
అనంతపురం, శ్రీ సత్యసాయి ఎస్పీలపై సర్వత్రా విమర్శలు
● పోస్టుల కోసం శాంతిభద్రతల్ని
గాలికొదిలేశారనే ఆరోపణలు
● రామగిరి హెలీప్యాడ్ ఘటనలో వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు 71 మందిపై కేసులు
● హైకోర్టు ఆదేశాలిచ్చినా పెద్దారెడ్డిని తాడిపత్రికి వెళ్లనివ్వని దుస్థితి
● ఉమ్మడి జిల్లాలో చర్చనీయాంశంగా పోలీసు బాస్‌ల తీరు
సాక్షి ప్రతినిధి, అనంతపురం: శాంతిభద్రతల పరిరక్షణ విషయంలో అనంతపురం ఎస్పీ జగదీష్, శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ రత్న ఘోర వైఫల్యం చెందారనే విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. రెడ్‌బుక్ రాజ్యాంగానికి కంకణ బద్ధులై పనిచేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఓవైపు మట్టి, ఇసుక దోపిడీ యథేచ్ఛగా జరుగుతోంది. మరోవైపు అసాంఘిక కార్యకలాపాలు జోరుగా సాగుతున్నాయి. గంజాయి విచ్చలవిడిగా లభ్యమవుతోంది. మట్కా మూడుపువ్వులు ఆరు కాయలు అన్నట్లుగా సాగిపోతోంది. ఇవన్నీ పక్కనపెడితే టీడీపీ నాయకుల ఆగడాలకు అడ్డూఅదుపు లేకుండా పోతోంది. ఇంత జరుగుతున్నా తమకేమీ పట్టనట్లు మిన్నకుండిపోతున్న పోలీసు బాస్‌లు.. ‘పచ్చ’ నేతలు చెప్పిందే వేదంగా నడుచుకుంటూ అభాసుపాలవుతున్నారనే చర్చ ఉమ్మడి జిల్లావ్యాప్తంగా సాగుతోంది.
ఇందుకేనా..
తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు ఉమ్మడి అనంతపురం జిల్లాలో పోలీసులు పడుతున్న పాట్లు అన్నీ ఇన్నీ కావు. ఇటీవల రామగిరి మండలం పాపిరెడ్డిపల్లికి చెందిన కురుబ లింగమయ్య టీడీపీ నేతల చేతిలో దారుణ హత్యకు గురయ్యారు. ఈ క్రమంలో పాపిరెడ్డిపల్లిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నా పోలీసులు పట్టించుకోలేదు. ఇది ఖాకీల మొదటి వైఫల్యం కాగా.. బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు మాజీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి వస్తే హెలీప్యాడ్ దగ్గర జనాన్ని నియత్రించలేక చేతులెత్తేయడం మరో వైఫల్యం. అక్కడ డీఎస్పీ స్థాయి అధికారి ఉండి కూడా ‘హెలీప్యాడ్’ ఘటన చోటుచేసుకోవడం రాష్ట్ర పోలీసు చరిత్రలోనే పెద్ద మచ్చగా మిగిలిపోయింది. అయితే, తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు రివర్స్ కేసులకు తెరలేపడం గమనార్హం. రాష్ట్ర చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా ఒక ఘటనలో 71 మందిపై కేసులు పెట్టడం ఇదే మొదటిసారి అని చెబుతున్నారు. జగన్ రాక సందర్భంగా వచ్చిన జనాన్ని నియంత్రించేందుకు శాయశక్తులా ప్రయత్నించిన మాజీ ఎమ్మెల్యే ప్రకాష్‌రెడ్డిపైనా కేసుల మీద కేసులు పెట్టి వేధింపులకు తెరతీయడం గమనార్హం.
హైకోర్టు చెప్పినా...
రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా తాడిపత్రి నియోజకవర్గంలో ప్రత్యేక రాజ్యాంగం నడుస్తున్నట్లు పోలీసులు వ్యవహరిస్తున్నారు. ఎన్నికలు జరిగి ఏడాది కావస్తున్నా మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డిని ప్రస్తుత ఎమ్మెల్యే అస్మిత్‌రెడ్డి తండ్రి ప్రభాకర్‌రెడ్డి పట్టణంలోకి రానివ్వకుండా కుయుక్తులు పన్నుతున్నారు. దాడులకు తెర తీస్తున్నారు. ఇటీవల స్వయానా హైకోర్టే పెద్దారెడ్డికి తగిన భద్రత కల్పించి, తాడిపత్రికి పంపించాలని ఆదేశించినా పోలీసులు ఆ మేరకు చర్యలు తీసుకోవడం లేదు. ఏకంగా ఐపీఎస్ అధికారిని తాడిపత్రికి ఏఎస్పీగా వేసినా ఏమీ చేయలేని దుస్థితి. దీన్నిబట్టి తాడిపత్రిలో రౌడీరాజ్యం ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఒక మాజీ ఎమ్మెల్యేకు రక్షణ కల్పించలేని దుస్థితిలో జిల్లా పోలీసులు ఉన్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నా ఎస్పీ జగదీష్ మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారనే చర్చ జరుగుతోంది. తమ పోస్టులు కాపాడుకుంటే చాలు ఏది ఏమైనా కానీ అన్న రీతిలో రెండు జిల్లాల ఎస్పీలు ముందుకు సాగుతున్నారనే అంశం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. విచ్చలవిడిగా మట్కా, జూదం జరుగుతుండటం, మద్యం ఏరులై పారుతుండటం, దొంగతనాలు భారీగా పెరిగి రెండు జిల్లాల్లోనూ అధ్వాన పరిస్థితులు నెలకొన్నా పట్టించుకోని పోలీసు బాస్‌లు.. లోకేష్ రెడ్‌బుక్ రాజ్యాంగానికి అనుగుణంగా నడుచుకుంటుండటంపై తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి.

అనంతపురం, శ్రీ సత్యసాయి ఎస్పీలపై సర్వత్రా విమర్శలు