
బస్సు బోల్తా –15 మందికి గాయాలు
గోరంట్ల: మండలంలోని మిషన్‌తండా సమీపంలో జాతీయ రహాదారిపై శుక్రవారం రాత్రి కియా అనుబంధ పరిశ్రమ హూయంగ్‌కు చెందిన బస్సు బోల్తాపడింది. ఘటనలో 15 మంది కార్మికులు గాయపడ్డారు. కార్మికులందరూ ఓడిసీ మండలానికి చెందిన వారిగా తెలుస్తోంది. క్షతగాత్రులను 108 వాహనంలో హిందూపురంలోని ఆస్పత్రికి తరలించారు.
విమానాశ్రయంలో సీఎంకు స్వాగతం
పుట్టపర్తి టౌన్: స్థానిక సత్యసాయి విమానాశ్రయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకు ఘన స్వాగతం లభించింది. అనంతపురం జిల్లా పర్యటనలో భాగంగా సీఎం శుక్రవారం విజయవాడ గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో మధ్యాహ్నం 12 గంటలకు పుట్టపర్తికి చేరుకున్నారు. ఈసందర్భంగా ఆయనకు రాష్ట్ర మంత్రులు టీజీ భరత్, సవిత, ఎంపీ పార్థసారథి, ఎమ్మెల్యేలు పల్లె సింధూరారెడ్డి, ఎమ్‌ఎస్‌రాజు, కందికుంట ప్రసాద్, సత్యసాయి ట్రస్టు ప్రతినిధి చలం, కలెక్టర్ టీఎస్ చేతన్, జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్, ఎస్పీ రత్న, ఆర్డీఓ సువర్ణ స్వాగతం పలికారు. అనంతరం సీఎం ప్రత్యేక హెలీక్యాఫ్టర్‌లో ఉరవకొండకు బయలుదేరి వెళ్లారు.
దళిత రైతుల పురోగతికి సాంకేతిక పరిజ్ఞానం
అనంతపురం: జిల్లాలోని దళిత రైతుల పురోగతికి ఆధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ప్రాజెక్ట్ నిర్వహణను జేఎన్‌టీయూ(ఏ) దక్కించుకుంది. డిపార్ట్‌మెంటల్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, న్యూఢిల్లీకి చెందిన సీడ్ (సైన్స్ ఫర్ ఈక్విటీ, ఎంపవర్‌మెంట్ అండ్ డెవలప్‌మెంట్) విభాగం ద్వారా అమలవుతున్న ఎస్సీ (షెడ్యూల్ కాస్ట్) హబ్ కింద రూ.47,62,047 నిధులు మంజూరయ్యాయి. ఈ ప్రాజెక్ట్‌ను జేఎన్‌టీయూ (ఏ) క్యాంపస్ కళాశాల సివిల్ ఇంజినీరింగ్ ప్రొఫెసర్, మాజీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ సి.శశిధర్, ఎలక్ట్రానిక్స్ ప్రొఫెసర్ ఎస్. చంద్రమోహన్‌రెడ్డి, కెమికల్ విభాగం ప్రొఫెసర్ బి.దిలీప్‌కుమార్, ఎలక్ట్రికల్ విభాగం డాక్టర్ జి. మమత నిర్వహించనున్నారు. మూడేళ్ల గడువున్న ఈ ప్రాజెక్ట్ ద్వారా వేరుశనగ ద్వారా నూనె, స్నాక్స్, టమాట ద్వారా సాస్, డ్రై టమాట వంటి విలువ జోడింపు ఉత్పత్తుల తయారీకి శిక్షణ ఇవ్వనున్నారు. అలాగే రైతులకు మార్కెట్ లింకేజీలు, నిల్వ సౌకర్యాలు, ఉత్పత్తుల బ్రాండింగ్ వంటి అంశాలపై మద్దతునివ్వనున్నారు. ప్రత్యేకంగా దళిత రైతులకు నైపుణ్య శిక్షణా శిబిరాలు, వ్యవసాయ ప్రదర్శన క్షేత్రాలు, మార్కెట్ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తారు.ఈ సందర్భంగా పరిశోధక బృందాన్ని శుక్రవారం జేఎన్‌టీయూ వీసీ హెచ్.సుదర్శనరావు అభినందించారు.

బస్సు బోల్తా –15 మందికి గాయాలు

బస్సు బోల్తా –15 మందికి గాయాలు