ఉత్సాహంగా నామినేషన్ల సమర్పణ
సిద్దిపేటఅర్బన్: పంచాయతీ ఎన్నికల్లో భాగంగా రెండో రోజు నామినేషన్లు దాఖలు చేయడానికి అభ్యర్థులు పోటెత్తారు. సోమవారం మంచి ముహూర్తం కావడంతో ఎక్కువ మంది నామినేషన్లు సమర్పించారు. మండలంలోని ఎన్సాన్‌పల్లి, పొన్నాల, ఎల్లుపల్లి, మిట్టపల్లి, తడ్కపల్లి క్లస్టర్లలో ఆర్వోలు నామినేషన్‌లు స్వీకరించారు. అభ్యర్థులు తమ మద్దతు దారులతో ర్యాలీగా వచ్చి నామినేషన్లు దాఖలు చేశారు. ఎన్సాన్‌పల్లిలో లహరిక కృష్ణమూర్తి, పొన్నాలలో ఎర్ర శ్రావణ్, మందపల్లి సర్పంచ్ అభ్యర్థి కొమ్ము రాజయ్య ర్యాలీగా తరలి వచ్చి నామినేషన్లు అందజేశారు. అర్బన్ మండలంలో 12 గ్రామాలకు గాను సర్పంచ్ పదవికి 27 నామినేషన్లు దాఖలు కాగా వార్డు సభ్యులకు 133 నామినేషన్లు దాఖలయ్యాయి. ఎన్సాన్‌పల్లిలో ఎన్నికల పరిశీలకురాలు హరిత నామినేషన్ల ప్రక్రియను పరిశీలించారు.


