
రైతు ఉసురు తీసిన అప్పులు
వజ్రకరూరు: అప్పులు ఓ గిరిజిన రైతు ఉసురు తీశాయి. వెంకటాంపల్లి పెద్దతండా (రూప్లానాయక్ తండా)లో శనివారం సబావత్ సామునాయక్ (44) అనే రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు, బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. సబావత్ సాము నాయక్‌కు నాలుగు ఎకరాల పొలం ఉంది. అందులో ఏడుదాకా బోర్లు వేయించాడు. బోర్ల ద్వారా వచ్చే నీటి ఆధారంగా మూడేళ్లుగా మిరప సాగు చేస్తున్నాడు. మరో ఐదు ఎకరాలు కౌలుకు తీసుకుని వేరుశనగ పెట్టాడు. అయితే పంటలు ఆశించిన స్థాయిలో చేతికి రాకపోవడంతో ఆర్థికంగా నష్టపోయాడు. పంటల సాగు, బోర్ల కోసం చేసిన అప్పులు రూ.16లక్షలకు చేరుకున్నాయి. వీటిని ఎలా తీర్చాలో అర్థం కాక రోజూ మదనపడుతుండేవాడు. శనివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో సబావత్ సామునాయక్ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పొలం పనులు ముగించుకుని వచ్చిన కుటుంబ సభ్యులు ఇంటి తలుపులు తట్టగా ఎంతకూ తీయలేదు. అనుమానం వచ్చి కిటికీలోంచి చూడగా సామునాయక్ ఉరికి వేలాడుతూ కనిపించడంతో గట్టిగా కేకలు వేశారు. దేవుడా ఇక తమకు దిక్కెవరు అంటూ కుటుంబ సభ్యులు రోదించారు. వారిని ఓదార్చడం ఎవరి తరమూ కాలేదు. వజ్రకరూరు ఎస్‌ఐ నాగస్వామి తన సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గుంతకల్లు ఆస్పత్రికి తరలించారు. రైతు సామునాయక్‌కు భార్య సామక్కబాయి, నలుగురు కుమారులు ఉన్నారు. ఎంపీపీ రమావత్ దేవి, సర్పంచ్ కొర్రా శివాజీ నాయక్ తదితరులు ఆస్పత్రికి చేరుకుని మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించారు.