్రరెడ్డి, తిమ్మయ్య, జట్టి శ్రీనివాస్‌రెడ్డి, వినయ్‌కుమార్‌రెడ్డి, పలువురు సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షురాలు
ఉషశ్రీచరణ్