
నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు
● కలెక్టర్ ఆనంద్
నెల్లూరు రూరల్: అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల విషయంలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ ఆనంద్ అధికారులను హెచ్చరించారు. పీజీఆర్‌ఎస్ అర్జీలు, ఇళ్ల నిర్మాణాల పురోగతి, ఉపాధి హామీ పనులు, పాఠశాలల్లో విద్యార్థుల ప్రవేశాలు, పింఛన్ల పంపిణీ మొదలైన అంశాలపై మంగళవారం సాయంత్రం నెల్లూరు కలెక్టరేట్ నుంచి సబ్ కలెక్టర్, ఆర్డీఓలు, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలు, తహసీల్దార్లతో కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అభివృద్ధి, సంక్షేమానికి సంబంధించి ప్రభుత్వం ఇచ్చిన లక్ష్యాలను చేరుకోవడంలో అశ్రద్ధగా ఉంటే చర్యలకు వెనుకాడే ప్రసక్తే లేదని హెచ్చరించారు. జిల్లాలో గృహ నిర్మాణాలు, ఉపాధి హామీ పనుల్లో పురోగతి మెరుగుపడాల్సి ఉందన్నారు. హౌసింగ్‌లో ఉపాధిని అనుసంధానిస్తూ 90 రోజుల పనిదినాలు కల్పించాలన్నారు. జిల్లాలో పాఠశాలలన్ని ప్రారంభమయ్యాయని, ఇంకా ఒకటో తరగతిలో చేరాల్సిన విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉందన్నారు. అత్యంత నిరుపేదలకు మంజూరైన అంత్యోదయ కార్డులకు ఈకేవైసీని వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రతినెలా ఒకటో తేదీన 95 శాతానికి పైగా పింఛన్ల పంపిణీని పూర్తి చేయాలన్నారు. పంపిణీలో అశ్రద్ధగా ఉంటే సస్పెండ్ చేస్తామన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక అర్జీలపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. కార్యక్రమంలో జేసీ కార్తీక్, హౌసింగ్, డ్వామా, డీఆర్‌డీఏ పీడీలు వేణుగోపాల్, గంగాభవాని, నాగరాజకుమారి, జెడ్పీ డిప్యూటీ సీఈఓ మోహన్‌రావు, విద్యుత్‌శాఖ ఎస్‌ఈ విజయన్, సీపీఓ నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.