
ఈదురు గాలులతో భారీ వర్షం
పుట్టపర్తి అర్బన్/తాడిమర్రి: ఖరీఫ్ సీజన్ ఆరంభానికి ముందే పలకిరించిన వరుణుడు ముందస్తుగా మురిపిస్తున్నాడు. శనివారం రాత్రి కూడా జిల్లాలోని పలు మండలాల్లో భారీ వర్షం కురిసింది. ముఖ్యంగా జిల్లా కేంద్రం పుట్టపర్తిలో భారీ వర్షం కురవడంతో వీధులన్నీ జలమయమయ్యాయి. పలు ప్రాంతాల్లో కరెంటు సరఫరా నిలిచిపోవడంతో అంధకారం నెలకొంది. ఇక శుక్రవారం రాత్రి జిల్లాలోని 10 మండలాల పరిధిలో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. అత్యధికంగా సోమందేపల్లి మండలంలో 29.2 మి.మీ వర్షపాతం నమోదైంది. ఇక పెనుకొండ మండలంలో 26 మి.మీ, బత్తలపల్లి 24.4, ముదిగుబ్బ 22.4, సీకే పల్లి 16.6, తాడిమర్రి 6.2, గాండ్లపెంట 2, ఎన్‌పీ కుంట 1.6, ధర్మవరం 1.2, పరిగి మండలంలో ఒక మి.మీ చొప్పున వర్షం కురిసింది. రాగల రెండు రోజులూ జిల్లాకు వర్ష సూచన ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. శుక్రవారం రాత్రి కురిసిన వర్షానికి తాడిమర్రి మండలంలో కురిసిన వర్షానికి గుడ్డంపల్లి గ్రామంలో కోడిమూర్తి ఓబుళపతికి చెందిన అరటితోటలో తీవ్రంగా దెబ్బతినింది. కాపునకు వచ్చిన 4,000 అరటిచెట్లు నేలకు ఒరిగాయి. దీంతో రూ.10 లక్షల వరకు నష్టం వాటిల్లిందని రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.
సోమందేపల్లిలో 29.2 మి.మీ
వర్షపాతం నమోదు
తాడిమర్రిలో నేలకొరిగిన అరటిచెట్లు