
భక్తిశ్రద్ధలతో ఈశ్వరమ్మ వర్ధంతి
ప్రశాంతి నిలయం: సత్యసాయి మాతృమూర్తి ఈశ్వరమ్మ వర్ధంతిని మంగళవారం వేలాది భక్తుల నడుమ భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఏటా మే 6న ఈశ్వరమ్మ వర్ధంతిని పురస్కరించుకుని ఈశ్వరమ్మ డే నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. పుట్టపర్తిలోని సమాధి రోడ్డులో ఉన్న సత్యసాయి తల్లిదండ్రులు ఈశ్వరమ్మ, పెద వెంకమరాజుల ఘాట్‌లను ప్రత్యేకంగా అలంకరించారు. ఈశ్వరమ్మ విగ్రహానికి సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ ఆర్.జె.రత్నాకర్ రాజు దంపతులు, ట్రస్ట్ సభ్యుడు చక్రవర్తి పూలమాలలు వేసి, పూజలు చేశారు. సత్యసాయి విద్యాసంస్థల విద్యార్థులు, భక్తులు ఈశ్వరమ్మను కొనియాడుతూ భక్తిగీతాలు ఆలపించారు. అనంతరం అన్న దానం చేశారు. అలాగే సాయికుల్వంత్ సభా మందిరంలోని సత్యసాయి మహాసమాధి చెంత రెండు వందల మంది పేద భక్తుల జీవనోపాదుల కోసం ఆర్.జె.రత్నాకర్‌రాజు దంపతులు కుట్టుమిషన్లు, గ్రైండర్‌లు, వీల్‌చైర్‌లు, స్ప్రేయర్లు, ఎలక్ట్రీషియన్ కిట్‌లు పంపిణీ చేశారు. సాయంత్రం ఏపీ బాలవికాస్ విద్యార్థులు సత్యసాయి మాతృమూర్తి ఈశ్వరమ్మ జీవిత ఘట్టాలను వివరిస్తూ ‘విశ్వ జననీ ఈశ్వరమ్మ’ పేరుతో నాటికను ప్రదర్శించారు.

భక్తిశ్రద్ధలతో ఈశ్వరమ్మ వర్ధంతి