అమ్మో.. రెబెల్స్!
పంచాయతీ ఎన్నికల పర్వం కీలక ఘట్టానికి చేరుకుంది. జిల్లాలో మొదటి విడత ఎన్నికకు సంబంధించి నామినేషన్ల స్క్రూటినీ జరిగి అభ్యర్థుల జాబితా వెలువడింది. ఈ క్రమంలోనే ప్రధాన గ్రామాల్లో పార్టీలకు రెబెల్స్ బెడద తలనొప్పిగా మారుతోంది. ఈ పరిస్థితివల్ల గెలిచే స్థానాలను ఓడిపోయే అవకాశం ఉందనే ఆందోళన పార్టీ నేతలను వెంటాడుతోంది. ఈ క్రమంలోనే నామినేషన్ల ఉపసంహరణ గడువు ఈనెల 3లోగా రెబెల్స్‌ను బుజ్జగించే ప్రయత్నాల్లో పార్టీల నేతలు నిమగ్నమై ఉన్నారు.
– గజ్వేల్
జిల్లాలోని 508 పంచాయతీలకుగానూ 163 పంచాయతీల్లో మొదటి విడత, 182 పంచాయతీల్లో రెండోవిడత, 163 పంచాయతీల్లో మూడో విడతల్లో ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. మొదటి విడత ఎన్నికల ప్రక్రియ.. కీలక ఘట్టానికి చేరుకుంది. ఆదివారం నామినేషన్ల స్క్రూటినీ జరిగి.. సాయంత్రం అభ్యర్థుల జాబితాలు వెలువడ్డాయి. 1న అప్పీలుకు అవకాశం కల్పించారు. నామినేషన్ల ఉపసంహరణకు ఈనెల 3న తుది గడువు విధించారు. ఈ క్రమంలోనే రెబెల్స్ వ్యవహారం అన్ని పార్టీలకు తలనొప్పిగా మారింది. ప్రధానంగా కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లకు ఈ సమస్య తీవ్రంగా ఉంది. ప్రధాన గ్రామాల్లో ఈ పార్టీలకు చెందిన అభ్యర్థులు ఒక్కో సర్పంచ్ స్థానానికి ఒక్కో పార్టీ నుంచి రెండు నుంచి నాలుగు ఆపైనా నామినేషన్లు వేశారు. పార్టీల మద్దతు దక్కని కొందరు ఇప్పటికే ఇతర పార్టీల్లోకి వెళ్లిపోయారు. కొందరైతే పార్టీల మద్దతు లేకున్నా.. సరే రెబెల్‌గా పోటీలోనే ఉంటామని భీష్మించుకున్నారు. ఈ పరిస్థితుల్లో వీరిని సముదాయించడం నేతలకు తలనొప్పిగా మారింది. ఇలాగే వదిలిపెడితే ఓట్లు చీలిపోయి.. గెలిచే స్థానాలను కోల్పోయే ప్రమాదం ఉండటంతో బుజ్జగించే ప్రయత్నాలను ముమ్మరం చేశారు. నామినేషన్ల ఉపసంహరణ గడువులోగా వారిని సముదాయించి నామినేషన్లను విత్‌డ్రా చేయించే ప్రయత్నాలు సాగుతున్నాయి. పార్టీలు గ్రామాలవారీగా ముఖ్యనేతలకు ఈ బాధ్యతను అప్పగించారు. ఈ క్రమంలో గ్రామాల్లో జోరుగా సంప్రదింపులు సాగుతున్నాయి.
ఇది వదులుకుంటే.. మరో అవకాశం
సర్పంచ్ పదవులకు నామినేషన్లు వేసిన రెబెల్ అభ్యర్థులు పార్టీలు పిలుపు మేరకు తమ నామినేషన్లను ఉపసంహరించుకుంటే రాబోవు రోజుల్లో పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇస్తున్నారు. ఎంపీటీసీ ఎన్నికల్లో సీట్లు కేటాయిస్తామని కొందరికీ, పార్టీ పదవులను అప్పగిస్తామని మరికొందరికీ హామీ ఇస్తున్నారు. ఇవే కాకుండా పార్టీ అభ్యర్థులుగా పోటీలో ఉండాలనుకుంటున్న వారి చేత రెబెల్స్ అభ్యర్థులుకు డబ్బులు ఇప్పించే ఒప్పందాలు చేస్తున్నారు. మొదటి విడతకు సంబంధించి నామినేషన్ల విత్‌డ్రా గడువులోగా ఎంతమంది... పార్టీల నిర్ణయానికి కట్టుబడి పోటీ నుంచి తప్పుకుంటారోననేది వేచిచూడాల్సిందే. మరోవైపు రెండో విడత విడతకు సంబంధించి ఆదివారం నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. మూడో విడత గ్రామాలకు డిసెంబర్ 3న నామినేషన్లు ప్రారంభం కానున్నాయి. ఆయా గ్రామాల్లోనూ రెబెల్స్ బెడద పార్టీలను కలవరపరుస్తోంది.
పార్టీల గుర్తులతో ప్రమేయం లేకుండా జరుగనున్న ఈ ఎన్నికల్లో ఎలాగైనా తమ మద్దతుదారులను గెలిపించుకోవడానికి కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీలు తమదైన శైలిలో ప్రచారాన్ని చేపట్టడానికి సిద్ధమయ్యాయి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలుపు ఉత్సాహంతో కాంగ్రెస్ ముందుకు సాగుతుండగా, బీఆర్‌ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తోంది. బీజేపీ మోదీ నాయకత్వాన్ని ప్రచారం చేస్తున్నది.
జప్తిసింగాయిపల్లి ఏకగ్రీవం!
సింగిల్ నామినేషన్ దాఖలు
ములుగు(గజ్వేల్): గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవం పర్వం కొనసాగుతోంది. అనేక చోట్ల సింగిల్ నామినేషన్లు దాఖలవుతుండటంతో సర్పంచ్ ఎన్నిక ఏకగ్రీవం కానుంది. ములుగు మండలం జప్తిసింగాయిపల్లి పంచాయతీ ఏకగ్రీవానికి రంగం సిద్ధమైంది. ఇక్కడ సర్పంచ్ స్థానం ఎస్సీ మహిళకు రిజర్వు కావడంతో బొమ్మగళ్ల లక్ష్మి ఒక్కరే సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. పంచాయతీలో మొత్తం 8 వార్డులు ఉండగా అందులో 2 వార్డులు ఏకగ్రీవం అయ్యేందుకు సింగిల్ నామినేషన్లు దాఖలయ్యాయి. సర్పంచ్ అభ్యర్థిని ఏకగ్రీవంగా ఎన్నుకుంటే గ్రామం అభివృద్ధి బాటలో నడుస్తుందన్న ఆలోచనతో గ్రామస్తులు సమావేశమై ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో జప్తిసింగాయిపల్లి గ్రామపంచాయతీ సర్పంచ్ ఎన్నిక అధికారిక ప్రకటనే మిగిలి ఉంది.
అన్ని పార్టీలకూ తప్పని బెడద
జిల్లాలో అంతటా ఇదే పరిస్థితి
గెలుపోటములు
ప్రభావితం చేసే అవకాశం
బుజ్జగించేందుకు
ప్రయత్నాలు ముమ్మరం
ఆసక్తికరంగా
‘పంచాయతీ’ రాజకీయాలు


