మాస్టారు.. ఇది సాధ్యమేనా? | - | Sakshi
Sakshi News home page

మాస్టారు.. ఇది సాధ్యమేనా?

May 12 2025 11:51 PM | Updated on May 12 2025 11:51 PM

మాస్ట

మాస్టారు.. ఇది సాధ్యమేనా?

●పెన్నా పరీవాహక ప్రాంతంలో ఇళ్ల పట్టాలంటూ మంత్రి నారాయణ ప్రకటన

అధికారమే పరమావధిగా కూటమి నేతలు సాగించిన మోసపూరిత ప్రచారాలతో పేద ప్రజల జీవితాలు ఇప్పటికే తలకిందులయ్యాయి. తాజాగా పెన్నా పరీవాహక ప్రాంతంలోని నివాసితులకు శాశ్వత ఇళ్ల పట్టాలిస్తామంటూ ఆశలు రేకెత్తిస్తూ మంత్రి నారాయణ ప్రకటన చేసి మరో మోసానికి తెర తీశారు. గత ప్రభుత్వ హయాంలోనే అప్పటి మంత్రి అనిల్‌కుమార్‌యాదవ్‌ వారికి నివేశన పట్టాలు పంపిణీ చేశారు. మంత్రి నారాయణ ఇస్తామన్న పట్టాలు సదరు పేదలకు ఎందుకూ ఉపయోగపడవని, చెల్లుబాటు కావనే విషయాన్ని సుప్రీం కోర్టు ఆదేశాలు స్పష్టం చేస్తున్నాయి. అయినా పేదల జీవితాలతో మంత్రి నారాయణ డ్రామాలు ఆడుతూ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం పాకులాడుతున్నారని అర్థమవుతోంది.

నెల్లూరు వెంకటేశ్వరపురం వద్ద పెన్నానదిలో నిర్మిస్తున్న రక్షణ గోడ

గత ప్రభుత్వ హయాంలోనే నివేశన పట్టాలు పంపిణీ

స్వార్థ రాజకీయాల కోసం పేదలతో డ్రామాలు

భగత్‌సింగ్‌ కాలనీలో 1,400

కుటుంబాలకు శాశ్వత అన్యాయం

సాక్షి ప్రతినిధి, నెల్లూరు: ‘చెరువులు, నీటి కుంటలు, నదులను పరిరక్షించుకోవడం మన అందరి బాధ్యత. పరీవాహక ప్రాంతాల్లో శాశ్వత నిర్మాణాలు చేపట్టరాదు. నీటి వనరులను సంరక్షించుకుంటే అవి మన భవిష్యత్‌ తరాలను కాపాడుతాయి’ ఇది గతంలో సుప్రీంకోర్టు అభిప్రాయం వ్యక్తపరుస్తూ కొన్ని ఆదేశాలు రాష్ట్ర ప్రభుత్వాలకు జారీ చేసింది. ఈ ఆదేశాల ప్రకారమే పక్కనే ఉన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హైడ్రా ఏర్పాటు చేసి చెరువుల్లో నిర్మాణాలను తొలగింపునకు శ్రీకారం చుట్టింది. ఈ క్రమంలో నెల్లూరులో కూడా హైడ్రా ఏర్పాటు చేసి నదీ తీరాలు, చెరువుల్లో ఆక్రమణలు తొలగిస్తామని గతంలో మంత్రి నారాయణ చెప్పారు. అయితే ఇప్పుడు అందుకు విరుద్ధంగా నగర పరిధిలో పెన్నానది అంతర్భాగమైన భగత్‌సింగ్‌ కాలనీలో నివాసాలు ఏర్పాటు చేసుకున్న పేదలకు ఇళ్ల పట్టాలు ఇస్తామని, మంత్రి వర్గం ఆమోదం తెలిపిందని చెప్పడం చూస్తుంటే నిజంగా ఆ పేద వర్గాలకు శాశ్వత అన్యాయం చేస్తున్నారని స్పష్టమవుతోంది.

శాశ్వత పట్టాలిస్తే..

భగత్‌సింగ్‌ కాలనీలో సుమారు 1400 పేద కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. ఇప్పటికే ఆయా స్థలాల్లో శాశ్వత నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. ఇప్పుడు మంత్రి నారాయణ చెప్పినట్లు పట్టాలిస్తే.. ఆ స్థలాలపై శాశ్వత హక్కుగా భావించి ఆ పేదలు తమ జీవిత కాలం కష్టపడి సంపాదించుకున్న రూ.లక్షల ఖర్చు పెట్టుకుని పక్కా భవనాలు నిర్మించుకునే అవకాశం ఉంది. ఇతరులకు క్రయవిక్రయాలు చేసుకునే పరిస్థితులు ఉంటాయి. నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌, సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు భవిష్యత్‌లో ఈ స్థలాల్లోని నిర్మాణాలను తొలగించాల్సి వస్తే.. ఆ పేదలు శాశ్వతంగా నష్టపోయే అవకాశాలు ఉన్నాయి. పెన్నానది పరీవాహక అంతర్భాగంగా ఉన్న ఆ ప్రాంతంలో ప్రభుత్వం ఇచ్చే ఇళ్ల పట్టాలు చెల్లుబాటు అవుతాయా? అనేది అందరిలో అనేక అనుమానాలు ఉన్నాయి. ఈ అనుమానాలు నిజమే. ఈ పట్టాలు ఎందుకు ఉపయోగపడే అవకాశమే లేదని పర్యావరణవేత్తలు స్పష్టం చేస్తున్నారు. ఈ విధంగా ఆ పేదలకు అన్యాయం చేసినట్లే అవుతుంది.

మాజీ మంత్రి అనిల్‌ హయాంలో

నివాస ధ్రువీకరణ పత్రాలు

భగత్‌సింగ్‌ కాలనీలో అన్ని వర్గాల ప్రజలు నివాసముంటున్నారు. దాదాపు 14 వందల కుటుంబాలు అక్కడ ఏళ్ల కాలంగా నివాసముంటున్నాయి. పెన్నానది అంతర్భాగంలోనే వారు నివాసాలు ఏర్పాటు చేసుకుని జీవిస్తున్నారు. గత ప్రభుత్వాలు వారికి మౌలిక సదుపాయాలైన విద్యుత్‌, నీరు వసతి ఏర్పాటు చేశారు. ప్రతి ఎన్నికల సమయంలో ఇళ్ల పట్టాలిస్తామని హామీ ఇచ్చారు. కానీ గతంలో ఎవరూ పట్టించుకోలేదు. గత ప్రభుత్వ హయాంలో మంత్రిగా ఉన్న పొలుబోయిన అనిల్‌కుమార్‌యాదవ్‌ ఇచ్చిన హామీని నెరవేర్చేందుకు ఇళ్ల పట్టాలు ఇచ్చేందుకు సాధ్యాసాధ్యాలను పరిశీలించారు. ఉన్నత స్థాయిలో కూడా చర్చలు జరిపినా సుప్రీంకోర్టు గైడ్‌లైన్స్‌ ప్రకారం ఇవ్వకూడదని తేల్చి చెప్పారు. కానీ ఆయన పట్టువదలని విక్రమార్కుడులా గత ఎన్నికలకు ముందే వారిని శాశ్వత నివాస పత్రాలు కాకుండా నివాస ధ్రువీకరణ పత్రాలు ఇప్పించారు. ఆయనే భగత్‌సింగ్‌ కాలనీ వాసులకు తన చేతుల మీదుగా పంపిణీ చేశారు. గతంలో ఎవరూ చేయని పని అనిల్‌కుమార్‌యాదవ్‌ చేయడంతో ఆ పేదల్లో ఆనందం వెల్లివిరిసింది. వరదల సమయంలో నీటిలో మునిగిపోయే ఆ భగత్‌సింగ్‌కాలనీకి ఆ ముంపు రాకూడదనే ఉద్దేశంతో పెన్నానదికి రూ.100 కోట్ల వ్యయంతో రక్షణ గోడ నిర్మాణం చేయించారు. వరదల సమయంలో అప్పటి సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ఆ కాలనీలో పర్యటించేలా చేసి వాల్‌ నిర్మాణానికి నిధులు మంజూరు చేయించారు. ప్రస్తుతం ఆ గోడ నిర్మాణం కూడా పూర్తయ్యే దశలో ఉంది.

ఆగిన శిల్పారామం

గతంలో కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో బుజబుజ నెల్లూరు సమీపంలో ఉన్న చెరువులో శిల్పారామం ఏర్పాటు చేసేందుకు టెండర్లు పిలిచి పనులు కూడా చేపట్టారు. కానీ స్థానిక పర్యావరణ వేత్తలు చెరువులో నిర్మాణాలు ఎలా చేపడుతారని న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో ఆ నిర్మాణం నిలిచిపోయింది. నదులు, నీటికుంటల పరిధిలోని వంద మీటర్లు వరకు ఎలాంటి శాశ్వత నిర్మాణాలు చేపట్టకూడదనే జీఓ నంబర్‌119/2017లో స్పష్టం చేస్తోంది. ప్రభుత్వ జీఓలకు విరుద్ధంగా మంత్రి నారాయణ ఇళ్ల పట్టాలు ఇప్పిస్తానంటూ ప్రచారం చేసుకోవడం వెనుక తన స్వార్థ రాజకీయ ప్రయోజనాలు కోసమేనన్న ప్రచారం ఉంది.

నగర నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్న మంత్రి నారాయణ భగత్‌సింగ్‌ కాలనీవాసులకు శాశ్వత ఇళ్ల పట్టాలు ఇస్తానంటూ నమ్మబలికాడు. మంత్రి వర్గం కూడా గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిందని చెబుతున్నాడు. ఆ పేదల ఆశలు నెరవేరుతాయని పెద్దగా పబ్లిసిటీ చేస్తున్నారు. వాస్తవంగా పెన్నానది అంతర్భాగంలో ఉండే ఆ కాలనీలో ఇళ్ల పట్టాలు పంపిణీ చేసినా అవి ఉపయోగపడవనే భావన ప్రజల్లో ఉంది. సుప్రీం కోర్టు గైడ్‌ లైన్స్‌ను కాదని పత్రాలు పంపిణీ చేసినా అవి ఎందుకూ ఉపయోడపడవని పర్యావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఉన్నతాధికారులు సైతం మంత్రి నారాయణ నిర్ణయాలను చూసి నివ్వెరపోతున్నారు. పేద వర్గాలకు అన్యాయం చేసేందుకే అని అంటున్నారు.

మాస్టారు.. ఇది సాధ్యమేనా? 
1
1/2

మాస్టారు.. ఇది సాధ్యమేనా?

మాస్టారు.. ఇది సాధ్యమేనా? 
2
2/2

మాస్టారు.. ఇది సాధ్యమేనా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement