
కేంద్ర పథకాలపై రైతులకు అవగాహన
● దిశ సమావేశంలో నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి
● అంగన్‌వాడీ భవన నిర్మాణాలకు జెడ్పీ నిధులు
● చైర్‌పర్సన్ ఆనం అరుణమ్మ
● హాజరుకాని మంత్రులు, ఎమ్మెల్యేలు
నెల్లూరు(పొగతోట): కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై రైతులకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలని నెల్లూరు ఎంపీ, దిశ కమిటీ చైర్మన్ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి అధికారులకు సూచించారు. నెల్లూరులోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో డిస్ట్రిక్ట్ డెవలప్‌మెంట్ కో–ఆర్డినేషన్ మానిటరింగ్ కమిటీ మీటింగ్ (దిశ)ను మంగళవారం నిర్వహించారు. ఎంపీ మాట్లాడుతూ జిల్లాలో 732 అంగన్‌వాడీ కేంద్రాలను అద్దె భవనాల్లో నిర్వహిస్తున్నారని, శాశ్వత భవనాల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో రూ.30 కోట్లతో 24 ప్రాజెక్ట్‌లు చేపట్టడం జరిగిందన్నారు. ప్రధానమంత్రి ఆవాజ్ యోజన ద్వారా 89,577 మందికి ఇళ్లు మంజూరు చేసినట్లు చెప్పారు. 25,640 ఇళ్లు పూర్తయ్యాయన్నారు. జిల్లా అభివృద్ధి తనవంతు సహాయ, సహకారాలు అందిస్తానన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాల అమలులో ఏమైనా లోపాలుంటే తన దృష్టికి తీసుకురావాలని, పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.
● జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ ఆనం అరుణమ్మ మాట్లాడుతూ అడిగిన వెంటనే రోడ్లు మంజూరు చేసిన ఎంపీకి ధన్యవాదాలు తెలిపారు. నెల్లూరు రూరల్‌లో పాఠశాలకు జెడ్పీ నిధులు మంజూరు చేయడం జరిగిందన్నారు. అయితే ప్రారంభోత్సవానికి ప్రొటోకాల్ పాటించలేదని, ఆహ్వానాన్ని పంపించలేదన్నారు. ఇందుకు సంబంధించి ఏఈని ఎక్కడ దాచి పెట్టారని ప్రశ్నించారు. ఏఈపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను కోరారు. జిల్లా వ్యాప్తంగా అంగన్‌వాడీ భవన నిర్మాణాలకు జెడ్పీ నిధులు మంజూరు చేశామని తెలిపారు. తిరుపతి జిల్లాలో నిర్మాణాలు వేగవంతంగా జరుగుతున్నాయన్నారు. నెల్లూరు జిల్లాకు సంబంధించి నిర్మాణాలు చేపట్టడంలో అధికారులు జాప్యం వహిస్తున్నారని తెలిపారు.
● కలెక్టర్ ఆనంద్ మాట్లాడుతూ అంగన్‌వాడీ భవన నిర్మాణాలకు సంబంధించి గత సమావేశంలోనూ పీఆర్ అధికారులకు తగిన ఆదేశాలు ఇచ్చామన్నారు. ఇప్పటి వరకు ప్రగతి చూపలేదని, ఇదే విధంగా ఉంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమావేశంలో ఎమ్మెల్సీ బల్లి కల్యాణ్ చక్రవర్తి, జెడ్పీ సీఈఓ మోహన్‌రావు, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. ప్రధానమంత్రి ఉజ్వల యోజన ద్వారా మరికొంతమంది అర్హులను చేర్చేందుకు అవకాశం ఉంటే ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు. దాని కోసం తహసీల్దార్లు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
● సమావేశానికి మంత్రులు, ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టారు. రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ జిల్లాలో ఉన్నా హాజరుకాలేదు.

కేంద్ర పథకాలపై రైతులకు అవగాహన