యువత నాశనం
గంజాయి, డ్రగ్స్ నేరాల్లో
● గాడితప్పుతున్న యువత
● గంజాయికి బానిసలవుతున్న వైనం
● పెంచలయ్య హత్య కేసులో నిందితుల వయసు 18 నుంచి 25 ఏళ్ల లోపే..
నెల్లూరు(క్రైమ్): యువత వ్యసనాల బాటపడుతోంది. మత్తు అనే చెడు సరదా కోసం బంగారు భవిష్యత్‌ను పణంగా పెట్టి కన్నవారి కలల్ని మరిచి నేరాలకు పాల్పడుతూ జీవితాన్ని నాశనం చేసుకుంటోంది. ఆర్టీడీ కాలనీకి చెందిన ఉద్యమకారుడు, ప్రజానాట్య మండలి కళాకారుడు పెంచలయ్యను గంజాయి బ్యాచ్ పొట్టనబెట్టుకుంది. హత్యలో పోలీసులు అరెస్ట్ చేసిన ఏడుగురు నిందితుల్లో ఆరుగురి వయసు 18 నుంచి 25 సంవత్సరాల్లోపే. ఇటీవల నెల్లూరు రూరల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో గంజాయి విక్రయాలు, నకిలీనోట్ల మార్పిడి కేసులో అరెస్ట్ అయిన నిందితుల్లో ముగ్గురి వయసు 25ఏళ్ల లోపే.
వారే లక్ష్యంగా..
ప్రధానంగా యువత, విద్యార్థులే లక్ష్యంగా గంజాయి విక్రయాలు సాగుతున్నాయి. తొలుత సరదాగా అలవాటు చేసుకున్న కొందరు మత్తుకు బానిసలవుతున్నారు. తల్లిదండ్రులు ఇచ్చే పాకెట్‌మనీ, తమ సంపాదనంతా గంజాయికే ఖర్చు పెడుతున్నారు. మత్తుకు సరిపడా నగదు లేని వారు స్మగ్లర్లుగా అవతారమెత్తుతున్నారు. ఇంకొందరు కమీషన్ పద్ధతిపై అక్రమ రవాణాకు, విక్రయాలకు పాల్పడుతున్నారు.
బానిసలుగా మార్చి..
కొందరు గంజాయి వ్యాపారులు యువకులను చేరదీసి మత్తును రుచి చూపిస్తున్నారు. క్రమేపీ వారిని బానిసలుగా మార్చి తమ అవసరాలకు వాడుకుంటున్నారు. వారిచే గంజాయి అమ్మించడంతోపాటు నిత్యం మత్తులో జోగేలా చేసి తమకు అడ్డొచ్చిన వారిపై దాడులు, దౌర్జన్యాలతోపాటు హత్యలు చేయించేందుకూ వెనుకాడటం లేదు. ఇటీవల జరిగిన పలు ఘటనల్లో నిందితులు గంజాయి మత్తులోనే నేరాలకు పాల్పడినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఇదిలా ఉంటే కొందరు వ్యక్తులు తమ రాజకీయ అవసరాలకు యువతకు మత్తు అలవాటు చేసి వెంట తిప్పుకొంటున్నారనే ఆరోపణలు లేకపోలేదు. తల్లిదండ్రుల పర్యవేక్షణ లోకపోవడంతో యువత చెడుమార్గం పడుతున్నారు. వారు తమ బిడ్డల నడవడి, స్నేహాలు తదితరాలను జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి. ఎప్పటికప్పుడూ దిశానిర్దేశం చేయాలి. హద్దు మీరితే దండించాలి.
ఇష్టారాజ్యంగా..
జిల్లాలో గంజాయి గుప్పుమంటోంది. చదువుకోవాల్సిన వయసులో యువత పెడదారిపడుతూ మత్తులో జోగుతోంది. ఖాళీ స్థలాలు, శివారు ప్రాంతాలు, పాడుబడిన భవనాల్లో చేరి గంజాయి తాగుతున్నారు. మత్తు వారిని చిత్తు చేస్తోంది. విచక్షణ కోల్పోయి ఏం చేస్తున్నామో తెలియని పరిస్థితుల్లో నేరాలకు తెగబడుతున్నారు. ఇటీవల జరిగిన కొన్ని నేరాల్లో గంజాయి వినియోగం తేటతెల్లమవడం పోలీసులు క్షేత్రస్థాయిలో దృష్టిసారించాల్సిన ఆవస్యకతను స్పష్టం చేస్తోంది.
యువత నాశనం


