మేయర్ పీఠంపై రాజకీయ డ్రామా
● కొత్త మేయర్‌గా తెరపైకి దేవరకొండ సుజాత
● మరుసటి రోజుకు రూప్‌కుమార్‌కే ఇన్‌చార్జి మేయర్ పదవి అంటూ ప్రచారం
నెల్లూరు (బారకాసు): నెల్లూరు మేయర్ పీఠంపై మంత్రి నారాయణ, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి రాజకీయ డ్రామాకు తెర తీశారు. నగరపాలక సంస్థను తమ గుప్పెట్లో పెట్టుకునేందుకు ఇద్దరూ ఎవరి వారు వ్యూహ రచన చేస్తూ.. వీరిని నమ్ముకున్న కార్పొరేటర్లను బకరాలను చేస్తున్నారు. ప్రస్తుతం మేయర్‌గా ఉన్న పోట్లూరు స్రవంతిని పీఠంపై నుంచి దించాలనేది మంత్రి, ఎమ్మెల్యే ఉమ్మడి లక్ష్యం కాగా, ఈ పీఠాన్ని తమ గుప్పెట్లో పెట్టుకోవాలనేది ఎవరి వ్యూహం వారికి ఉంది. ప్రస్తుత మేయర్ స్రవంతిపై డిసెంబరు 15వ తేదీలోపు అవిశ్వాస తీర్మానం పెట్టాలని ఇప్పటికే టీడీపీ కార్పొరేటర్లు జాయింట్ కలెక్టర్‌కు నోటీసు అందజేశారు. అయితే కొత్త మేయర్‌ను ఎన్నుకోవాలన్నా.. చేయాలన్నా.. ఇన్‌చార్జి మేయర్‌ను ఎంపిక చేయాలన్నా కొంత సమయం పడుతుంది.
మంత్రి నారాయణ వ్యూహం ఇదే..
టీడీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నగర పాలక సంస్థపై పట్టుకు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి మంత్రి నారాయణతో విభేదించడంతోపాటు కార్పొరేషన్ అధికారులపై పెత్తనం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ విషయంలో ఇద్దరి మధ్య అంతర్గత విభేదాలు ఉన్నాయి. అయితే ప్రస్తుతం ఉన్న మేయర్ డమ్మీ కావడంతో కొంత కాలంగా నడిచిపోయింది. అయితే మేయర్ పీఠంపై తన అనుచరుడైన డిప్యూటీ మేయర్‌ను ఇన్‌చార్జిగా నియమించి తన ఆధిపత్యాన్ని చాటుకోవాలని ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి వ్యూహరచన చేశారు. దీంతో మేయర్‌పై అవిశ్వాసం పెట్టాలనే ప్రతిపాదనను తనకు అనుకూలంగా మలుచుకునేందుకు మంత్రి నారాయణ సైతం అంతర్గత వ్యూహంతో అంగీకరించడంతో ఉమ్మడిగా సమీక్షించి అవిశ్వాసానికి వ్యూహరచన చేశారని సమాచారం. ప్రస్తుత తరుణంలో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం లేదు కాబట్టి.. మైనార్టీ మహిళ డిప్యూటీ మేయర్‌గా ఉండడంతో ఆమెను ఇన్‌చార్జిగా పెట్టే ప్రతిపాదన చేయడం ద్వారా కోటంరెడ్డికి చెక్ పెట్టాలన్నది మంత్రి వ్యూహంగా తెలుస్తోంది. రూప్‌కుమార్‌కు ఇన్‌చార్జి మేయర్ పదవి ఇచ్చే ఉద్దేశం మంత్రికి లేదని ఆయన సన్నిహితుల సమాచారం. అయితే టీడీపీ గిరిజన మహిళకు ద్రోహం చేస్తుందనే ప్రచారంతో ఆ మరకను తుడుచుకునేందుకే దేవరకొండ సుజాత పేరును తెరపైకి తెచ్చారు. దీంతో ఎమ్మెల్యే కోటంరెడ్డి శిబిరంలో అలజడి రేగడంతో మరో సరికొత్త ప్రచారాన్ని తెరపైకి తెచ్చారు. దేవరకొండ సుజాతను మేయర్‌గా చేసి, ఆమెకు కొంత మొత్తం ముట్టజెప్పి దీర్ఘకాలిక సెలవు పెట్టించి.. అప్పుడు రూప్‌కుమార్‌ను ఇన్‌చార్జి మేయర్‌గా కూర్చొబెట్టాలని తమ వ్యూహం అంటూ చెప్పడం ద్వారా రాజకీయ డ్రామాకు తెర తీశారని స్పష్టమవుతోంది. ఇప్పటికే ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డికి కార్పొరేషన్‌లో పనులు కావడం లేదని, కమిషనర్ కూడా ఆయనకు సహకరించడం లేదని తెలుస్తోంది. మరో వైపు మంత్రి నారాయణ తన పని తాను చేసుకుంటూ సిటీ నియోజకవర్గంలో జరగాల్సిన అభివృద్ధి పనులను కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యే తాను వ్యూహాత్మకంగా పన్నుతున్న పన్నాగ ఉచ్చులో మంత్రి నారాయణ పడ్డారని కొందరు చర్చించుకుంటున్నారు. ఆడేది ఎవరు?.. ఆడించేది ఎవరు? అంటే.. ఇద్దరుకు ఇద్దరు ఎవరికి వారు ఆడుతున్నారని రోజుకో మలుపు తిరుగుతున్న మేయర్ పీఠం చెబుతోంది.


