
పుట్టపర్తి అర్బన్: మహిళాభ్యుదయమే ధ్యేయంగా సీఎం జగన్‌మోహన్‌రెడ్డి పాలన సాగిస్తున్నారని కలెక్టర్ బసంత్‌కుమార్ అన్నారు. మహిళాభివృద్ధితోనే కుటుంబాలు ఆర్థికంగా నిలదొక్కుకుంటాయని భావించి మహిళల కోసం అనేక పథకాలు అమలు చేస్తున్నారని, అందులో ‘వైస్సార్ ఆసరా’ కూడా ఒకటన్నారు. శనివారం ఏలూరు జిల్లా దెందులూరులో ‘వైఎస్సార్ ఆసరా’ మూడో విడత ఆర్థిక సాయాన్ని అక్క చెల్లెమ్మల ఖాతాల్లో జమ చేసే కార్యక్రమాన్ని సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కంప్యూటర్‌లో బటన్‌నొక్కి ప్రారంభించారు. కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాలు నుంచి కలెక్టర్ బసంత్‌కుమార్, రాష్ట్ర వక్కలిగ కార్పొరేషన్ చైర్‌పర్సన్ డాక్టర్ నళిని, ‘పుడా’ చైర్ పర్సన్ లక్ష్మీనరసమ్మ, మున్సిపల్ వైస్ చైర్‌పర్సన్ శ్రీలక్ష్మి, డీఆర్‌డీఏ పీడీ నరసయ్య, స్వయం సహాయక మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు. అనంతరం జిల్లాలో 28,127 స్వయం సహాయక సంఘాల్లోని 2,77,574 మంది సభ్యులకు విడుదలైన రూ.216.55 కోట్లకు సంబంధించిన మెగా చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, స్వయం సహాయక సంఘాల్లోని మహిళలకు ఆర్థిక పురోభివృద్ధికి ‘వైఎస్సార్ ఆసరా’ ఎంతో దోహదం చేస్తోందన్నారు. వైఎస్సార్ ఆసరా పథకం కింద 2020 సెప్టెంబర్ 11న తొలి విడతలో జిల్లాలోని 27,941 సంఘాలకు రూ.214.37 కోట్లు, 2021 అక్టోబర్ 7న రెండో విడతలో 28,071 సంఘాలకు రూ.217.11 కోట్లు లబ్ధి కలిగిందన్నారు. ప్రభుత్వం అందించిన సాయాన్ని మహిళలు సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్నారు.
దగాకోరు చంద్రబాబు..
రాష్ట్ర వక్కలిగ కార్పొరేషన్ చైర్‌పర్సన్ నళిని, ‘పుడా’ చైర్ పర్సన్ లక్ష్మీనరసమ్మ మాట్లాడుతూ, మాటిచ్చి తప్పడం చంద్రబాబుకు అలవాటన్నారు. ఈక్రమంలోనే 2014 ఎన్నికల్లో పొదుపు సంఘాల రుణాలన్నీ మాఫీ చేస్తానని చెప్పి దగా చేశాడని అన్నారు. చంద్రబాబు రుణమాఫీ హామీ నమ్మిన డ్వాక్రా మహిళలు రుణాలు చెల్లించకపోవడంతో సంఘాలన్నీ దివాళా తీశాయన్నారు. బ్యాంకులు నోటీసులు పంపడంతో చివరకు బంగారు తాకట్టుపెట్టి కంతులన్నీ చెల్లించాల్సి వచ్చిందన్నారు. డ్వాక్రా మహిళలకు, రైతులకు, రుణమాఫీలు ఎగ్గొట్టడంతో వారంతా కలిసి టీడీపీ ప్రభుత్వాన్ని మాఫీ చేశారన్నారు. గత మూడేళ్లుగా సీఎం వైఎస్ జగన్ ఎన్నికల హామీలను 99 శాతం అమలు చేయడంతో రాష్ట్ర ప్రజల్లో నమ్మకం పెరిగిందన్నారు. వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా ఆయన రుణాన్ని ఓటుతో తీర్చుకుంటామన్నారు.
కలెక్టర్ బసంత్‌కుమార్
‘వైఎస్సార్ ఆసరా’ మూడో విడత నిధులు ఖాతాల్లో జమ
జిల్లాలోని 2,77,574 మందికి రూ.216.55 కోట్ల లబ్ధి

‘వైఎస్సార్ ఆసరా’ చెక్కును లబ్ధిదారులకు అందజేస్తున్న కలెక్టర్ బసంత్‌కుమార్