
‘పురం’ మున్సిపాలిటీ నిధులకు కన్నం
చిలమత్తూరు: హిందూపురం మున్సిపాలిటీ ఆదాయానికి కన్నం వేశారు. ఆప్టికల్ ఫైబర్ కేబుల్ పనులకు గానూ ఎయిర్‌టెల్ సంస్థ నుంచి మున్సిపాలిటీకి రావాల్సిన మొత్తంలో ఏకంగా రూ. 33.94 లక్షలు కోత వేశారు. ఇలా ఓ ప్రైవేటు సంస్థకు లబ్ధి కలిగేలా వ్యవహరించిన వైనం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది.
ఏం జరిగిందంటే.....
పట్టణంలో ఆప్టికల్ ఫైబర్ కేబుల్ వేసేందుకు భారతీ ఎయిర్‌టెల్ సంస్థ సిద్ధమైంది. కేబుల్ వైరు వేసేందుకు మెటల్ రోడ్డు, సీసీ రోడ్లను తవ్వాల్సి ఉంటుంది. ఇందుకు కలిగే నష్టానికి గానూ మున్సిపాలిటీకి నిర్ణయించిన మొత్తాన్ని డీడీ రూపంగానో, నేరుగా మున్సిపాలిటీ బ్యాంకు ఖాతాలోనో జమ చేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలో జూన్ నెలలో పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో 7,700 మీటర్లు సీసీ రోడ్డు, 2,200 మీటర్ల మేర మెటల్ రోడ్డుల గుండా ఫైబర్ కేబుల్ వేయాలని భారతీ ఎయిర్‌టెల్ సంస్థ నిర్ణయించుకుంది. ఇందుకు గానూ 2022–23 ధరలకు అనుగుణంగా పరిహారం చెల్లించేందుకు సిద్ధమైంది. అలాగే ప్రతి ఏటా 10 శాతం అదనంగా పెంచి అంచనాలు తయారు చేయాల్సి ఉంటుంది. 2022–23 ప్రకారం మీటరుకు రూ. 464 మేర మున్సిపాలిటీకి చెల్లించాల్సి ఉంది. ఏటా 10 శాతం పెంచితే..2025–26 సంవత్సరం నాటికి 30 శాతం అంచనా పెంచి మున్సిపాలిటీకి చెల్లించేలా అంచనాలు తయారు చేయాలి. ఆ లెక్కన మీటరుకు రూ.464 మేర చెల్లించాల్సి ఉండగా..మూడేళ్లకు 30 శాతం అదనంగా అంటే రూ. 139 చేరిస్తే మీటరుకు రూ. 603 చెల్లించాల్సి ఉంటుంది. అదే విధంగా మెటల్ రోడ్డుకు 2022–23 లెక్క ప్రకారం మీటరుకు రూ.295 చెల్లించాల్సి ఉంది. మూడేళ్లకు పెంచాల్సిన మొత్తం రూ.89 కాగా పాత ధరనే చెల్లించేలా అంచనాలు తయారు చేసి ఆమోదించారు. దీంతో మున్సిపాలిటీకి రావాల్సిన మొత్తంలో రూ.33.94 లక్షలు కోత పడింది. కాగా పాత ధరల మేరకే ఇప్పుడూ డబ్బు చెల్లించేలా టెలికాం సంస్థ యాజమాన్యానికి ఏఈ శంకర్ ఈ ఎస్టిమేషన్ వేసి డిమాండ్ నోటీసు ఇవ్వడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సంస్థకు రాసిన లేఖలో సీసీ రోడ్డు అని పేర్కొనగా, ధర మాత్రం మెటల్ రోడ్డుగా ఉంది.
అధికారపార్టీ నేతల పాత్రపై అనుమానాలు..?
ఈ తతంగం వెనుక అధికార పార్టీ నేతల హస్తం ఉన్నట్టుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. టెలికాం సంస్థ నుంచి మున్సిపాలిటీకి అందాల్సిన నిధులు ఎమ్మెల్యే కార్యాలయానికి మళ్లినట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మున్సిపాలిటీకి రూ.లక్షలు నష్టం కలిగేలా కొందరు నేతలు అధికారులతో చేతులు కలిపి ఈ కుంభకోణం చేసినట్టుగా ఆరోపణలు గుప్పుమంటున్నాయి.
టెలికాం రిస్టోరేషన్‌లో అవకతవకలు
రూ.33.94 లక్షలు దారి మళ్లినట్లు
అనుమానాలు