న్యూజిలాండ్‌ జట్టుకు కొత్త బ్యాటింగ్‌ కోచ్‌ | Craig McMillan Appointed as New Zealand Women’s Batting & Fielding Coach Ahead of ICC Women’s World Cup | Sakshi
Sakshi News home page

న్యూజిలాండ్‌ జట్టుకు కొత్త బ్యాటింగ్‌ కోచ్‌

Sep 3 2025 3:03 PM | Updated on Sep 3 2025 3:12 PM

Craig McMillan Appointed As New Zealand Women Batting Coach

న్యూజిలాండ్‌ మాజీ ఆల్‌రౌండర్‌ క్రెయిగ్‌ మెక్‌మిలన్‌ (Craig McMillan) ఆ దేశ మహిళల జట్టుకు బ్యాటింగ్, ఫీల్డింగ్‌ కోచ్‌గా ఎంపికయ్యాడు. ఈ నెలాఖరున భారత్, శ్రీలంక వేదికగా ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్‌ ప్రారంభం కానుండగా... దానికి ముందు 48 ఏళ్ల మెక్‌మిలన్‌కు ఈ బాధ్యతలు అప్పగించారు. 

ఆనందంగా ఉంది
కాగా న్యూజిలాండ్‌ జాతీయ జట్టు తరఫున 55 టెస్టులు, 197 వన్డేలు ఆడిన మెక్‌మిలన్‌ 7 వేలకు పైగా పరుగులు చేశాడు. 2024 టీ20 ప్రపంచకప్‌ సమయంలో సైతం మెక్‌మిలన్‌ న్యూజిలాండ్‌ మహిళల జట్టు సహాయ బృందంలో పని చేశాడు. ‘మరోసారి న్యూజిలాండ్‌ మహిళల జట్టుతో కలిసి పనిచేసే అవకాశం రావడం ఆనందంగా ఉంది. 

నైపుణ్యం గల ప్లేయర్లతో కలిసి జట్టు ఆశయాలు సాధించేందుకు నా వంతు కృషి చేస్తా. ఐసీసీ ఈవెంట్‌లో మెరుగైన ప్రదర్శన కనబర్చేందుకు ప్రయత్నిస్తాం’ అని మెక్‌మిలన్‌ అన్నాడు. 

ఆస్ట్రేలియాతో  తొలి మ్యాచ్‌
ఇక.. 2000లో వన్డే ప్రపంచకప్‌ గెలిచిన న్యూజిలాండ్‌ మహిళల జట్టు... ఆ తర్వాత మరో మూడుసార్లు రన్నరప్‌గా నిలిచింది. ఈసారి ట్రోపీ చేజిక్కించుకోవడమే లక్ష్యంగా... పలువురు న్యూజిలాండ్‌ ప్లేయర్లు ఇప్పటికే భారత్‌ చేరుకొని స్పిన్‌ పిచ్‌లపై ప్రాక్టీస్‌ సైతం చేశారు. ప్రపంచకప్‌లో భాగంగా అక్టోబర్‌ 1న ఆస్ట్రేలియాతో న్యూజిలాండ్‌ తొలి మ్యాచ్‌ ఆడనుంది.   

ఇదీ చదవండి:  కమిన్స్‌ దూరం 
వెన్నెముక గాయంతో ఆస్ట్రేలియా టెస్టు కెప్టెన్‌ ప్యాట్‌ కమిన్స్‌... భారత్, న్యూజిలాండ్‌లతో జరిగే పరిమిత ఓవర్ల సిరీస్‌లకు దూరమయ్యాడు. ప్రస్తుతం గాయం నుంచి కోలుకునేందుకు కమిన్స్‌ పునరావాస శిబిరంలో పాల్గొంటున్నాడని క్రికెట్‌ ఆస్ట్రేలియా (సీఏ) ఒక ప్రకటనలో తెలిపింది.

 స్వదేశంలో జరిగే ప్రతిష్టాత్మక యాషెస్‌ సిరీస్‌కల్లా అతను కోలుకుంటాడని సీఏ భావిస్తోంది. వచ్చే నెలలో న్యూజిలాండ్‌తో ఆ్రస్టేలియా మూడు వన్డేల సిరీస్‌లో పాల్గొనాల్సి ఉంది. అక్టోబర్‌ 1 నుంచి ఈ ద్వైపాక్షిక మ్యాచ్‌లు జరుగుతాయి. 

అనంతరం భారత్‌ కంగారూ పర్యటనకు వెళుతుంది. అక్కడ అక్టోబర్‌ 19 నుంచి 25 వరకు మూడు వన్డేలు, తర్వాత 29 నుంచి నవంబర్‌ 8 వరకు ఐదు టి20లు ఆడుతుంది. ఈ మూడు పరిమిత ఓవర్ల సిరీస్‌లకు కమిన్స్‌ అందుబాటులో ఉండడని సీఏ వర్గాలు తెలిపాయి.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement