
‘ఉద్యోగ భద్రతా సర్క్యులర్ అమలు చేయాలి’
పుట్టపర్తి టౌన్: ఆర్టీసీలో ఉద్యోగ భద్రతా సర్క్యులర్‌ను వెంటనే అమలు చేయాలని ఎన్‌ఎంయూఏ రాష్ట్ర కార్యదర్శి ఎర్రిస్వామి, జాయింట్ సెక్రటరీ నాగరాజు డిమాండ్ చేశారు. తమ న్యాయపరమైన డిమాండ్ల సాధనలో భాగంగా రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మంగళవారం చలో డీపీటీఓ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన నిరసన కార్యక్రమంలో వక్తలు మాట్లాడుతూ.. చిన్నపాటి కారణాలతో కార్మికులపై వేధింపులకు గురి చేయడం సబబు కాదన్నారు. సిబ్బందికి చెల్లించాల్సిన పెండింగ్ డీఏలు విడుదల చేయాలని, మహిళా సిబ్బందికి చైల్డ్‌కేర్ లీవ్‌లు మంజూరు చేయాలని, గ్యారేజ్ సిబ్బందిపై వేధింపులు మానాలని, ఆఫీస్ సిబ్బందికి సరైన కంప్యూటర్లు, ఫర్నీచర్ ఏర్పాటు చేయాలని, సంస్థలో ఖాళీగా ఉన్న 12వేల పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఎన్‌ఎంయూఏ జోనల్ అధ్యక్షుడు నాగశేఖర్, జిల్లా అధ్యక్షుడు ముత్యాలప్ప, శ్రీరామనాయక్, వర్కింగ్ ప్రెసిడెంట్ రాజారెడ్డి, జిల్లా కార్యదర్శి షబ్బీర్, రీజనల్ ఉపాధ్యక్షుడు తిరుపతమ్మ, జాయింట్ సెక్రటరీ విజయమ్మ,తో పాటు ఆరు డిపోల నాయకులు, కార్మికులు పాల్గొన్నారు.