
డెంగీ రహిత సమాజం కోసం కృషి
● డీఎంహెచ్‌ఓ సుజాత
నెల్లూరు(అర్బన్): డెంగీ వ్యాధి రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని డీఎంహెచ్‌ఓ సుజాత అన్నారు. డెంగీ అవగాహన మాసోత్సవాన్ని పురస్కరించుకుని మలేరియా నివారణ విభాగం ఆధ్వర్యంలో మంగళవారం నెల్లూరు సంతపేటలోని వైద్యశాఖ కార్యాలయం నుంచి ములుముడి బస్టాండ్, గుప్తా పార్కు మీదుగా ర్యాలీ జరిగింది. దీనిని జెండా ఊపి ప్రారంభించిన డీఎంహెచ్‌ఓ మాట్లాడుతూ తలనొప్పి, కళ్లు ఎర్రబడటం, జ్వరం, చర్మంపై ఎర్రటి మచ్చలు, వాంతులు తదితర లక్షణాలుంటే డెంగీగా అనుమానించి రక్తపరీక్షలు చేయించుకోవాలన్నారు. జిల్లా మలేరియా నివారణాధికారి హుస్సేనమ్మ మాట్లాడుతూ దోమలు కుట్టకుండా చూసుకోవడం ద్వారా డెంగీతోపాటు మలేరియా తదితర వ్యాధులు రాకుండా చూసుకోవచ్చన్నారు. ప్రజలు జాగ్రత్తలు పాటించాలన్నారు. కార్యక్రమంలో అడిషనల్ డీఎంహెచ్‌ఓ ఖాదర్‌వలీ, మలేరియా నివారణ సహాయ అధికారి నాగార్జునరావు, వైద్యసిబ్బంది పాల్గొన్నారు.