ఇదీ పరిస్థితి..
ఎయిడ్స్ రహిత జిల్లాగా మార్చేందుకు కృషి
● జిల్లాలో 13 వేల మందికిపైగా రోగులు
● తగ్గుముఖం పట్టినా..
అక్కడక్కడా నమోదు
ప్రపంచ ఎయిడ్స్ నివారణ దినోత్సవం నేడు
మానవత్వంతో ఆదరించాలి
హెచ్‌ఐవీ, ఎయిడ్స్ సోకిన వారిని మానవత్వంతో ప్రజలు ఆదరించాలని ప్రభుత్వం చెప్తోంది. వ్యాధి సోకిన వారు కలిసి తిన్నా.. ఒకే మరుగుదొడ్లను వినియోగించినా.. కలిసి ఉద్యోగాలు చేసినా.. ఒకరి దుస్తులు మరొకరు వేసుకున్నా.., స్విమ్మింగ్ పూల్ ద్వారా గానీ సంక్రమించదు. కేవలం అనైతిక కార్యకలాపాల ద్వారానే సోకుతుంది.
నెల్లూరు(అర్బన్): క్షణికావేశంలోనో.. పొరపాటుగానో చేసే తప్పులతో 95 శాతం మందికి.. సురక్షిత పద్ధతి పాటించని సూదులు, రక్త మార్పిడి, మత్తు ఇంజెక్షన్లు తదితరాల ద్వారా మరో ఐదు శాతం మందికి ఎయిడ్స్ వ్యాధి సోకుతోంది. పాతికేళ్ల క్రితం వరకు ఎయిడ్స్ వ్యాధి ఉన్న వ్యక్తిని అంటరానివారిగా చూసేవారు. దహన సంస్కారాలకు బంధుమిత్రులు సైతం హాజరయ్యేవారు కాదు. ఈ అమానవీయ స్థితిని గమనించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏటా డిసెంబర్ ఒకటిని ఎయిడ్స్ నివారణ దినోత్సవంగా ప్రకటించి.. ప్రజలను చైతన్యం చేస్తోంది. అంతరాయాలను అధగమించడం – ఎయిడ్స్ ప్రతిస్పందనను మార్చడం అనే థీమ్‌ను ఈ ఏడాది ప్రకటించింది. ఇందులో భాగంగా జిల్లాలో అవగాహన ర్యాలీలు, సదస్సులను జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ, స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించనున్నారు.
జిల్లాలో ఇలా..
నగరంలోని ప్రభుత్వ పెద్దాస్పత్రి ఏఆర్టీ సెంటర్‌లో 2007 డిసెంబర్ నుంచి రిజిస్ట్రేషన్ చేయించుకున్న హెచ్‌ఐవీ రోగులు 18,979 మంది ఉన్నారు. పెద్దాస్పత్రిలో మందులను ప్రతి నెలా క్రమం తప్పకుండా 8676 మంది పొందుతున్నారు. వివిధ ఏఆర్టీ సెంటర్లు, ప్రైవేట్‌గా మందులను మరో ఐదు వేల మందికిపైగా కొనుగోలు చేస్తున్నారు. కొంత మంది పెద్దలు, ఆర్థికంగా ఉన్న వారు కార్పొరేట్ ఆస్పత్రులతో పాటు చైన్నె వెళ్లి ప్రైవేట్‌గా వైద్యం చేయించుకుంటున్నారు. ఎయిడ్స్ రోగులు ఎక్కువగా ఉన్న జిల్లాల్లో రాష్ట్రంలో ఎనిమిదో స్థానంలో నెల్లూరు ఉంది. మరోవైపు జిల్లాలో కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టినా, ఏటా కొంతమేర నమోదవుతూనే ఉన్నాయి.
ఉచితంగా పరీక్షలు
గర్భిణుల్లో 2002లో 2.7 శాతం మందికి హెచ్‌ఐవీ ఉండగా, ఇప్పుడు అది 0.1 శాతంగా ఉంది. ప్రభుత్వం మొదట్లో చేపట్టిన చర్యలు ఇప్పుడు లేకపోవడంతో కేసుల సంఖ్య చాపకిందనీరులా పెరుగుతోంది. కొంతమంది వివరాలు అధికారిక లెక్కల్లో ఉండటంలేదని తెలుస్తోంది. జిల్లాలోని 52 పీహెచ్‌సీలు, 28 అర్బన్ హెల్త్ సెంటర్లు, ఒక జిల్లా ఆస్పత్రి, రెండు ఏరియా ఆస్పత్రులు, పది ఐసీటీసీ కేంద్రాలు, ఒక బోధానాస్పత్రి (పెద్దాస్పత్రి) ద్వారా రోగులకు ఉచితంగా పరీక్షలు చేస్తున్నారు. పాజిటివ్ వచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచి వారికి మందులను అందజేస్తున్నారు.
పింఛన్ల కోసం ఎదురుచూపులే
జిల్లాలోని ప్రభుత్వ పెద్దాస్పత్రి ఏఆర్టీ సెంటర్‌కు మందుల నిమిత్తం 8676 మంది ప్రతి నెలా వస్తున్నారు. వీరిలో కేవలం 2240 మందికే పింఛన్లను ప్రభుత్వం అందిస్తోంది. టీడీపీ ఆధ్వర్యంలో ప్రభుత్వం కొలువుదీరాక ఒక్కరికీ సైతం పింఛన్‌ను మంజూరు చేయలేదు. కొత్తవారికి పింఛన్లు కల్పించకపోవడం శోచనీయమని రోగులు బాధపడుతున్నారు.
అధికారిక లెక్కలిలా..
ఏడాది చేసిన నమోదైన శాతం
పరీక్షలు పాజిటివ్ కేసులు
2017 – 18 1,33,766 1347 1
2018 – 19 1,34,397 1174 0.9
2019 – 20 1,35,914 1007 0.7
2020 – 21 73,966 577 0.8
2021 – 22 1,50467 710 0.5
2022 – 23 1,91,042 811 0.4
2023 – 24 1,76,515 782 0.4
2024 – 25 1,79,588 730 0.4
2025 1,02,929 358 ––


