
ముంబై: మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) వచ్చే సీజన్‌లో కొత్త హెడ్ కోచ్ ఆధ్వర్యంలో ముంబై ఇండియన్స్ జట్టు బరిలోకి దిగనుంది. వచ్చే సీజన్ కోసం ఆ్రస్టేలియా మాజీ క్రికెటర్ లీసా కైట్లీని హెడ్ కోచ్‌గా నియమిస్తున్నట్లు గురువారం ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ యజమాని నీతా అంబానీ ప్రకటించింది. 1997, 2005 వన్డే వరల్డ్‌కప్ టైటిల్స్ నెగ్గిన ఆస్ట్రేలియా జట్టులో లీసా సభ్యురాలిగా ఉంది. 54 ఏళ్ల లీసా ఆ్రస్టేలియా జట్టుకు 9 టెస్టుల్లో, 82 వన్డేల్లో, ఒక టి20 మ్యాచ్‌లో ప్రాతినిధ్యం వహించింది. మహిళల క్రికెట్ కోచింగ్‌లో లీసాకు మంచి పేరుంది. గతంలో ఆమె ఆ్రస్టేలియా, ఇంగ్లండ్ జాతీయ జట్లతోపాటు పలు టి20 ఫ్రాంచైజీ జట్లకు కోచ్‌గా వ్యవహరించింది. డబ్ల్యూపీఎల్ గత మూడు సీజన్‌లలో రెండుసార్లు ముంబై ఇండియన్స్ విజేతగా నిలిచింది.