
గుర్తుతెలియని వృద్ధుడి మృతి
ఉలవపాడు: గుర్తుతెలియని వృద్ధుడు మృతిచెందిన ఘటన మండల పరిధిలోని జాతీయ రహదారిపై చాగల్లు అండర్‌పాస్ వద్ద ఆదివారం జరిగింది. ఒంగోలు నుంచి కావలి వెళ్లే వైపు మృతదేహం లభ్యమైంది. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. ఎస్సై అంకమ్మ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతుడి వయసు సుమారు 70 ఏళ్లు ఉంటుందని భావిస్తున్నారు. యాచకుడై ఉంటాడని, ఎండ వేడిమికి తట్టుకోలేక చనిపోయి ఉండొచ్చని చెబుతున్నారు. వృద్ధుడి ఒంటిపై చొక్కా లేదు. బులుగు రంగు లుంగీ ధరించి ఉన్నాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉలవపాడు సీహెచ్‌సీకి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
చెరువులో పడి..
● వ్యక్తి మృత్యువాత
ఆత్మకూరు: ఆత్మకూరు పట్టణంలోని శివాలయం ప్రాంతంలో నివాసం ఉండే యస్దానీ (38) అనే వ్యక్తి చెరువులో పడి మృతిచెందిన ఘటన ఆదివారం జరిగింది. బంధువుల కథనం మేరకు.. కూలీ అయిన యస్దానీ బహిర్బూమికి చెరువు వద్దకు వెళ్లాడు. ఎంతసేపటికీ ఇంటికి రాకపోవడంతో బంధువులు గాలించగా నీటిలో శవమై కనిపించాడు. అతడికి వివాహమైంది. భార్య గతంలోనే విడిపోయిందని, పిల్లల్లేరని స్థానికులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు అందలేదు.
సైకిల్‌పై వెళ్తుండగా..
● లారీ ఢీకొని వృద్ధుడి మృతి
కందుకూరు: సైకిల్‌పై వెళ్తున్న వృద్ధుడిని లారీ ఢీకొనడంతో తీవ్రంగా గాయపడి మృతిచెందిన ఘటన ఆదివారం కందుకూరు పట్టణంలో జరిగింది. బంధువులు, పోలీసుల కథనం మేరకు.. కందుకూరు మండలం మహదేవపురం గ్రామానికి చెందిన నేరెళ్ల రంగయ్య (65) అనే వృద్ధుడు ఆదివారం ఉదయం వ్యక్తిగత పని నిమిత్తం సైకిల్‌పై పట్టణానికి వచ్చాడు. నిత్యం రద్దీగా ఉండే పోస్టాఫీస్ సెంటర్‌లో సైకిల్‌పై వెళ్తుండగా ప్రమాదవశాత్తు లారీ ఢీకొట్టింది. రంగయ్య కాలుపై నుంచి లారీ టైర్లు వెళ్లడంతో నుజ్జునుజ్జయింది. తీవ్రంగా గాయపడిన వృద్ధుడిని మెరుగైన చికిత్స కోసం ఒంగోలు రిమ్స్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ రంగయ్య మృతిచెందినట్లు బంధువులు తెలిపారు. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ పట్టణ పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.