
సౌతాఫ్రికా మహిళల క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ డేన్ వాన్ నీకెర్క్ తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కు తీసుకుంది. ఈ మేరకు సోషల్‌మీడియా వేదికగా ప్రకటన చేసింది. ఈ ప్రకటనలో డేన్ ఇలా రాసుకొచ్చింది.
రిటైర్మెంట్ ఉపసంహరణ నిర్ణయాన్ని ప్రకటిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. నా దేశానికి ప్రాతినిధ్యం వహించడాన్ని చాలా మిస్ అయ్యాను. మరోసారి జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహించే అవకాశం వస్తే, నా సర్వస్వం ఇవ్వడానికి కట్టుబడి ఉన్నానంటూ ఇన్‌స్టా పోస్ట్‌లో పేర్కొంది.
కాగా, డేన్ 29 ఏళ్ల వయసులోనే అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించి అప్పట్లో అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. డేన్ 2023లో క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్లకు గుడ్‌బై చెప్పింది. నాటి టీ20 ప్రపంచకప్ జట్టుకు ఎంపిక కాకపోవడంతో డేన్ అప్పట్లో తొందరపాటు నిర్ణయం తీసుకుంది.
ఫిట్‌నెస్ లేకపోవడం, తరుచూ గాయాల బారిన పడుతుండటంతో సెలెక్టర్లు డేన్‌ను ఎంపిక చేయలేదు. దీంతో ఆమె మనస్తాపం చెంది అకస్మాత్తుగా రిటైర్మెంట్ ప్రకటించింది. డేన్ ఆకస్మిక రిటైర్మెంట్ తర్వాత సూన్ లస్ కెప్టెన్‌గా ఎంపికై, ప్రపంచకప్‌లో సౌతాఫ్రికాను ముందుండి నడిపించింది.
ప్రస్తుతం 32వ పడిలో ఉన్న డేన్ సౌతాఫ్రికా తరఫున మొత్తం 194 మ్యాచ్‌లు (107 వన్డేలు, 86 టీ20లు, ఓ టెస్ట్) ఆడింది. ఇందులో 4074 పరుగులు చేసి, 204 వికెట్లు తీసింది. డేన్ సౌతాఫ్రికాకు 50 వన్డేల్లో, 30 టీ20ల్లో సారథ్యం వహించింది. ఇందులో 29 వన్డేలు, 15 టీ20ల్లో జట్టును విజయవంతంగా నడిపించింది.
సౌతాఫ్రికా జట్టులో కీలక సభ్యురాలిగా ఉండిన డేన్ కోవిడ్ సమయంలో గాయాల బారిన పడి చాలా ఇబ్బందులు ఎదుర్కొంది.2022 వన్డే ప్రపంచకప్ సమయంలో ఆమె మడమ గాయానికి గురై టోర్నీ మొత్తానికి దూరమైంది. అప్పటి నుంచి తరుచూ గాయాలతో ఇబ్బంది పడిన డేన్.. జట్టులో క్రమంగా ఉనికి కోల్పోయింది.
ఇప్పుడు ఆమె రిటైర్మెంట్ విషయంలో తొందరపడ్డానని పశ్చాత్తాపడుతూ సెలెక్టర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడింది. ఈ క్రమంలో సౌతాఫ్రికా సెలెక్టర్లకు క్షమాపణ కూడా చెప్పినట్లు తెలుస్తుంది.