
ప్రసాదాన్ని అందజేస్తున్న నిర్వాహకులు
బుచ్చిరెడ్డిపాళెం : స్థానిక కోదండరామస్వామి ఆలయంలో శ్రీరామనవమిని పురస్కరించుకుని బ్రహ్మోత్సవాలకు గురువారం అంకురార్పణ చేశారు. ఇందులో భాగంగా ధ్వజారోహణ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆలయ ఆవరణలో ధ్వజ స్తంభానికి కొడిగుడ్డను కట్టి బ్రహ్మోత్సవాలకు సకల దేవతలను ఆహ్వానిస్తూ అర్చకులు శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలను భక్తిశ్రద్ధలతో జరిపించారు. అనంతరం సంతానం లేని మహిళలకు కొడిముద్దలను అందజేశారు. తదుపరి తిరుచ్చి ఉత్సవాన్ని ఆలయ ఆవరణలో అత్యంత వైభవంగా నిర్వహించారు. సీతాసమేత కోదండరామస్వామిని విశేషంగా అలంకరించి ఆలయం చుట్టూ ఊరేగింపు నిర్వహించారు.
మహావిష్ణువుగా కోదండరాముడు
బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం రాత్రి కోదండరామస్వామిని ప్రత్యేకంగా అలంకరించిన శేషవాహనంపై కొలువుదీర్చి గ్రామోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారు మహావిష్ణువు అలంకారంలో భక్తులను కటాక్షించారు. గ్రామోత్సవంలో భక్తులు స్వామివారికి నైవేద్యాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ దొడ్ల మురళీకృష్ణారెడ్డి, అర్చకులు పాల్గొన్నారు.
వేడుకగా ధ్వజారోహణ
దేవతలకు ఆహ్వానం పలుకుతూ పూజలు
సంతానం లేని వారికి కొడిముద్దల పంపిణీ

ధ్వజారోహణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న అర్చకులు