ఈఈలతో టెలి కాన్ఫరెన్స్
నెల్లూరు సిటీ: దిత్వా తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో జిల్లాలోని ఈఈలు, డీఈఈలతో టెలి కాన్ఫరెన్స్‌ను ఎస్‌ఈ రాఘవేంద్రం ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. జిల్లాలోని విద్యుత్ సిబ్బంది నిర్దేశించిన హెడ్ క్వార్టర్‌లోనే ఉండాలని ఆదేశించారు. సిబ్బందికి సెలవులను రద్దు చేశామని చెప్పారు. జిల్లాలోని ఐదు డివిజన్లలో కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేశామని, ఇవి 24 గంటలూ పనిచేయనున్నాయని వివరించారు. వర్షాలు తగ్గేంత వరకు ప్రతి సబ్‌స్టేషన్లో ఇద్దర్ని ఉంచి, మిగిలిన వారిని అత్యవసర సేవలకు వినియోగించాలని సూచించారు.
సర్వే ఉద్యోగుల సంఘ నూతన కార్యవర్గం
నెల్లూరు(దర్గామిట్ట): సర్వే ఉద్యోగుల సంఘ జిల్లా నూతన కార్యవర్గాన్ని నగరంలోని జిల్లా సర్వే, భూ రికార్డుల కార్యాలయంలో ఆదివారం ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా రామ్‌కుమార్, కార్యదర్శిగా అంకయ్య, ఉపాధ్యక్షుడిగా మహేష్‌రెడ్డి, జాయింట్ సెక్రటరీగా శ్రీనివాసులు, ట్రెజరర్‌గా యామిని జ్యోత్స్న, ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులుగా ప్రసన్నకుమార్, జయచంద్ర, మన్సూర్, శ్రీనివాసులు, ముక్తారుద్దీన్, వింధ్యను ఎన్నుకున్నారు.
గేదెను ఢీకొన్న బైక్
● ఇద్దరికి గాయాలు
మర్రిపాడు: గేదెను బైక్ ఢీకొనడంతో ఇద్దరు గాయపడిన ఘటన మర్రిపాడుకు కూతవేటు దూరంలో ఆదివారం చోటు చేసుకుంది. వివరాలు.. పడమటినాయుడుపల్లికి చెందిన ఇద్దరు యువకులు పని నిమిత్తం బైక్‌పై మర్రిపాడు వచ్చారు. అనంతరం తిరిగి బయల్దేరిన వీరు మర్రిపాడు సమీపంలో గేదె అడ్డు రావడంతో దాన్ని ఢీకొన్నారు. గాయపడిన వారిని 108లో ఆత్మకూరులోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
కుటుంబ కలహాలతో
వ్యక్తి బలవన్మరణం
ఉలవపాడు: ఉరేసుకొని వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కరేడు పంచాయతీ పరిధిలోని చిల్లకాల్వ సమీపంలో గల రొయ్యల చెరువుల వద్ద ఆదివారం చోటుచేసుకుంది. వివరాలు.. వేటపాళెం మండలం జగన్నాథపురానికి చెందిన రావూరి సాంబశివరావు (52) ఉలవపాడులోని ఓగుబోయిన ప్రసాద్‌కు చెందిన చెరువుల వద్ద పనిచేస్తున్నారు. భార్య కోటేశ్వరమ్మతో ఏర్పడిన విభేదాలతో రొయ్యల చెరువుల వద్ద ఉన్న రేకుల షెడ్‌లోనే ఉంటున్నారు. కుటుంబ కలహాలతో మనస్తాపంతో రేకుల షెడ్‌కు ఉన్న ఇనుప కమ్మికి ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఘటన స్థలాన్ని సీఐ అన్వర్‌బాషా, ఎస్సై అంకమ్మ పరిశీలించారు. భార్య కోటేశ్వరమ్మ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
కాలువలో పడి వాహన చోదకుడి దుర్మరణం
కొడవలూరు: కాలువలో పడి వాహనచోదకుడు మృతి చెందిన ఘటన మండలంలోని ఆలూరుపాడు మజరా రెడ్డిపాళెం వద్ద ఆదివారం వెలుగులోకి వచ్చింది. స్థానికుల వివరాల మేరకు.. ఆలూరుపాడు ఎస్సీ కాలనీకి చెందిన వంశీకృష్ణ (30) పని నిమిత్తం బయటకెళ్లారు. ఈ క్రమంలో ఇంటికొస్తూ రెడ్డిపాళెం వద్ద బైక్‌తో సహా కాలువలో శుక్రవారం రాత్రి పడ్డారు. అతనిపై బైక్ పడిపోవడంతో అక్కడికక్కడే మృతి చెందారు. ఈ విషయం స్థానికుల ద్వారా కుటుంబసభ్యులకు తెలిసింది. ఘటన స్థలానికి కుటుంబసభ్యులు చేరుకొని మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లారు. మృతుడికి భార్య, కుమార్తె ఉన్నారు. గ్రామంలో చిల్లర దుకాణాన్ని నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. కాగా మృతుడికి మూర్ఛ వ్యాధి ఉందని, కాపాడేవారు లేక మృతి చెంది ఉండొచ్చని కుటుంబసభ్యులు భావిస్తున్నారు. కాగా ఘటనపై పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు అందలేదు.
కండలేరులో
58 టీఎంసీల నీటి నిల్వ
రాపూరు: కండలేరు జలాశయంలో ఆదివారం నాటికి 58.006 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు జలాశయం ఈఈ గజేంద్రరెడ్డి తెలిపారు. సోమశిల జలాశయం నుంచి కండలేరుకు 2,300 క్యూసెక్కుల నీరు చేరుతోందన్నారు. కండలేరు నుంచి వివిధ కాలువకు నీటి విడుదల జరుగుతున్నట్లు వివరించారు.
ఈఈలతో టెలి కాన్ఫరెన్స్
ఈఈలతో టెలి కాన్ఫరెన్స్


