క్రికెట్ బాల్ కోసం వెళ్లి విద్యుదాఘాతంతో విద్యార్థి మృతి
కుమారుడి మరణవార్తతో జైలులో ఉన్న తండ్రి వాల్మీకి లోకేష్‌కు అస్వస్థత
హుటాహుటిన ఆస్పత్రికి తరలించిన జైలు అధికారులు
హిందూపురం: పాఠశాల భవనంపై పడిన క్రికెట్ బాల్‌ను తీసుకునేందుకు వెళ్లిన ఓ విద్యార్థి విద్యుదాఘాతంతో మృతి చెందాడు. ఈ ఘటన శుక్రవారం హిందూపురం ముదిరెడ్డిపల్లిలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు...ముదిరెడ్డిపల్లికి చెందిన వైఎస్సార్ సీపీ నాయకుడు వాల్మీకి లోకేష్ కుమారుడు అశ్విన్ ఆరాధ్య (11) శుక్రవారం సాయంత్రం మిత్రులతో కలిసి క్రికెట్ ఆడుకుంటూ ఉన్నాడు. ఈ క్రమంలో బాల్ పక్కనే ఉన్న ప్రభుత్వ పాఠశాల భవనం పైన పడింది. బాల్‌ను తీసుకువచ్చేందుకు అశ్విన్ ఆరాధ్య భవనంపైకి వెళ్లాడు.
గతరాత్రి కురిసిన వర్షంతో భవనం మొత్తం తడిగా ఉండటం...బాల్ తీసుకునే క్రమంలో సమీపంలోని విద్యుత్ తీగలు తగలడంతో అశ్విన్ ఆరాధ్య గట్టిగా కేక వేసి అక్కడే పడిపోయాడు. వెంటనే కుటుంబ సభ్యులు, స్థానికులు పరుగున వెళ్లి బాలుడిని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. ఈ ఘటనపై హిందూపురం వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
జైలులో అస్వస్థతకు గురైన తండ్రి
టీడీపీ నేతలు పెట్టిన అక్రమ కేసులో రిమాండ్‌లో ఉన్న అశ్విన్ ఆరాధ్య తండ్రి వాల్మీకి లోకేష్ కుమారుడి మరణవార్త విని కన్నీరుమున్నీరయ్యాడు. కుమారుడిని తలచుకుని జైలులో కుప్పకూలిపోయాడు. తీవ్ర అస్వస్థతకు గురైన ఆయన్ను జైలు అధికారులు హుటాహుటిన జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.