నెల్లూరు.. కన్నీరు.. | - | Sakshi
Sakshi News home page

నెల్లూరు.. కన్నీరు..

Dec 1 2025 7:24 AM | Updated on Dec 1 2025 7:24 AM

నెల్లూరు.. కన్నీరు..

నెల్లూరు.. కన్నీరు..

దక్షిణ భారతదేశంలో కాంచీపురం నుంచి అమరావతి వరకు విస్తరించిన నగరాల్లో ‘విక్రమ సింహపురి’ చరిత్రాత్మక నగరంగా విరాజిల్లింది. పల్లవ, చోళ, చాళుక్య, కాకతీయ, తెలుగు చోడ, పాండ్య, సంగమ, సాళువ, తుళువ, ఆరవీటి వంశాల పాలనల్లో రాజ్య కేంద్రంగా విలసిల్లింది. ఇంత చరిత్ర కలిగిన ఈ సింహపురి కాలక్రమేణా నెల్లూరుగా నామాంతరం చెందింది. అంగ్లేయులు ప్రాంతాల వారీగా విభజించి విచ్ఛిన్నం చేశారు. భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుతో నెల్లూరు మరికొంత భూభాగాలను కోల్పోయింది. పెరుగుతున్న జనాభా కనుగుణంగా పాలనా సౌలభ్యం కోసం భౌగోళిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని గత ప్రభుత్వం ప్రజల అభ్యంతరాల నేపథ్యంలో వ్యవసాయం, పారిశ్రామికాభివృద్ధిని సమాంతరం చేస్తూ విభజన చేపట్టింది. తాజాగా టీడీపీ ప్రజాభిప్రాయానికి భిన్నంగా ప్రాంతాలు, ప్రజల మధ్య చిచ్చు రేపుతూ, భవిష్యత్‌లో జల వివాదాలకు ఆజ్యం పోస్తూ మరోసారి పునర్విభజనకు సిద్ధపడింది.
మంత్రుల మౌనం.. నెల్లూరుకు శాపం

రామాయపట్నం పోర్టు

ఉదయగిరి దుర్గం

సాక్షి, ప్రతినిధి, నెల్లూరు: జిల్లాను విచ్ఛిన్నం చేస్తూ చంద్రబాబు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో నెల్లూరు తల తెగిన మొండెంగా మిగిలిపోనుంది. తాజా పునర్విభజన నిర్ణయం చారిత్రాత్మక తప్పిందంగా మిగిలిపోనుంది. జిల్లాకే తలమానికంగా నిలిచిన వ్యవసాయం, పారిశ్రామికాభివృద్ధి చిన్నాభిన్నం కానుంది. దేశ, రాష్ట్ర రాజకీయాల్లో సింహపురికి ప్రత్యేక స్థానం ఉండేది. బెజవాడ గోపాలరెడ్డి, ఏసీ సుబ్బారెడ్డి, నేదురుమల్లి జనార్దనరెడ్డి, నల్లపరెడ్డి శ్రీనివాసులురెడ్డి, పుచ్చలపల్లి సుందరయ్య, ముప్పవరపు వెంకయ్యనాయుడు వరకు చట్టసభల్లో కీలక పాత్ర పోషించి రాజకీయాలను శాసించి, ఆ రాజకీయాలకు వన్నె తెచ్చారు. ఒకానొక సమయంలో పార్లమెంటులో జిల్లాకు చెందిన 11 మంది రాజకీయ ఉద్దండులు సభ్యులు ఉండేవారు.

వ్యవసాయం, పారిశ్రామికాభివృద్ధి

సమాంతరంగా విభజన

రాచరిక పాలనలో విశాల విక్రమ సింహపురిగా ఉన్న నెల్లూరు బ్రిటిష్‌ పాలకుల నుంచి, స్వరాష్ట్ర పాలకుల వరకు నానాటికి విచ్ఛిన్నమవుతోంది. నానాటికి పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా గతంలో ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ మేరకు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం పార్లమెంట్‌ నియోజకవర్గం ప్రామాణికంగా కొత్త జిల్లాల పునర్విభన చేపట్టింది. ఆనాటి ప్రభుత్వం భౌగోళిక పరిస్థితులతోపాటు జిల్లా అభివృద్ధికి గీటురాయిగా మారే పారిశ్రామికాభివృద్ధిని, వ్యవసాయ అభివృద్ధికి ఎక్కడా విఘాతం ఏర్పడకుండా ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని గూడూరు, సూళ్లూరుపేట నియోజకవర్గాలను పూర్తిగా, వెంకటగిరిలోని మూడు మండలాలను తిరుపతి జిల్లాలో కలుపుతూ పునర్విభజించింది. పూర్వం నెల్లూరు జిల్లాలోనే ఉండి ప్రకాశం జిల్లాలో విలీనమైన కందుకూరును తిరిగి నెల్లూరు జిల్లాలో చేర్చారు. అయితే జిల్లాకే తలమానికమైన షార్‌తోపాటు ప్రపంచస్థాయి పారిశ్రామికవాడ శ్రీసిటీ, గూడూరులోని సిలికా మైన్లు నెల్లూరు కోల్పోయింది. వెంకటగిరిలోని కీలకమైన మైకా గనులు విస్తారంగా ఉన్న సైదాపురంతోపాటు జల నిధి కండలేరు ఉన్న రాపూరు, భౌగోళికంగా నెల్లూరు జిల్లాలో కలిసిపోయిన కలువాయిని నెల్లూరునే ఉండేలా నిర్ణయం తీసుకోవడంతో విజభన జిల్లాకు ఎంతో ఉపయోక్తంగా మారింది. ప్రపంచ స్థాయి పారిశ్రామికవాడ శ్రీసిటీకి ప్రత్యామ్నాయంగా కందుకూరు నియోజకవర్గంలోని రామాయపట్నంలో తొలి దశలో పది బెర్త్‌లతో సీపోర్టు నిర్మాణానికి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.

ప్రజల ఆకాంక్షలకు వెన్నుపోటు

గూడూరు నియోజకవర్గాన్ని నెల్లూరులో కలపాలన్న డిమాండ్‌ బలంగా ఉంది. ఇదే తరుణంలో గూడూరు తమకు కావాలని తిరుపతి జిల్లా వాసులెవరూ కోరడం లేదు. మరో వైపు వెంకటగిరిలో సైదాపురం, రాపూరు, కలువాయి మండలాలను సైతం తిరుపతిలో విలీనం చేయాలని ఎవరూ కోరుకోవడం లేదు. భౌగోళికంగా కూడా గూడూరుకు జిల్లా కేంద్రం నెల్లూరు అత్యంత దగ్గరగా ఉంటుంది. ఈ ప్రకారం కందుకూరును ప్రకాశంలో కలిపినప్పుడు గూడూరును నెల్లూరులో కలుపుతామని హామీ ఇచ్చి చంద్రబాబు ప్రజల ఆకాంక్షలకు వెన్నుపోటు పొడిచారు.

కండలేరు జలాశయం

కృష్ణపట్నం పోర్టు

నెల్లూరు జిల్లా పునర్విభజనతో ప్రాంతాలు, ప్రజల మధ్య రేగిన చిచ్చు

గతంలో వెంకటగిరిలోని రాపూరు, సైదాపురం, కలువాయి మండలాలను సైతం తిరుపతి జిల్లాలో విలీనం చేయాలనే ప్రతిపాదన జరిగినప్పుడు అప్పటి ఎమ్మెల్యేగా ఉన్న ఆనం రామనారాయణరెడ్డి గట్టిగా విభేదించారు. కండలేరు, సోమశిల నీటి పంపకాల్లో సమస్యలు వస్తాయని, ఈ మూడు మండలాల రైతులకు అన్యాయం జరుగుతుందని తన వాదన వినిపించారు. జిల్లాలో వ్యవసాయ రంగ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని భవిష్యత్‌లోనూ జల వివాదాలకు తావు లేకుండా ఉండే విధంగా ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈ మూడు మండలాలను నెల్లూరు జిల్లాలోనే ఉండే విధంగా పునర్విభజన చేపట్టారు. ఇప్పుడు అదే ఆనం మంత్రిగా ఉండీ కూడా ఈ మూడు మండలాలను తిరుపతిలో విలీనం చేస్తుంటే మౌనంగా ఉండిపోవడం తమ కుటుంబానికి రాజకీయ భిక్ష పెట్టిన నెల్లూరుకు ద్రోహం చేయడమే అనే ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. భవిష్యత్‌ విజనరీ అని చెప్పుకునే మరో మంత్రి నారాయణ కానీ, జిల్లాకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు అభ్యంతరాలు చెప్పకపోవడంపై జిల్లా ప్రజలు మండి పడుతున్నారు. చంద్రబాబు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని పునసమీక్షంచకపోతే రాష్ట్ర విభజన ఉద్యమ స్థాయిలో జిల్లా విభజన ఉద్యమం ఊపందుకోనుంది. ఇప్పటికే మాజీమంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి ఆమరణ నిరాహార దీక్షకు సన్నద్ధమవుతున్నారు.

చంద్రబాబు నిర్ణయంతో జల విభేదాలు

గతంలో భౌగోళిక పరిస్థితులు, ప్రజల అభ్యంతరాల తర్వాతే విభజన

కందుకూరును తిరిగి ప్రకాశంలోకి.. గూడూరును నెల్లూరులో విలీనం విస్మరణ

వెంకటగిరిలోని మూడు కీలక మండలాలు తిరుపతిలో కలపడంపై తీవ్ర అభ్యంతరం

నెల్లూరుకు అన్యాయం చేస్తున్నా నోరు మెదపని టీడీపీ ఎమ్మెల్యేలు

గత ప్రభుత్వంలో ఆ మూడు మండలాల కోసం కన్నెర్ర చేసిన మంత్రి ఆనం.. ఇప్పుడు మౌనమేలా

జిల్లా వాసులు మనోభావాలను

పట్టించుకోని మంత్రి నారాయణ

ఆది నుంచి రాజకీయ చైతన్యం కలిగిన నెల్లూరు జిల్లా ఒక రాజకీయ పార్టీ పక్షాన నిలబడుతోంది. అటువంటి జిల్లాను విచ్ఛిన్నం చేయాలనే రాజకీయ కుట్రలతో చంద్రబాబు ప్రభుత్వం తీసుకున్న పునర్విభజన నిర్ణయం ఇప్పుడు నెల్లూరును కన్నీరు పెట్టిస్తోంది. చంద్రబాబు రాజకీయ ప్రయోజనాల కోసం ఎన్నికల్లో కందుకూరును తిరిగి ప్రకాశంలో, గూడూరును నెల్లూరులో విలీనం చేస్తామని హామీలు గుప్పించారు. అయితే ఇప్పుడు కందుకూరును తీసుకెళ్లి ప్రకాశంలో విలీనం చేస్తుండడంతో జిల్లాకే తలమానికం అవుతుందనుకున్న రామాయపట్నం మరోసారి సింహపురి కోల్పోయింది. గూడూరును తిరిగి నెల్లూరులో కలుపుతామనే హామీని విస్మరించడంతోపాటు జిల్లా వ్యవసాయ రంగానికి ఆయుపట్టుగా ఉండే కండలేరు, ఆర్థిక ఆయుపట్టుగా నిలిచే మైకా గనులు ఉండే వెంకటగిరి లోని సైదాపురం, రాపూరు, కలువాయి మండలాలను సైతం తిరుపతిలో విలీనం చేస్తూ చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement