సకాలంలో చికిత్స అవసరం | - | Sakshi
Sakshi News home page

సకాలంలో చికిత్స అవసరం

Dec 3 2025 8:15 AM | Updated on Dec 3 2025 8:15 AM

సకాలం

సకాలంలో చికిత్స అవసరం

నెల్లూరు(అర్బన్‌): స్క్రబ్‌ టైఫస్‌.. ఈ వ్యాధి కలవరపెడుతోంది. రెండు రోజుల క్రితం రాష్ట్రంలో ఓ మహిళ ఈ వ్యాధితో మరణించింది. జిల్లాలో కొన్ని నెలలుగా కేసులు నమోదవుతున్నాయి. పలువురు గాలితీసుకోలేక ఆయాసంతో ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. రోగుల కుటుంబాలు అప్పుల పాలవుతున్నాయి. ఇంత జరుగుతున్నా వైద్యశాఖ తమకేమి పట్టనట్టు వ్యవహరిస్తోందని విమర్శలున్నాయి.

మైట్‌ కీటకంతోనే..

ఓరియంటియా సుత్సుగముషి అనే బ్యాక్టీరియాతో స్క్రబ్‌ టైఫస్‌ వ్యాధి వస్తుంది. నల్లిని పోలిన మైట్‌ అనే కీటకం మనిషిని కుట్టినప్పుడు దాని ద్వారా బ్యాక్టీరియా ప్రవేశించి జబ్బు కలిగిస్తోంది. ఆగస్టు నుంచి ఫిబ్రవరి మధ్యలో ఎక్కువగా ప్రబలుతోంది. అటవీ ప్రాంతాలు, పొదలు, గడ్డి ఎక్కువగా ఉండే ప్రాంతాలు, పశువుల పాకలు తదితర ప్రదేశాల్లో స్క్రబ్‌ టైఫస్‌ వ్యాధిని కలిగించే కీటకాలుంటాయి. గ్రామీణ ప్రాంతాల్లోనే అధికం.

గుర్తు ఆధారంగా..

కీటకం కరిచిన చోట నల్లటి మచ్చ లేదా పుండు (స్కార్‌) ఉంటుంది. ఈ గుర్తును ఆధారంగా స్క్రబ్‌ టైఫస్‌ జబ్బుగా అనుమానించాలి. వారం, పదిరోజులుగా జ్వరం రావడం, కండరాల నొప్పులు, ఒళ్లు నొప్పులు, దద్దుర్లు, వాపు, వణుకు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, వాంతులు, అలసట తదితర లక్షణాలుంటే ఎలీసా ఐజీజీ, ఐజీఎం, ఆర్టీపీసీఆర్‌, మైక్రోస్కోపి పరీక్షలు చేయించుకోవాలి. ర్యాపిడ్‌ పద్ధతిలో కూడా నిర్ధారిస్తున్నారు. పలు ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో ఈ పద్ధతిలో చేసే పరీక్షలను వైద్యశాఖ అంగీకరించడం లేదు. అందువల్ల వాస్తవాలు వెలుగు చూడటం లేదు.

కేసులు అంతే..

జిల్లాలోని పలు ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో ఇప్పటి వరకు 58 కేసులే నమోదయ్యాయని వైద్యశాఖాధికారులు ప్రకటించడం విశేషం. శంకరాగ్రహారంలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలోనే గత నెలలో 20కి పైగా కేసులు వచ్చాయి. అధికారులు కాకిలెక్కలు చూపుతూ కొన్నింటిని మాత్రమే రికార్డు చేస్తున్నారని విమర్శలున్నాయి. కేసులు నమోదైతే ఐహెచ్‌ఐపీ (ఇంటర్నేషనల్‌ హెల్త్‌ ఇన్‌ఫర్మేషన్‌ పోర్టల్‌)లో ప్రభుత్వ, ప్రైవేట్‌ డాక్టర్లు నమోదు చేయాల్సి ఉంది. వైద్యశాఖ నుంచే వచ్చే ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ప్రైవేట్‌ ఆస్పత్రుల యాజమాన్యం ఈ పోర్టల్లో పాజిటివ్‌ కేసులను సైతం నమోదు చేయడం లేదని తెలుస్తోంది. అనుమానాస్పద కేసులకు పరీక్షలు చేయించాలని ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు.

జిల్లాలో స్క్రబ్‌ టైఫస్‌ కలవరం

నల్లిని పోలిన కీటకం..

కరిస్తే ప్రాణాంతకం

ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో పదుల సంఖ్యలో కేసులు

అధికారిక లెక్కల్లో 58 మాత్రమే అంట

వైద్యశాఖ కాకిలెక్కలు

స్క్రబ్‌ టైఫస్‌ వ్యాధి మొదట జ్వరంతోనే ప్రారంభమవుతుంది. అయితే డెంగీ, మలేరియా లాంటి పరీక్షలు చేయించుకుంటున్న రోగులు స్క్రబ్‌ టైఫస్‌ పరీక్షలు చేయించుకోవడం లేదు. డాక్టర్లు పెద్దగా పట్టించుకోవడం లేదు. సాధారణ జ్వరంగా భావించి మందులు రాస్తున్నారు. అయితే మొదట్లోనే గుర్తించి యాంటీ బయాటిక్స్‌ వాడితే తగ్గిపోతోంది. వారం, పదిరోజుల వరకు నిర్లక్ష్యం చేసి తర్వాత పరీక్ష చేయించుకునే లోపు వ్యాధి తీవ్రత పెరిగిపోతుంది. సకాలంలో వైద్యం అందకపోతే తీవ్రమైన శ్వాసకోశ సమస్యలు, మెదడు, వెన్నెముక వాపు, కిడ్నీలు ఫెయిలవడం లాంటివి జరిగి ప్రాణాలు పోయే అవకాశాలున్నాయి.

చికిత్స ఉంది

స్క్రబ్‌ టైఫస్‌ విషయంలో ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ప్రభుత్వాస్పత్రుల్లో అన్ని రకాల యాంటీ బయాటిక్స్‌, ఇతర మందులున్నాయి. జ్వరం వస్తే ఆర్‌ఎంపీ వద్దకెళ్లడం, సొంతంగా జ్వరం మాత్రలు వేసుకోవడం చేయొద్దు. అయితే ప్రాథమిక దశలోనే డాక్టర్ల సలహాలు తీసుకోవడం మంచిది. ప్రభుత్వాస్పత్రుల్లో పరీక్షలు చేస్తున్నాం.

– సుజాత, జిల్లా వైద్యశాఖాధికారి

నిర్లక్ష్యం వద్దు

స్క్రబ్‌ టైఫస్‌ అనే జబ్బు పరీక్షల్లో మాత్రమే తెలుస్తోంది. అందువల్ల జ్వరం వచ్చినప్పుడు సొంత వైద్యం చేయించుకోకుండా డాక్టర్‌ను కలిసి సలహాలు తీసుకోవాలి. లక్షణాలను బట్టి పరీక్ష చేసి వైద్యం చేస్తారు. మొదట్లోనే ఈ జబ్బును కనుక్కుంటే నయం చేసుకోవచ్చు. నిర్లక్ష్యం చేస్తే ఒక్కోసారి తీవ్రమైన సమస్యగా మారుతుంది.

– డాక్టర్‌ గంగాధర్‌, నెల్లూరు

సకాలంలో చికిత్స అవసరం1
1/1

సకాలంలో చికిత్స అవసరం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement