
క్రీడల్లో ప్రతిభ చాటిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేస్తున్న వీసీ
అనంతపురం: మానవ వనరులు అపారంగా ఉండి జాతి పురోగతికి విశేషంగా కృషి చేస్తున్న యువశక్తిశీల దేశంగా భారత్ విరాజిల్లుతోందని జేఎన్‌టీయూ వీసీ ప్రొఫెసర్ జింకా రంగజనార్దన అన్నారు. జేఎన్‌టీయూ అనంతపురం ఇంజినీరింగ్ కళాశాల 76వ వార్షికోత్సవం సందర్భంగా మంగళవారం స్పోర్ట్స్‌డే నిర్వహించారు. అంతకుముందు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ పి.సుజాత అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథి వీసీ మాట్లాడుతూ రాష్ట్ర, జాతీయ స్థాయి క్రీడల్లో ప్రతిభ చాటి స్వర్ణం, రజతం, కాంస్య పతకాలు గెలుపొందే విద్యార్థులకు రూ.25 వేలు ప్రోత్సాహక బహుమతితో పాటు నెలకు రూ.10 వేల ఉపకార వేతనం అందిస్తామన్నారు. 2047 నాటికి భారత్ అగ్రరాజ్యంగా ఏర్పడి విశ్వగురుగా గుర్తింపు దక్కుతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. జాతీయ, దక్షిణ భారత అంతర్ వర్సిటీ స్థాయి పోటీల్లో గత విద్యా సంవత్సరంలో 25 మంది విద్యార్థులు క్రీడల్లో ప్రతిభ చాటారన్నారు. అనంతరం రిజిస్ట్రార్ ప్రొఫెసర్ సి.శశిధర్ మాట్లాడుతూ కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అన్నిచోట్లా జేఎన్‌టీయూ విద్యార్థులు క్రీడల్లో ప్రతిభ చాటారన్నారు. క్రీడలను కెరీర్‌గా ఎంచుకుని ఉన్నత శిఖరాలు అధిరోహించాలన్నారు. స్పోర్ట్స్ సెక్రెటరీ డాక్టర్ జోజిరెడ్డి, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఆర్. భవానీ, జనరల్ కెప్టెన్ అమృత్‌రాజ్ తదితరులు పాల్గొన్నారు.
జేఎన్‌టీయూఏ
వీసీ రంగజనార్దన ఆశాభావం
అట్టహాసంగా ఇంజినీరింగ్ కళాశాల 76వ వార్షికోత్సవం
క్రీడల్లో ప్రతిభ చాటే వారికి నెలకు రూ.10 వేల ఉపకారవేతనం