హాస్టళ్లల్లో మరమ్మతులు వేగంగా పూర్తి చేయాలి | - | Sakshi
Sakshi News home page

హాస్టళ్లల్లో మరమ్మతులు వేగంగా పూర్తి చేయాలి

May 7 2025 12:06 AM | Updated on May 7 2025 12:06 AM

హాస్టళ్లల్లో మరమ్మతులు వేగంగా పూర్తి చేయాలి

హాస్టళ్లల్లో మరమ్మతులు వేగంగా పూర్తి చేయాలి

నెల్లూరు రూరల్‌: జిల్లాలోని సోషల్‌ వెల్ఫేర్‌ హాస్టళ్లలో మరమ్మతు పనులు ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని కలెక్టర్‌ ఆనంద్‌ ఇంజినీరింగ్‌ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లోని తిక్కన ప్రాంగణంలో జిల్లాలోని హాస్టల్‌ వెల్ఫేర్‌ అధికారులు, వార్డెన్లతో కలెక్టర్‌ సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో 64 హాస్టళ్లలో శ్లాబు, గోడల మరమ్మతులు, ఎలక్ట్రికల్‌, నీటి సరఫరా, కిటికిలు, తలుపులు తదితర అత్యవసర మరమ్మతులు చేపట్టేందుకు ప్రభుత్వం రూ.9.32 కోట్లు నిధులు మంజూరు చేసిందన్నారు. పంచాయతీరాజ్‌ శాఖకు 34, ఆర్‌అండ్‌బీ శాఖకు 30 హాస్టళ్లను కేటాయించి త్వరగా పనులు పూర్తి చేయాలని ఆదేశాలిచ్చినట్లు చెప్పారు. వేసవి సెలవుల అనంతరం విద్యార్థులందరూ హాస్టళ్లకు తిరిగి వచ్చేలోగా ఈ పనులన్ని పూర్తి కావాలని ఆదేశించారు.

నూరుశాతం సీట్లు భర్తీ చేయండి

అన్ని వసతులు కలిగి ఉన్న హాస్టళ్లలో నూరు శాతం అడ్మిషన్లు ఉండేలా ప్రత్యేక దృష్టి పెట్టాలని ఏఎస్‌డబ్ల్యూఓలకు సూచించారు. ఇందు కోసం ప్రత్యేక యాక్షన్‌ ప్లాన్‌తో పని చేయాలని ఆదేశించారు. ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను తల్లిదండ్రులకు వివరించి ఎక్కువ మంది విద్యార్థులు హాస్టళ్లలో చేరేలా చర్యలు చేపట్టాలన్నారు. సరైన వసతులు లేక తక్కువ విద్యార్థులున్న హాస్టళ్లను సమీపంలో మెరుగైన వసతులు కలిగి ఉన్న హాస్టళ్లను అనుసంధానించాలని సూచించారు. జిల్లాలోని సోషల్‌ వెల్ఫేర్‌ హాస్టళ్లకు ప్రభుత్వం నిర్దేశించిన 5,900 విద్యార్థుల సంఖ్యకు తక్కువ కాకుండా పూర్తి స్థాయిలో భర్తీ అయ్యేలా ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు.

10వ తరగతి సప్లిమెంటరీలో

మెరుగైన ఫలితాలు సాధించాలి

జిల్లాలోని సోషల్‌ వెల్ఫేర్‌ హాస్టళ్లలో ఈ ఏడాది సాధించిన 10వ తరగతి ఫలితాలపై కలెక్టర్‌ ఆనంద్‌ సమీక్షించారు. కొన్ని హాస్టళ్లలో తక్కువ ఉత్తీర్ణత శాతం ఉండడంపై కలెక్టర్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి తరగతులు మొదలైన మొదటి నెల నుంచే విద్యార్థులపై పూర్తిస్థాయిలో పర్యవేక్షణ ఉంచాలని, విద్యార్థుల అభ్యసనా సామర్థ్యాలను అంచనా వేయాలన్నారు. సబ్జెక్ట్‌ల వారీగా వెనుకబడిన విద్యార్థులకు వారికి అర్థమయ్యేలా ముందు నుంచే మెరుగైన బోధన అందించడం ద్వారా సత్ఫలితాలు సాధించవచ్చున్నారు. ఫెయిలైన విద్యార్థులందరూ టెన్త్‌ సప్లిమెంటరీ పరీక్షల్లో నూరు శాతం ఉత్తీర్ణత సాధించేలా ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని ఏఎస్‌డబ్ల్యూఓలకు సూచించారు. ట్యూషన్లు పెట్టి సబ్జెక్ట్‌ల వారీగా వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ఈ సమావేశంలో సోషల్‌ వెల్ఫేర్‌ డిప్యూటీ డైరెక్టర్‌ శోభారాణి, పంచాయతీరాజ్‌, ఆర్‌అండ్‌బీ ఇంజినీరింగ్‌ అధికారులు జీ రామకృష్ణప్రసాద్‌, సుబ్బరాజు, హాస్టల్‌ సంక్షేమ అధికారులు, వార్డెన్లు తదితరులు పాల్గొన్నారు.

నూరు శాతం సీట్లు భర్తీ చేయండి

టెన్త్‌ సప్లిమెంటరీ పరీక్షల్లో సంపూర్ణ

ఉత్తీర్ణత సాధించాలి

కలెక్టర్‌ ఆనంద్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement