
ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలకు ఏర్పాట్లు
● డీఆర్వో ఉదయభాస్కర్‌రావు
నెల్లూరు రూరల్: జిల్లాలో ఈనెల 12 నుంచి 20వ తేదీ వరకు జరిగే ఇంటర్మీడియట్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలకు పక్కాగా ఏర్పాట్లు చేయాలని డీఆర్వో జె.ఉదయభాస్కర్‌రావు ఆదేశించారు. నెల్లూరు కలెక్టరేట్‌లోని తన కార్యాలయంలో శుక్రవారం సంబంధిత అధికారులతో సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఆర్వో మాట్లాడుతూ మొదటి సంవత్సరం పరీక్షలు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, రెండో సంవత్సరం పరీక్షలు మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు జరుగుతాయన్నారు. ప్రథమ, ద్వితీయ సంవత్సరం కలిపి 24,835 మంది విద్యార్థులు హాజరవుతున్నారని, అందుకోసం 65 కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. అలాగే ప్రాక్టికల్ పరీక్షలను ఈనెల 28 నుంచి జూన్ ఒకటో తేదీ వరకు నిర్వహిస్తామన్నారు. అన్ని పరీక్ష కేంద్రాల్లో నిరంతర విద్యుత్ సరఫరా జరిగేలా చూడాలన్నారు. ప్రథమ చికిత్స కిట్లను అందుబాటులో ఉంచాలన్నారు. ఎండల తీవ్రత దృష్ట్యా తాగునీటి వసతి సౌకర్యం కల్పించాలన్నారు. పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. విద్యార్థులు సకాలంలో కేంద్రాలకు చేరుకునేలా ఆర్టీసీ అధికారులు బస్సులను నడపాలని సూచించారు. ప్రత్యేక కంట్రోల్ రూమ్ (0861 – 2320312) పెట్టామన్నారు. సమావేశంలో ఆర్‌ఐఓ వరప్రసాద్‌రావు, జిల్లా వృత్తి విద్యాశాఖాధికారి మధుబాబు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.