
నెల్లూరు(మినీబైపాస్): నెల్లూరులోని జిల్లా ఉపాధి కార్యాలయంలో శుక్రవారం జాబ్‌మేళా జరుగుతుందని ఉపాధి అధికారి ఎ.సురేష్ కుమార్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. లలిత జ్యువెలరీ, శ్రీరామ ఫైనాన్స్ లిమిటెడ్‌లో ఉద్యోగాల కోసం 25 నుంచి 45 సంవత్సరాల మధ్య వయసు ఉన్న వారు అర్హులన్నారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆటోనగర్ లోని జిల్లా ఉపాధి కార్యాలయంలో ఉదయం 10.30 గంటలకు జరిగే ఇంటర్వ్యూలకు హాజరుకావాలని సూచించారు.
వడ్డీ లేకుండా పన్ను చెల్లింపునకు నేటితో గడువు పూర్తి
నెల్లూరు(బారకాసు): నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలో ఆస్తి, ఖాళీ స్థలాలకు సంబంధించి పన్ను బకాయిలున్న యజమానులు వడ్డీ లేకుండా ఏకకాలంలో నగదు చెల్లించేందుకు గడువు శుక్రవారంతో ముగుస్తుందని నగరపాలక సంస్థ కమిషనర్ హరిత గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. నగదు కట్టేందుకు ఈనెల 16 నుంచి 31వ తేదీ వరకు ప్రభుత్వం గడువు ఇచ్చిందన్నారు. అనేకమంది గృహ యజమానులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారని తెలియజేశారు. శుక్రవారంతో గడువు ముగుస్తున్నందున మిగిలిన యజమానులు నగదు చెల్లించాలని ఆమె కోరారు.
ముగిసిన
ఫ్లోర్ కర్లింగ్ పోటీలు
నెల్లూరు(టౌన్): నెల్లూరులోని వేదాయపాళెంలో ఉన్న ఎల్‌ఎల్‌ఎఫ్ స్కూల్లో రాష్ట్రస్థాయి కర్లింగ్ పోటీల ముగింపు కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఫ్లోర్ కర్లింగ్ గేమ్ అసోసియేషన్ అధ్యక్షుడు సురేంద్రరెడ్డి మాట్లాడుతూ సబ్ జూనియర్స్, జూనియర్స్, సీనియర్స్ విభాగాల్లో నిర్వహించిన పోటీల్లో ఓవరాల్ ఛాంపియన్‌షిప్‌ను తిరుపతి, ద్వితీయ స్థానాన్ని నెల్లూరు, తృతీయ స్థానాన్ని కర్నూలు జిల్లా క్రీడాకారులు కై వసం చేసుకున్నారన్నారు. వీరు మే 19 నుంచి 21వ తేదీ వరకు అరుణాచల్‌ప్రదేశ్‌లో జరిగే జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొంటారన్నారు. విజేతలతోపాటు ప్రతిభ చూపిన క్రీడాకారులకు ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి ట్రోఫీలు, మెడల్స్ ప్రదానం చేశారు. కార్యక్రమంలో అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు కొండారెడ్డి, సెక్రటరీ మనోహర్, వైఎస్సార్‌సీపీ 28వ డివిజన్ ఇన్‌చార్జి మదన్‌మోహన్‌రెడ్డి, సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు.
అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి
సోమశిల: అనంతసాగరం మండలంలోని కమ్మవారిపల్లిలో ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన ఘటన గురువారం జరిగింది. సోమశిల ఎస్సై భోజ్యానాయక్ కథనం మేరకు.. ప్రకాశం జిల్లా బల్లికురవకు చెందిన సింహాచలంనాయక్ (45) కొన్ని సంవత్సరాలుగా గ్రామంలో గోతాలను పట్టలుగా కుట్టుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఆయనకు భార్య సామ్రాజ్యం, ఇద్దరు కుమారులున్నారు. కాగా గురువారం ఉదయం ట్రాక్టర్ హ్యాండిల్‌కు అతను వేలాడుతూ కనిపించాడు. పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. కాగా మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆత్మకూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.

ట్రోఫీ, మెడల్స్ అందుకున్న క్రీడాకారులు