
మాట్లాడుతున్న కలెక్టర్ చక్రధర్‌బాబు
● కలెక్టర్ కేవీఎన్ చక్రధర్‌బాబు
నెల్లూరు(అర్బన్): ప్రభుత్వ ప్రాధాన్యత ఉన్న అన్నిరంగాలకు బ్యాంకర్లు విరివిగా రుణాలు మంజూరు చేయాలని కలెక్టర్ కేవీఎన్ చక్రధర్‌బాబు బ్యాంకర్లకు సూచించారు. మంగళవారం కలెక్టరేట్‌లోని తిక్కన ప్రాంగణంలో లీడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో డీసీసీ జిల్లాస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. తొలుత లీడ్ బ్యాంక్ జిల్లా మేనేజర్ శ్రీకాంత్ ప్రదీప్‌కుమార్ పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇస్తూ ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకర్ల ప్రగతిని వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న నవరత్నాలు, పేదలందరికీ ఇళ్లు పథకంలో బ్యాంకర్లు తప్పనిసరిగా భాగస్వాములు కావాలని తెలిపారు. పొదుపు సంఘాల్లోని మహిళలకు వడ్డీ లేని రూ.35 వేల రుణాన్ని వందశాతం అందించాలన్నారు. ఏప్రిల్ 15 నాటికి 10 వేల ఇళ్లు పూర్తి చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని, ఇందుకు బ్యాంకర్లు సహకరించాలని తెలిపారు. వ్యవసాయ సీజన్లలో రైతులకు అధికంగా పంట రుణాలు అందించాలన్నారు. ముద్ర, టిడ్కో గృహాలకు వ్యవసాయ, విద్య, ఎంఎస్‌ఎంఈ తదితర అన్నిరకాల పథకాలకు నిర్దేశించిన లక్ష్యాల మేరకు బ్యాంకులు రుణాలు ఇవ్వాలని తెలిపారు. ప్రైవేట్ బ్యాంకర్లు కొన్నిచోట్ల నిర్లక్ష్యంగా వహిస్తున్నారని, ఆర్‌బీఐ సూచనలకనుగుణంగా కచ్చితంగా లక్ష్యాలను చేరుకోవాలని సూచించారు. జిల్లాలోని 385 బ్రాంచ్‌ల బ్యాంకర్లు టార్గెట్‌ను పూర్తి చేయాలన్నారు. కార్యక్రమంలో ఆర్‌బీఐ ఏజీఎం హనుమకుమారి, నాబార్డు డీడీఎం రవిసింగ్, మెప్మా పీడీ రవీంద్ర, వ్యవసాయశాఖ జిల్లా అధికారి సుధాకర్‌రాజు, మత్స్యశాఖ జేడీ నాగేశ్వరరావు, పశుసంవర్థకశాఖ జేడీ మహేశ్వరుడు, జిల్లా ఉద్యానశాఖ అధికారి సుబ్బారెడ్డి, ఏపీఎంఐపీ పీడీ శ్రీనివాసరావు, ఎన్‌డీసీసీ బ్యాంకు సీఈఓ శంకర్‌బాబు, వివిధ బ్యాంకుల అధికారులు పాల్గొన్నారు.