కోవూరు: రాష్ట్ర వ్యాప్తంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పర్యటనలకు ప్రజల్లో విశేష స్పందన లభిస్తుండడంతో చంద్రబాబుకు భయం పట్టుకుందని మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు. మంగళవారం నెల్లూరులోని తన నివాసంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మాజీమంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించేందుకు వస్తున్న జగన్‌ను కూటమి ప్రభుత్వం అడ్డుకునే ప్రయత్నాలు చేస్తుందని ఆరోపించారు. అర చేతితో సూర్యకాంతిని ఎలా ఆపలేరో.. కూటమి ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు, కుట్రలు సృష్టించినా జగన్ పర్యటనను ఆపలేరని తెలుసుకోవాలన్నారు. జగన్ హెలికాప్టర్ దిగడానికి కూడా వీలులేకుండా చేయడం దుర్మార్గమని, నెల్లూరేమన్నా.. చంద్రబాబు నాయన ఖర్జూరపునాయుడు జాగీరా అని ప్రసన్నకుమార్‌రెడ్డి మండిపడ్డారు. జగన్ ప్రజల మధ్య ఉండే నాయకుడని, ఆయన పర్యటనల్లో ప్రజలు తండోపతండాలుగా పాల్గొంటారని చెప్పారు. ‘బాబు, లోకేశ్, పవన్ పర్యటనలకు సెక్యూరిటీ సిబ్బంది తప్ప.. జనం కానరాని, అదే జగన్ వస్తే వేలాదిగా జన ప్రభంజనమవుతుందన్నారు. గతంలో చంద్రబాబు, పవన్‌కల్యాణ్ నిర్వహించిన సభలను వైఎస్సార్‌సీపీ ఎప్పుడూ అడ్డుకోలేదని గుర్తు చేశారు. కాకాణి గోవర్ధన్‌రెడ్డిపై తప్పుడు కేసులు పెట్టి జైల్లో పెట్టారన్నారు. కాకాణితో ములాఖత్ అయ్యాక, ఆ కుటుంబాన్ని పరామర్శించే ఈ పర్యటనను అడ్డుకోవడం ప్రభుత్వం దుర్మార్గమన్నారు. ఇది రాజకీయ పర్యటన కాదని, మానవతా పరమైన పరామర్శ మాత్రమే అన్నారు.
కూటమికి కౌంట్ డౌన్ స్టార్ట్
బాబు ఇటీవల ఐదారు సర్వేలు చేయించారు. 97 స్థానాల్లో టీడీపీ ఎమ్యెల్యేలకు డిపాజిట్లు కూడా వచ్చే పరిస్థితి లేదని నివేదికలు రావడంతో చంద్రబాబులో టెన్షన్ ప్రారంభమైందన్నారు. ఇటీవల జరిగి టీడీపీ విస్తృత స్థాయి సమావేశానికి 15 ఎమ్మెల్యేలు కూడా హాజరు కాలేదు. వీటన్నంటిని చూసి భయంతో జగన్ పర్యటనలకు అనుమతులు నిరాకరణ చేస్తున్నాడని ప్రసన్నకుమార్‌రెడ్డి విమర్శించారు.
అక్రమ అరెస్టులకు ప్రజల తీర్పు సిద్ధం
వైఎస్సార్‌సీపీ నేత వీరి చలపతిరావు మాట్లాడుతూ జగన్ పర్యటనను అడ్డుకునే కుట్రలకు కూటమి ప్రభుత్వానికి ప్రజలు తీర్పు సిద్ధంగా ఉందన్నారు. కాలువ గట్లు, పొలాలు గట్లపై జనం పరుగులు తీస్తున్న తీరు చూసి కూటమి నాయకుల గుండెల్లో గుబులు మొదలైందన్నారు. కూటమి నాయకులూ కళ్లు తెరిచి ఎన్నికల్లో చెప్పిన వాగ్దానాలను అమలు చేయాలన్నారు. ఇటీవల వైఎస్సార్‌సీపీ చేసిన పోరాట ఫలితంగానే తల్లికి వందనం (అమ్మఒడి ) పథకం వచ్చిందన్నారు. ఈ సమావేశంలో నాయకులు మావులూరు శ్రీనివాసులురెడ్డి, మల్లికార్జునరెడ్డి దినేష్‌రెడ్డి, రాధాకృష్ణారెడ్డి, విజయకుమార్‌రెడ్డి, సతీష్‌రెడ్డి, నరసింహులురెడ్డి, సుబ్బారెడ్డి, షాహుల్, బాలశంకర్‌రెడ్డి, నవీన్‌కుమార్‌రెడ్డి, శ్రీలత, రఫీ, రూప్‌కుమార్‌రెడ్డి తదితరులున్నారు.
నెల్లూరు ఏమన్నా..
ఖర్జూరపునాయుడి జాగీరా?
జగన్ బయటకు వస్తే బాబుకు భయం
మాజీ మంత్రి ప్రసన్నకుమార్‌రెడ్డి