సచిన్‌ కోవిడ్‌ను కూడా సిక్సర్‌ కొట్టగలడు: వసీం అక్రం

Sachin Can Hit Covid For Six Says Pakistan Legendary Bowler Wasim Akram - Sakshi

ఇస్లామాబాద్‌: ఇటీవల కరోనా బారినపడిన క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌.. డాక్టర్ల సూచన మేరకు శుక్రవారం ఆసుపత్రిలో చేరాడు. ఈ వార్త బయటకు రాగానే యావత్‌ క్రీడా ప్రపంచం ఒక్కసారిగా కుదుపునకు లోనైంది. ప్రముఖులందరూ సచిన్‌ ఆరోగ్యం గురించి వాకబు చేయడం మొదలుపెట్టారు. అయితే తనకెటువంటి ఇబ్బంది లేదని, తాను క్షేమంగా ఉన్నానని, సచిన్‌ స్వయంగా ట్వీట్‌ చేయడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ నేపథ్యంలో పాక్‌ దిగ్గజ బౌలర్‌ వసీం అక్రం కూడా సచిన్‌ ఆరోగ్యం గురించి ఆరా తీసి, అతను త్వరగా కోలుకోవాలని ట్వీట్‌ చేశాడు. 

"16 ఏళ్ల వ‌య‌సులోనే ప్రపంచ అత్యుత్తమ బౌల‌ర్లను గడగడలాడించావు, నువ్వు కోవిడ్‌ను కూడా సిక్స్ కొట్టగ‌ల‌వు, త్వర‌గా కోలుకో మాస్టర్" అంటూ అక్రం ట్వీట్‌లో పేర్కొన్నాడు. "భారత్‌ 2011 వన్డే ప్రపంచకప్‌ గెలిచి నేటికి దశాబ్ద కాలం పూర్తయ్యింది, ఈ ఆనంద క్షణాలను నువ్వు డాక్టర్లు, ఆసుపత్రి సిబ్బందితో పంచుకుంటావ‌ని ఆశిస్తున్నా, సెలబ్రేషన్స్‌కు సంబంధించిన ఫోటోలను నాకు కూడా పంపించు" అని అక్రం ట్వీట్‌లో ప్రస్థావించాడు. 90వ దశకంలో సచిన్‌, అక్రంల మధ్య మైదానంలో ఆధిపత్య పోరు నడిచింది. ఇందులో అనేక సందర్భాల్లో సచిన్‌దే పైచేయిగా నిలిచింది. కాగా, ఇటీవల ముగిసిన రోడ్‌ సేఫ్టీ ప్రపంచ సిరీస్‌ సందర్భంగా సచిన్‌తో పాటు భారత దిగ్గజ జట్టు సభ్యులు ఇర్ఫాన్‌ పఠాన్‌, యూసుఫ్‌ పఠాన్‌, బద్రీనాధ్‌లు కోవిడ్‌ బారిన పడిన సంగతి తెలిసిందే. 
చదవండి: సన్‌రైజర్స్‌కు డబుల్‌ ధమాకా.. జట్టులో చేరిన స్టార్‌ ఆటగాళ్లు

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top