భయం గుప్పెట్లో ఆర్టీడీ కాలనీ
● గంజాయి బ్యాచ్‌కు చెందిన ఆరు ఇళ్లు ధ్వంసం
● ఓ ఇంట్లో బయటపడిన కత్తి
● కాలనీలో కొనసాగుతున్న పోలీస్ పికెట్
నెల్లూరు సిటీ: గంజాయి వ్యతిరేక ఉద్యమకారుడు, ప్రజానాట్య మండలి కళాకారుడు పెంచలయ్య పాశవిక హత్యతో ఆర్టీడీ కాలనీవాసులు భయం గుప్పెట్లో బతుకుతున్నారు. గంజాయి బ్యాచ్ చేసిన హత్యతో ఎప్పుడు ఏమి జరుగుతుందోనని ఆందోళనలో ఉన్నారు. పోలీసులు కాలనీలో పికెట్ ఏర్పాటు చేశారు. పెంచలయ్య మృతికి కారణమైన అరవ కామాక్షి, అనుచరుల ఇళ్లను సోమవారం రాత్రి స్థానికులు ధ్వంసం చేశారు. ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు. ఈ క్రమంలో ఓ ఇంట్లో తుప్పుపట్టిన పెద్ద కత్తి మంగళవారం బయటపడింది. కామాక్షి, హత్యలో నేరుగా ప్రమేయం ఉన్నవారిని పోలీసులు అరెస్ట్ చేసినా కాలనీ వాసుల్లో ఇంకా భయం పోలేదు. ఉద్యమకారుడు, పార్టీ నేతనే ఇలా మట్టుపెట్టారంటే, సామాన్యులమైన తమ పరిస్థితి ఏమిటని స్థానికులు చర్చించుకుంటున్నారు.
మాటలు, పాటలు తలుచుకుంటూ..
ఉద్యమకారుడు, కళాకారుడిగా, సీపీఎం నేతగా ఉంటూ ఆర్టీడీ కాలనీలో గంజాయిని తరిమికొట్టాలని నిరంతర పోరాటం చేసిన పెంచలయ్య మాటలను కాలనీవాసులు గుర్తుతెచ్చుకుంటూ కన్నీటి పర్యంతమవుతున్నారు. అతను కాలనీలో పోలీసులతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించారు. అదే విధంగా తన కళతో చైతన్యం తెచ్చేందుకు ప్రయత్నించారు. అయితే ఇప్పుడు ఆ మాటలు, పాటలు లేక కాలనీ మూగబోయిందని ప్రజలు ఆవేదనకు గురవుతున్నారు.
భయం గుప్పెట్లో ఆర్టీడీ కాలనీ
భయం గుప్పెట్లో ఆర్టీడీ కాలనీ


