
పెనుకొండ: వాల్మీకుల సంక్షేమం కోసం కృషి చేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రుణం తీర్చుకోలేనిదని ఎమ్మెల్సీ మంగమ్మ, జెడ్పీ చైర్‌పర్సన్ బోయ గిరిజమ్మ అన్నారు. వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చేందుకు అసెంబ్లీ తీర్మానం చేసిన నేపథ్యంలో సోమవారం వారు వాల్మీకి నాయకులు, వైఎస్సార్ సీపీ నేతలతో కలిసి పట్టణంలో సీఎం వైఎస్ జగన్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. అనంతరం ఎమ్మెల్సీ మంగమ్మ, జెడ్పీ చైర్‌పర్సన్ గిరిజమ్మ మాట్లాడుతూ, వాల్మీకులు అన్ని విధాలుగా వెనుక బడి ఉన్నారని, దీన్ని గుర్తించిన సీఎం జగన్‌మోహన్‌రెడ్డి వాల్మీకుల స్థితి గతులను అధ్యయనం చేసి నివేదిక ఇచ్చేందుకు శామ్యూల్ ఆనంద్ కుమార్ నేతృత్వంలో ఏకసభ్య కమిషన్‌ను నియమించారన్నారు. కమిషన్ సిఫార్సు మేరకు వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చేందుకు తీర్మానం చేశారన్నారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇప్పటికే ప్రభుత్వంలోనూ, పార్టీలోనూ వాల్మీకులకు ఎన్నో పదవులు ఇచ్చి ప్రోత్సహిస్తున్నారన్నారు. అందువల్ల వాల్మీకులందరం జగనన్న వెంట నడవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యుడు శ్రీరాములు, వాల్మీకి సంఘం రాష్ట్ర నాయకులు పొగాకు రామచంద్ర, పాదయాత్ర నటేష్, వైఎస్సార్ సీపీ టౌన్ కన్వీనర్ బోయనరసింహ, నగర పంచాయతీ వైస్ చైర్మన్ సునీల్, వెంకటరత్నం, మునిమడుగు శ్రీనివాసులు, సత్తి, రామాంజనేయులు, రంగేపల్లి నరసింహ, గుట్టూరు నారాయణస్వామి తదితరులు పాల్గొన్నారు.