
షెన్‌జెన్ (చైనా): డిఫెండింగ్ చాంపియన్ ఇటలీ బిల్లీ జీన్ కింగ్ కప్‌ను నిలబెట్టుకుంది. ప్రముఖ డేవిస్ కప్ తరహా మహిళల టీమ్ టెన్నిస్ టోర్నీలో ఇటలీ మళ్లీ విజేతగా నిలిచింది. ఆదివారం జరిగిన ఫైనల్స్‌లో ఇటలీ 2–0 తేడాతో అమెరికాపై ఘనవిజయం సాధించింది. ఇటలీ స్టార్లు జాస్మిన్ పావోలిని, ఎలిసాబెట్టా కొకియారెటో వరుస సింగిల్స్ మ్యాచ్‌ల్లో గెలుపొందారు. ఫలితం తేలిపోవడంతో డబుల్స్ మ్యాచ్ నిర్వహించాల్సిన అవసరం రాలేదు. ప్రపంచ ఎనిమిదో ర్యాంకర్ పావోలిని 6–4, 6–2తో ఏడో ర్యాంకర్ జెస్సికా పెగూలాను కంగుతినిపించింది.
రెండో సింగిల్స్‌లో 91వ ర్యాంకర్ కొకొయారెటో 6–4, 6–4తో 11వ ర్యాంకులో ఉన్న ఎమ్మా నవారోను మట్టికరిపించింది. బ్రిటన్‌తో జరిగిన సెమీఫైనల్లో వరుస మ్యాచ్‌ల్లో అమెరికాను గెలిపించిన పెగులా, నవారో తుదిపోరులో మాత్రం చేతులెత్తేశారు. ఇటలీకి చెందిన ఒలింపిక్ చాంపియన్స్ పావోలిని, సారా ఎరానిలను బరిలోకి దించడం ద్వారా ఈ టోర్నీ చరిత్రలో ఆరో టైటిల్ సాధించింది.
గత మూడు టోర్నీల్లో ఫైనల్స్‌కు చేరిన ఇటలీ 2023లో మాత్రం కెనడా చేతిలో ఓడి రన్నరప్‌గా నిలిచింది. మరోవైపు అత్యధికంగా 18 సార్లు విజేతగా నిలిచిన అమెరికా 2017 తర్వాత మళ్లీ టైటిల్ గెలుపొందలేకపోయింది. బిల్లీ జీన్ కింగ్ కప్‌ను గతంలో ఫెడ్ కప్‌గా నిర్వహించేవారు. 2020–21 సీజన్ నుంచే బిల్లీ జీన్ కింగ్ కప్‌గా పేరు మార్చారు.