
స్కీమ్‌లో స్కాం లేకపోతే ఉలుకెందుకు?
పెనుకొండ రూరల్: కుటు శిక్షణ స్కీమ్‌లో స్కామ్ లేకపోతే ఉలుకెందుకని మంత్రి సవితను వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షురాలు కేవీ ఉష శ్రీచరణ్ ప్రశ్నించారు. వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని విమర్శించే స్థాయి సవితకు లేదన్నారు. శుక్రవారం ఉధయం నాగళూరులో కాఫీ విత్ వైఎస్సార్ సీపీ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె.. స్థానిక విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కుట్టు శిక్షణ మొత్తం ప్రక్రియ ఓ పెద్ద స్కామ్ అన్నారు. ఇందులో స్కాం జరగకపోతే మహిళలకు కుట్టు మిషన్ కిట్టు ఎందుకు పంపిణీ చేయలేదని ప్రశ్నించారు. రోజూ ఎనిమిది గంటల శిక్షణ అంటూ నాలుగు గంటలకే ఎందుకు కుదించారన్నారు. శిక్షణా కేంద్రంలో కనీస సౌకర్యాలు కూడా కల్పించలేదన్నారు. మంత్రి సవిత సవాల్‌ను తాము స్వీకరిస్తున్నామని, దమ్ముంటే బీసీ సంక్షేమ శాఖ మాజీ మంత్రి మాలగుండ్ల శంకరన్న సమక్షంలోనే బహిరంగ చర్చకు సిద్ధం కావాలని సవాల్ విసిరారు. వేధిక, టైం నిర్ధారణ మంత్రి సవితనే చెప్పాలన్నారు. బీసీ సాధికారిత ప్రభుత్వంగా చెప్పుకునే మంత్రి ఎన్నికల వాగ్ధానాలలో భాగంగా బీసీలకు ఇచ్చిన 50 ఏళ్లకే పింఛన్ ఏమైందో చెప్పాలన్నారు. ఇప్పటి వరకూ తల్లికి వందనం ఊసే లేదన్నారు. అర్హత కలిగిన ప్రతి బీసీ మహిళకు రూ.18వేల అందించి, జీవనోపాధులు మెరుగు పరిచిన ఘనత వైఎస్సార్‌సీపీకే దక్కుతుందన్నారు. అర్హతే ప్రామాణికంగా సంక్షేమ పథకాలు అందించిన ఘనత వైఎస్ జగన్‌కే సొంతమన్నారు. అక్రమంగా మైనింగ్, క్రషర్లు నడుపుతూ వ్యాపారులను పెనుకొండలోకి రాకుండా అడ్డుకున్న నీచ చరిత్ర మంత్రి సవితదన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ వాల్మీకి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పొగాకు రామచంద్ర, పట్టణ, మండల కన్వీనర్లు సుధాకర్ రెడ్డి, నరసింహులు, మాజీ కన్వీనర్లు బాబు, శ్రీకాంతరెడ్డి, సింగిల్‌విండో మాజీ అధ్యక్షుడు ప్రకాష్‌రెడ్డి, వైశాలి జయశంకరరెడ్డి, కొండలరాయుడు, గోపాలరెడ్డి, చెన్నకేశవులు తదితరులు పాల్గొన్నారు.
సవాల్‌ను స్వీకరిస్తున్నాం
దమ్ముంటే బహిరంగ చర్చకు రండి
వైఎస్ జగన్‌ను విమర్శించే స్థాయి
సవితకు లేదు
వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షురాలు
ఉష శ్రీచరణ్