బోర్డు లేదు.. సారు కానరారు | - | Sakshi
Sakshi News home page

బోర్డు లేదు.. సారు కానరారు

Sep 26 2023 12:14 AM | Updated on Sep 26 2023 12:14 AM

బోర్డు లేని సెబ్‌ కార్యాలయం  - Sakshi

బోర్డు లేని సెబ్‌ కార్యాలయం

సాక్షి, పుట్టపర్తి

ద్యం, ఇసుక అక్రమ రవాణా అరికట్టడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో (సెబ్‌) జిల్లాలో ఉందో, లేదో కూడా తెలియడం లేదు. శ్రీసత్యసాయి సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి జంక్షన్‌లో ఉన్న ఈ కార్యాలయం నుంచే ఏడాదిగా కార్యకలాపాలు సాగుతున్నాయి. కానీ ఆ విషయం మాత్రం ఎవరికీ తెలియదు. ఏదైనా పని నిమిత్తం ఆ కార్యాలయానికి వెళ్లేందుకు అధికారులనే అడిగి అటువైపు వెళ్లినా కనీసం బోర్డు కూడా లేకపోవడంతో గుర్తించలేని పరిస్థితి. ఇక్కడ సూపరింటెండెంట్‌గా రవికుమార్‌ కూడా రెండు నెలలుగా కార్యాలయంవైపు కన్నెత్తి చూడటం లేదు. ఆయన వ్యవహారాలన్నీ ఆన్‌లైన్‌లో నడిపిస్తున్నట్లు కార్యాలయ వర్గాలు చెబుతున్నాయి.

రెండు నెలలుగా దర్శనమివ్వని సారు..

జిల్లా సూపరింటెండెంట్‌ రవికుమార్‌ రెండు నెలలుగా జిల్లా కేంద్రంలో అడుగు పెట్టలేదు. అనంతపురం నుంచే కార్యకలాపాలు సాగిస్తున్నారు. జిల్లాలోని సిబ్బందితో వీడియో, ఆడియో కాన్ఫరెన్సుల ద్వారా సమాచారం తీసుకుని అడపాదడపా హిందూపురం, పెనుకొండలో సమావేశాలు నిర్వహించారు తప్ప ఏ ప్రాంతం వైపూ కన్నెత్తి చూడలేదు. ఈ మీటింగ్‌ల వెనుకా పెద్ద కథే ఉన్నట్లు తెలుస్తోంది. గత ఆగస్టు 1వ తేదీ నుంచి పరిశీలిస్తే.. ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఆయన జిల్లా కేంద్రం, జిల్లా సెబ్‌ కార్యాలయం సందర్శించిన దాఖలాలు లేవు. కానీ జిల్లాలోని మిగతా ప్రాంతాలకు మాత్రం అప్పుడప్పుడు వచ్చి వెళ్తున్నారు. అలా ఎందుకు వచ్చి వెళ్తారో..ఎవరిని కలుస్తారో కూడా చాలా కాన్ఫిడెన్షియల్‌గా జరుగుతుంది. సూపరింటెండెంట్‌ విధులు పూర్తిగా విస్మరించడంతో సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

నోటీసులు తీసుకోవాల్సి వస్తుందనేనా...?

సెబ్‌ సూపరింటెండెంట్‌ రవికుమార్‌ తన ఛాంబర్‌ను పడకగదిగా మార్చుకుని ఏకంగా మంచం వేసి దానిపై పడుకున్న చిత్రాలు రెండు నెలల క్రితం సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్‌ చేశాయి. పత్రికల్లోనూ కథనాలు ప్రచురితమయ్యాయి. దీంతో ఆ మరుసటి రోజే కలెక్టర్‌ షోకాజ్‌ నోటీసులిచ్చారు. 15 రోజుల్లో వివరణ ఇవ్వాలని అందులో ఉన్నా...సెబ్‌ సూపరింటెండెంట్‌ దాన్ని బేఖాతరు చేశారు. ఆ నోటీసులు తీసుకోవాల్సి వస్తుందనే ఆయన పుట్టపర్తి వైపు కన్నెత్తి చూడలేదని తెలుస్తోంది. దీనిపై కలెక్టర్‌ పి.అరుణ్‌బాబు కూడా సీరియస్‌ అయినట్లు తెలుస్తోంది.

విచారణ ఉత్తిదేనా?

ఇక సెబ్‌ అధికారి తన చాంబర్‌లో మంచంపై నుంచి విధులు నిర్వర్తించిన ఘటనపై విచారణ చేయాలని అదనపు ఎస్పీ ఎన్‌.విష్ణును ఎస్పీ ఎస్‌వీ మాధవ్‌రెడ్డి ఆదేశించారు. అయితే ఇప్పటి వరకు ఎలాంటి విచారణ చేసిన దాఖలాలు లేవు. దీనిపై అదనపు ఎస్పీని వివరణ కోరగా.. సెబ్‌ అధికారి అనారోగ్యం కారణంగా మంచంపై నుంచే విధులు నిర్వర్తిస్తే తప్పేంటని సమాధానం ఇచ్చారు.

‘సెబ్‌’లో అంతా ఇష్టారాజ్యం

కార్యాలయానికి బోర్డు సైతం

ఏర్పాటు చేయని అధికారులు

రెండు నెలలుగా ఆఫీసులో

కాలుపెట్టని సూపరింటెండెంట్‌

షోకాజ్‌ నోటీసులు అందుకోకుండా తప్పించుకు తిరుగుతున్న వైనం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement