
పరాకాష్టకు చేరిన కూటమి దుర్మార్గం
నెల్లూరు (స్టోన్‌హౌస్‌పేట): కూటమి ప్రభుత్వ దుర్మార్గాలు పరాకాష్టకు చేరాయని, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి అక్రమ అరెస్ట్‌లతో ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఖూనీ అయిపోయిందని ఎమ్మెల్సీ, వైఎస్సార్‌సీపీ నెల్లూరు సిటీ నియోజకవర్గ ఇన్‌చార్జి పర్వతరెడ్డి చంద్రశేఖరరెడ్డి దుయ్యబట్టారు. నెల్లూరులో శనివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రజాపాలన, అభివృద్ధి పనులను గాలికి వదిలేసి, వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందన్నారు. దాదాపు 11 నెలల పాలనలో ప్రజలు, ఉపాధ్యాయులు, ఉద్యోగులు ఎవరు కూడా కూటమి ప్రభుత్వ విధానాలపై సంతృప్తిగా లేరన్నారు. ఎక్కడా అభివృద్ధి పనులు జరగడం లేదన్నారు. ఒక్క ఏడాదిలోనే రూ.1.10 లక్షల కోట్ల అప్పులు చేశారని, ఇలా అప్పు చేసిన సొమ్మునంతా కాంట్రాక్టర్లతో దొంగ బిల్లులు పెట్టించి కమీషన్లు దండుకుంటుందని ఆరోపించారు. రాష్ట్రం అప్పుల ఊబిలోకి కూరుకుపోతుందన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదని ప్రశ్నించిన వైఎస్సార్‌సీపీ నేతలపై అక్రమ కేసులు బనాయించడం, వారిపై దౌర్జన్యాలకు దిగడం పరిపాటిగా మారిందన్నారు.
పారదర్శక పాలనపై ఆరోపణలు
గత ప్రభుత్వంలో అత్యంత పారదర్శకంగా జరిగిన లిక్కర్ అమ్మకాలను తప్పు పడుతూ స్కామ్ అంటూ ఎవరో ఒకరితో అబద్ధపు స్టేట్‌మెంట్ ఇప్పించి వాటి ఆధారంగా సీనియర్ ఐఏఎస్ అధికారిగా వ్యవహరించిన ధనుంజయరెడ్డి, గత సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఓఎస్డీగా వ్యవహరించిన కృష్ణమోహన్‌రెడ్డిలను అక్రమంగా అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపడం అత్యంత దారుణమన్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో లిక్కర్ అమ్మకాల విషయంలో ప్రతి బాటిల్ స్కాన్ చేసి అత్యంత పారదర్శకంగా ప్రతి రూపాయి ప్రభుత్వ ఖజానాకు చేరేలా అమ్మకాలు జరిగాయన్నారు. అంతకు ముందుకు, ఇప్పుడు టీడీపీ ప్రభుత్వంలో వీధికో బెల్టు షాపు, మద్యం షాపులు వద్ద పర్మిట్ రూంలు ఏర్పాటు చేసి 24 గంటలు మద్యం అమ్మకాలు సాగించారని తెలిపారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత బెల్ట్ షాపులను పూర్తిగా రద్దు చేసి ప్రభుత్వ మద్యం దుకాణాలను తీసుకొచ్చి నిర్దిష్ట సమయం ప్రకారమే మద్యం అమ్మకాలు సాగించామని గుర్తు చేశారు. ఇలా అత్యంత పారదర్శకంగా మద్యం అమ్మకాలను గత ప్రభుత్వం సాగిస్తే ఈ రోజు దానికి మద్యం స్కాం అని పేరు పెట్టడం దుర్మార్గమన్నారు.
రిటైర్డ్ ఐఏఎస్ ధనుంజయరెడ్డి,
కృష్ణమోహన్‌రెడ్డి అక్రమ అరెస్ట్‌లతో
ప్రజాస్వామ్యం ఖూనీ
ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖరరెడ్డి