రామిరెడ్డికి ఫోన్‌లో వైఎస్ జగన్ పరామర్శ
అల్లూరు: ఇటీవల బైపాస్ సర్జరీ చేయించుకున్న కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్‌రెడ్డిని, ఆయన కుటుంబ సభ్యులను వైఎస్సార్‌సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదివారం ఫోన్‌లో పరామర్శించారు. రామిరెడ్డి యోగ క్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. త్వరగా కోలుకోని ప్రజా సేవలోకి రావాలని ఆకాంక్షించారు.
ప్రజా సమస్యల
పరిష్కార వేదిక రద్దు
నెల్లూరు (దర్గామిట్ట): సోమవారం జరగాల్సిన ప్రజాసమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని దిత్వా తుఫాన్‌తో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు జేసీ మొగిలి వెంకటేశ్వర్లు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని విజ్ఞప్తి చేస్తున్నట్లు ఆ ప్రకటనలో తెలిపారు. ప్రజలు సైతం అత్యవసరమైతే తప్ప.. బయటకు రావొద్దని తెలియజేశారు.
పోలీస్ పీజీఆర్‌ఎస్ కూడా..
నెల్లూరు (క్రైమ్): దిత్వా తుఫాను కారణంగా జిల్లాలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశమున్నందున పోలీసు కార్యాలయంలో సోమవారం జరగాల్సిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్) కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు ఎస్పీ అజిత వేజెండ్ల ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్జీదారులు తమ వినతులను మీకోసం.ఏపీ.జీఓవీ.ఇన్ వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవచ్చన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
నేడు పాఠశాలలు,
కళాశాలలకు సెలవు
నెల్లూరు (టౌన్): దిత్వా తుఫాన్ నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయనే వాతావరణశాఖ సమాచారం మేరకు జేసీ వెంకటేశ్వర్లు ఆదేశాలతో సోమవారం అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, జూనియర్ కళాశాలలకు సెలవు ప్రకటించినట్లు డీఈఓ బాలాజీరావు, ఆర్‌ఐఓ వరప్రసాదరావు ఆది వారం వేర్వేరు ప్రకటనల్లో తెలిపారు. జిల్లా లోని డిప్యూటీ డీఈఓలు, ఎంఈఓలు, హెడ్‌మాస్టర్లు ఈ సమాచారాన్ని తల్లిదండ్రులు, విద్యార్థులకు తెలియజేయాలన్నారు.
27 లోపు ఓపెన్ డిగ్రీ
సెమిస్టర్ ఫీజుకు గడువు
ఆత్మకూరు: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ స్టడీ సెంటర్ (ఎస్‌ఆర్‌జే డిగ్రీ కళాశాల)లో డిగ్రీ చేస్తున్న బీఏ, బీకాం, బీఎస్సీ యూనివర్సిటీ గ్రాడ్యుయేట్ కోర్సులకు సెమిస్టర్ విధానంలో 1, 3, 5 సెమిస్టర్ పరీక్షలకు డిసెంబరు 27వ తేదీలోపు ఫీజులు చెల్లించాలని కోఆర్డినేటర్ శ్రీకాంత్ రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఏపీఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు. మరిన్ని వివరాలకు 7382929793, 8125407933 నంబర్లలో సంప్రదించాలన్నారు.
కాకాణితో ప్రసన్న భేటీ
నెల్లూరు (స్టోన్‌హౌస్‌పేట): మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర పీఏసీ సభ్యుడు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి ఆదివారం జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డితో ఆయన నివాసంలో భేటీ అయ్యారు. గూడూరు నియోజకవర్గాన్ని నెల్లూరు జిల్లాలో కలిపే విషయమై చర్చించారు. గూడూరు సమన్వయకర్త మేరిగ మురళీధర్ ఆరోగ్య రీత్యా ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటూ ఉండడంతో ఆయనతో ఫోన్‌లో ప్రసన్న, కాకాణి చర్చించారు. అనంతరం సజ్జల రామకృష్ణారెడ్డితో కూడా మాట్లాడారు. గోవర్ధన్‌రెడ్డి మాట్లాడుతూ గూడూరు నియోజకవర్గాన్ని నెల్లూరు జిల్లాలో కలిపే విషయంపై చంద్రబాబు నిర్ణయంపై మాజీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డితో చర్చించిన అనంతరం తమ కార్యాచరణ తెలియజేస్తామని తెలిపారు. నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి మాట్లాడుతూ ప్రజాభీష్టం మేరకు ప్రభుత్వ నిర్ణయం లేకుంటే తాను ఆమరణ నిరాహార దీక్షకు సిద్ధమవుతానని, గూడూరు నియోజకవర్గంలోని అన్ని పార్టీల వారితోనూ, మేధావులతో కలిసి ఉమ్మడి కార్యాచరణ రూపొందించుకొని ముందుకెళతామన్నారు. ఈ సమావేశంలో మాజీ డీసీఎంఎస్ చైర్మన్ వీరి చలపతి, కలువ బాలాశంకర్ రెడ్డి పాల్గొన్నారు.
రామిరెడ్డికి ఫోన్‌లో వైఎస్ జగన్ పరామర్శ


