ప్రైవేటు టీచర్ల మెడపై అడ్మిషన్ల కత్తి! | - | Sakshi
Sakshi News home page

ప్రైవేటు టీచర్ల మెడపై అడ్మిషన్ల కత్తి!

May 12 2025 1:04 AM | Updated on May 12 2025 1:04 AM

ప్రైవ

ప్రైవేటు టీచర్ల మెడపై అడ్మిషన్ల కత్తి!

రాయదుర్గం: ప్రైవేటు పాఠశాలల ఉపాధ్యాయులపై అడ్మిషన్ల కత్తి వేలాడుతోంది. 2025–26 విద్యా సంవత్సరానికి నెల రోజుల ముందే విద్యార్థుల ప్రవేశాలకు టార్గెట్‌ విధిస్తూ.. సిబ్బందిని ఆయా పాఠశాలల యాజమాన్యాలు వేధింపులకు గురిచేస్తున్నాయి. పిల్లలను చేర్పిస్తేనే కొలువు ఉంటుందని, లేకపోతే ఇతర జీవనోపాధులు చూసుకోవాలంటూ హెచ్చరికలు జారీ చేశాయి. దీంతో తమ ఉద్యోగ భద్రత కోసం ప్రైవేట్‌ పాఠశాలల ఉపాధ్యాయులు ఇంటింటికీ తిరిగి అడ్మిషన్ల కోసం తల్లిదండ్రులను ప్రాధేయపడుతున్నారు.

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి..

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు ప్రాథమిక పాఠశాలలు 3,243, ప్రాథమికోన్నత 502, ఉన్నత పాఠశాలలు 1,539 ఉన్నాయి. వీటిలో 1,270కు పైగా ప్రైవేట్‌, కార్పొరేట్‌ పాఠశాలలు, ఉన్నాయి. వీటన్నింటిలో 2024–25 విద్యా సంవత్సరంలో 1 నుంచి 8వ తరగతి వరకు చదివే విద్యార్థులు 3,57,363 మంది, 9 నుంచి 10వ తరగతి వరకు చదివే విద్యార్థులు 87,897 మంది ఉన్నారు. 2025–26 విద్యా సంవత్సరానికి గాను ప్రైవేట్‌, కార్పొరేట్‌ పాఠశాలల యాజమాన్యాలు వేసవి సెలవుల్లోనే తరగతుల వారీగా అడ్మిషన్ల వేట మొదలు పెట్టాయి. ఇందు కోసం తమ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు టార్గెట్లు నిర్దేశించి అడ్మిషన్లు చేయించగలిగితేనే ఉద్యోగాలు ఉంటాయని, లేకపోతే ఇంటికెళ్లాల్సి ఉంటుందని హెచ్చరికలు జారీ చేశాయి. ఈ వేధింపులు తారాస్థాయికి చేరుకోవడంతో రాయదుర్గంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న ఇద్దరు మహిళా ఉపాధ్యాయులు ఉద్యోగాలు మానుకున్నారు.

భారీగా ఫీజులు..

విద్యాహక్కు చట్టం ప్రకారం ప్రైవేటు పాఠశాలల్లో ప్రభుత్వం నిర్ణయించిన మేరకే ఫీజులు వసూలు చేయాల్సి ఉంది. అయితే ఈ నిబంధన జిల్లాలోని ఏ ప్రైవేట్‌ పాఠశాలలోనూ అమలు కావడం లేదు. నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీ స్థాయి నుంచే భారీగా ఫీజులు దండుకుంటున్నారు. టెక్నో, ఈ టెక్నో, సీబీఎస్‌ఈ, ఐఐటీ కోచింగ్‌, అబాకస్‌, స్ఫోకెన్‌ ఇంగ్లిష్‌, కరాటే, డ్రాయింగ్‌, బాక్సింగ్‌, పేరుతో విద్యార్థుల తల్లిదండ్రులపై ఫీజుల భారాన్ని మోపుతున్నారు. దీనికి అదనంగా యూనిఫాంలు, పుస్తకాలు, నోట్‌బుక్స్‌, బూట్లు, సాక్సులు, టై లాంటివి ఆయా పాఠశాలల్లోనే అధిక ధరకు విక్రయాలు చేపట్టారు.

చాలీచాలని వేతనాలు..

ప్రైవేటు పాఠశాలల్లో పనిచేసే టీచర్లకు యాజమాన్యాలు చాలీచాలని వేతనాలిస్తూ వారి జీవితాలతో చెలగాటమాడుతున్నాయి. ప్రాథమిక స్థాయి విద్యాబోధకులకు నెలకు రూ.4,500 నుంచి రూ.5 వేలు చొప్పున చెల్లిస్తున్నాయి. ప్రభుత్వ జీఓ ప్రకారం విద్యార్థుల నుంచి వసూలు చేసే ఫీజులో 59 శాతం ఉపాధ్యాయుల వేతనాలకు కేటాయించాలి. కానీ, ఈ విధానం ఎక్కడేగాని అమలు కావడం లేదు.

ఎన్నికల ప్రచారంలా ఊరూర క్యాంపెయినింగ్‌

టెక్నో, ఈ టెక్నో, సీబీఎస్‌ఈ పేరుతో

విద్యార్థులకు వల

చాలా పాఠశాలల్లో కనీస సౌకర్యాలు కరువు

తడిసిమోపడవుతున్న ఫీజులు

అడ్మిషన్ల పేరుతో వేధిస్తే చర్యలు

అడ్మిషన్ల కోసం విద్యార్థుల తల్లిదండ్రులను , టీచర్లను వేధింపులకు గురిచేస్తే ప్రైవేటు పాఠశాలల యజమానులపై కఠిన చర్యలు చేపడతాం. ప్రభుత్వం నుంచి అనుమతులు వచ్చాకే అడ్మిషన్లు చేపట్టాలి. దీనికి విరుద్దంగా వ్యవహరిస్తే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ప్రతి ఒక్కరు ప్రభుత్వ బడుల్లో చేరేలా అవగాహన కల్పిస్తున్నాం.

– ప్రసాద్‌బాబు, డీఈఓ, అనంతపురం

చర్యలు తీసుకోవాలి

అడ్మిషన్ల పేరుతో ప్రైవేటు ఉపాధ్యాయుల్ని యాజమాన్యం వేధింపులకు గురిచేస్తోంది. ప్రభుత్వ నిబంధనలకు విరుద్దంగా వేసవి సెలవుల్లోనే అడ్మిషన్లు మొదలు పెట్టారు. దీనికి వ్యతిరేకంగా ఇటీవల రాయదుర్గంలోని నారాయణ స్కూల్‌ ఎదుట విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన కూడా నిర్వహించాం. విద్యాశాఖ అధికారులు పరిశీలించి కట్టడి చేయాలి. ముందస్తు పాఠ్య, నోట్‌ పుస్తకాలు, షూ, బెల్టు లాంటి విక్రయాలు చేపట్టకుండా చర్యలు తీసుకోవాలి.

– ఆంజనేయులు, ఏఐఎస్‌ఎఫ్‌ జిల్లా కోశాధికారి, రాయదుర్గం

ప్రైవేటు టీచర్ల మెడపై అడ్మిషన్ల కత్తి!1
1/1

ప్రైవేటు టీచర్ల మెడపై అడ్మిషన్ల కత్తి!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement