
ప్రతి అర్జీని నిర్దిష్ట గడువులోగా పరిష్కరించాలి
నెల్లూరు రూరల్: ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ప్రజలు ఇచ్చే అర్జీలను నిర్దిష్ట వ్యవధిలో పరిష్కరించాలని కలెక్టర్ ఓ ఆనంద్ సంబంఽధిత అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని ఎస్‌ఆర్ శంకరన్ హాల్ నుంచి సబ్‌కలెక్టర్లు, ఆర్డీఓలు, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలు, తహసీ ల్దార్లతో కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ పీజీఆర్‌ఎస్‌లో పరిష్కరించిన అర్జీలపై అర్జీదారుల నుంచి సంబంఽధిత సచివాలయాల సిబ్బంది అభిప్రాయాలు తెలుసుకుని రిపోర్టు అందించాలని, ఈ విషయమై ఎంపీడీఓలు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు. ప్రతి వారం వచ్చే అర్జీల్లో 60 శాతం రెవెన్యూ సమస్యలపైనే వస్తున్నాయన్నారు. ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరిస్తూ ఎండార్సుమెంట్‌తోపాటు తగిన ఆధార పత్రాలను అప్‌లోడ్ చేయాలన్నారు. ఉపాధి హామీ పనుల వేగం పెంచాలని, ప్రతి వారం కనీసం 70 శాతం తగ్గకుండా పనులు జరిగేలా ఎంపీడీఓలు, ఏపీఓలు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఉపాధి పనుల్లో నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్న అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. పేదల ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేసేందుకు ప్రభుత్వం అదనపు ఆర్థిక సహాయాన్ని లబ్ధిదారుల ఖాతాలకు జమ చేస్తుందని, దశల వారీగా నిర్మాణాల్లో వేగం పెంచి పూర్తి చేయాలన్నారు. పీఎం సూర్యఘర్ యోజన పథకం ఏర్పాటుపై పూర్తిస్థాయిలో ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో డీఆర్‌ఓ ఉదయభాస్కర్, జెడ్పీ సీఈఓ విద్యారమ, హౌసింగ్, డ్వామా పీడీలు వేణుగోపాల్, గంగాభవాని, విద్యుత్‌శాఖ ఎస్‌ఈ విజయన్, సమగ్ర శిక్ష ఏపీసీ వెంకటసుబ్బయ్య, ఐటీడీఏ పీఓ మల్లికార్జునరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
గృహ నిర్మాణాల్లో వేగం పెంచాలి
ఉపాధి హామీ పనులు ముమ్మరం చేయండి
నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవు
వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ ఆనంద్