‘కుమారుడికి కిడ్నీ దానం చేస్తా.. అనుమతించండి’

కొండయ్య వినతిపత్రాన్ని పరిశీలిస్తున్న 
ఎస్పీ రాహుల్‌దేవ్‌ సింగ్‌ - Sakshi

కొత్తచెరువు: రెండు కిడ్నీలు చెడిపోయి చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న తన కుమారుడిని బతికించుకునేందుకు తన కిడ్నీని దానం చేసేందుకు ఓ తండ్రి సిద్ధమయ్యాడు. ఇందుకు సంబంధించి సాంకేతిక ఇబ్బందులు తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని ఎస్పీ రాహుల్‌దేవ్‌సింగ్‌ను కలసి విన్నవించారు. ఈ మేరకు సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో ఎస్పీ రాహుల్‌దేవ్‌సింగ్‌కు పుట్టపర్తి మండలం వెంగళమ్మచెరువు గ్రామానికి చెందిన కొండయ్య వినతిపత్రం అందజేశారు. కూలి పనులతో జీవనం సాగిస్తున్న కొండయ్య కుమారుడు రమేష్‌ కొంత కాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడు. పలు ఆస్పత్రుల్లో చికిత్స చేయించినా ఫలితం లేకపోయింది. ఈ క్రమంలో రెండు కిడ్నీలు పాడయ్యాయి. దీంతో కిడ్నీ మార్చాల్సిందేనని వైద్యులు స్పష్టం చేశారు. అయితే ఇందుకు సాంకేతిక ఇబ్బందులు తలెత్తడంతో పోలీసు విచారణ నివేదిక అందజేయాలంటూ ఎస్పీని కొండయ్య కలసి వినతిపత్రం అందజేశారు. దీనిపై స్పందించిన ఎస్పీ రాహుల్‌దేవ్‌సింగ్‌ వెంటనే ఎస్‌బీ విచారణకు ఆదేశించి, నివేదిక తెప్పించుకుని బాధితుడికి అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీకి కొండయ్య కృతజ్ఞతలు తెలిపారు.

భర్త తరఫు బంధువుల నుంచి

రక్షణ కల్పించండి..

తన భర్త తరఫు బంధువుల నుంచి ప్రాణహాని ఉందని, వారి బారి నుంచి రక్షణ కల్పించాలంటూ ఎస్పీ రాహుల్‌దేవ్‌సింగ్‌కు ఓ వివాహిత ఫిర్యాదు చేసింది. ఈ మేరకు సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో ఎస్పీని కలసి వినతి పత్రం అందజేసింది. బాధితురాలు తెలిపిన మేరకు... ముదిగుబ్బకు చెందిన మౌనికకు మూడేళ్ల క్రితం శ్యామ్‌కుమార్‌తో వివాహమైంది. ప్రస్తుతం వీరికి ఓ కుమార్తె ఉంది. పెళ్లి సమయంలో చిత్తూరు జిల్లాలో ఉద్యోగం చేస్తున్నట్లు నమ్మించారు. వారి మాటలు నమ్మి పెళ్లి సమయంలో 10 తులాల బంగారు నగలు, లక్ష రూపాయలను తల్లిదండ్రులు వరకట్నంగా ఇచ్చారు. ఇటీవల బావ సుధీర్‌తో పాటు భర్త తరఫు బంధువులు మహేష్‌, లక్ష్మీదేవి, నాగరత్నమ్మ, కృష్ణమూర్తి చాడీలు చెప్పి తనకు తన భర్తకు మధ్య విభేదాలు సృష్టించారు. అంతేకాక తనకు లొంగకపోతే భర్త నుంచి శాశ్వతంగా విడిపోయేలా చేస్తానంటూ మహేష్‌ బ్లాక్‌మెయిల్‌ చేస్తున్నాడు. వీరికి అత్త, మామ తోడయ్యారు. ఇప్పటికే తాను ఎన్నో బాధలు అనుభవించానని, ఇక వారి వేధింపులు భరించలేకపోతున్నానన, వారి నుంచి తనకు ప్రాణహాని ఉందని ఎస్పీకి బాధితురాలు ఫిర్యాదు చేసింది. కాగా, వివిధ సమస్యలపై 42 వినతులు అందినట్లు జిల్లా పోలీసు కార్యాలయం వెల్లడించింది. అర్జీలను ఎస్పీ స్వయంగా స్వీకరించారు. కార్యక్రమంలో ఏఎస్పీ కె.వి.రామకృష్ట ప్రసాద్‌, ఎస్‌బీ డీఎస్పీ ఉమామహేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Read latest Sri Sathya Sai News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top