
ఇంధన సహాయకుల జీవితాలతో ఆడుకోవద్దు
ధర్మవరం రూరల్: రాష్ట్రంలో సచివాలయ ఉద్యోగులతో పాటు నియమితులైన ఇంధన సహాయకుల జీవితాలు కూటమి ప్రభుత్వ తీరుతో ఆగమ్యగోచరంగా మారాయని ఆంఽధ్రప్రదేశ్ వార్డు, గ్రామ సచివాలయాల ఎనర్జీ ఎంప్లాయీస్ అసోషియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు పుల్లగమ్మి రాజు మండిపడ్డారు. శుక్రవారం ఆ సంఘం జిల్లా నాయకులతో కలిసి స్థానికంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సచివాలయాల్లోని అన్ని శాఖలకు సంబంఽధించి మార్పులు చేస్తున్నారన్నారు. ఉద్యోగులకు నిర్ధిష్టమైన చానల్ కల్పిస్తూ ఆయా శాఖల అధికారులు చర్యలు తీసుకుంటున్నారన్నారు. అయితే ఎనర్జీ అసిస్టెంట్ల విషయంలో ఇప్పటి వరకూ ఎలాంటి మార్పులు చేయలేదన్నారు. కమిటీల పేరుతో కాలయాపన చేస్తూ జీవితాలతో ఆడుకుంటున్నారని ధ్వజమెత్తారు. విధి నిర్వహణలో భాగంగా గడిచిన 5 ఏళ్లలో 140 మంది ఇంధన సహాయకులు మృత్యువాత పడ్డారన్నారు. 250 మంది తీవ్రంగా గాయపడిన సంఘటనలూ ఉన్నాయన్నారు. ఇంధన సహాయకుల కుటుంబాలు రోడ్డున పడుతున్నా విద్యుత్ శాఖ ఉన్నతాధికారుల్లో చలనం లేకపోవడం బాధాకరమన్నారు. ఇంధన సహాయకులకు న్యాయం చేకూరకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో జిల్లా నాయకులు మల్లికార్జునరెడ్డి, సుధీర్, పవన్, రాజేష్, మధు తదితరులు పాల్గొన్నారు.
సచివాలయ ఎనర్జీ ఎంప్లాయీస్
అసోషియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు రాజు