ఏకగ్రీవం వైపు అడుగులు
నామినేషన్ల హోరు
వర్గల్(గజ్వేల్): గ్రామపంచాయతీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ఘట్టం శనివారం ముగిసింది. నామినేషన్లు దాఖలుకు చివరిరోజు కావడంతో సర్పంచు, వార్డుల కోసం ఆశావహులు, మద్ధతుదారులు క్లస్టర్ కేంద్రాలకు పోటెత్తారు. ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం సాయంత్రం 5 గంటలు దాటితే నామినేషన్ వేసే అవకాశం లేదు. కానీ వర్గల్ మండలంలోని వర్గల్, గౌరారం, మీనాజీపేట, నెంటూరు, మజీద్‌పల్లి, వేలూరు కేంద్రాల వద్ద భారీగా ఆశావహులు నామినేషన్లు వేసేందుకు తరలివచ్చారు. అక్కడే క్యూ కట్టారు. ఐదు గంటల వరకు కేంద్రంలో ఉన్న వారందరికి టోకెన్లు జారీచేసి రాత్రి దాదాపు 9 గంటల వరకు నామినేషన్లు స్వీకరించినట్లు ఎంపీడీఓ మచ్చేందర్ పేర్కొన్నారు. వర్గల్ మండలంలో 27 గ్రామపంచాయతీలకు చివరిరోజే అత్యధికంగా నామినేషన్లు దాఖలైనట్లు ఆయన తెలిపారు.
రాత్రి వరకు నామినేషన్లు
● కేంద్రాల వద్ద సందడి
వర్గల్(గజ్వేల్)/గజ్వేల్‌రూరల్/సిద్దిపేటఅర్బన్/దుబ్బాకటౌన్/జగదేవ్‌పూర్(గజ్వేల్): ఏకగ్రీవం వైపు పల్లెలు పోటీపడుతున్నాయి. నామినేషన్ల ఘట్టానికి ముందే ‘సింగిల్’ నామినేషన్లతో తమ అభిమతాన్ని చాటుతున్నాయి. ఆదర్శంగా నిలుస్తున్నాయి. జిల్లాలోని గజ్వేల్, వర్గల్, దుబ్బాక, సిద్దిపేట, జగదేవ్‌పూర్ తదితర ప్రాంతాల్లో అనేక గ్రామాలు ఏకగ్రీవమయ్యాయి. వర్గల్ మండలంలో చాంద్‌ఖాన్‌మక్తలో సర్పంచ్ పదవి కోసం మేదిని సజనిత భిక్షపతిరెడ్డి ఒక్కరే నామినేషన్ దాఖలు చేశారు. అలాగే.. ఎనిమిది వార్డులకు ఒక్కొక్కటి చొప్పున నామినేషన్లు దాఖలయ్యాయి. దీంతో చాంద్‌ఖాన్ మక్త సర్పంచ్‌గా ఆమె ఏకగ్రీవం లాంఛనమే కానుంది. నూతన పంచాయతీగా ఆవిర్భవించిన ఈ పల్లె వరుసగా రెండోసారి ఏకగ్రీవమైన పంచాయతీగా రికార్డు సాధించనున్నది. అదేవిధంగా గుంటిపల్లి పంచాయతీ సర్పంచు కోసం బొమ్మ మహంకాళి ఏకగ్రీవం కానున్నది. తున్కిమక్త పంచాయతీకి సర్పంచ్ అభ్యర్థులుగా భార్యాభర్తలు పసుల రాజు, పసుల రేణుక మాత్రమే నామినేషన్ దాఖలు చేశారు. ఇక్కడ 8 వార్డులకు సింగిల్ నామినేషన్లు దాఖలయ్యాయి. కాగా, పంచాయతీ ఎన్నికల నామినేషన్ల చివరిరోజు ఆశావహులు శనివారం రాత్రి 9 గంటలకు చలిని లెక్కచేయకుండా వర్గల్ కేంద్రం వద్ద నామినేషన్ వేసేందుకు అభ్యర్థులు నిరీక్షించారు.
రాత్రి వరకు నామినేషన్ల స్వీకరణ
గజ్వేల్ మండలంలోని 25 గ్రామ పంచాయతీలకు మొదటి విడతలో నిర్వహించిన నామినేషన్ల ప్రక్రియ శనివారంతో ముగిసింది. రాత్రి 9 దాటినప్పటికీ అక్కారం, బయ్యారం క్లస్టర్ల పరిధిలోని గ్రామాలకు చెందిన ఆశావహులు నామినేషన్లను వేసేందుకు బారులు తీరారు.
రంగంపేట ఏకగ్రీవం
గజ్వేల్ మండలంలోని రంగంపేట గ్రామ పంచాయతీ సర్పంచ్‌గా ఒకే అభ్యర్థి రెండు నామినేషన్ సెట్లను దాఖలు చేయడంతో ఏకగ్రీవానికి బాటలు పడ్డాయి. శనివారం సర్పంచ్ అభ్యర్థిగా నాగరాజు ఒకరే నామినేషన్ దాఖలు చేశారు.
పాండవపురం సర్పంచ్ ఏకగ్రీవం!
సిద్దిపేట మండలం పాండవపురం (బొగ్గులోనిబండ) గ్రామం సర్పంచ్ పదవి ఏకగ్రీవం చేసేందుకు గ్రామస్తులు సిద్ధమయ్యారు. 200 పైగా ఓటర్లు ఉన్న పాండవపురం సర్పంచ్ పదవి జనరల్ కాగా ముగ్గురు అభ్యర్థులు పోటీ చేయడానికి ముందుకు వచ్చారు. దీంతో గ్రామస్తులు వేలం పాట నిర్వహించినట్టు సమాచారం. అయితే ముగ్గురిలో ఒకరు రూ.16 లక్షలకు పైగా డబ్బులు కుల సంఘానికి ఇవ్వడానికి ఒప్పుకున్నట్టు సమాచారం.
ఏకగ్రీవమైన లింగాయిపల్లి తండా
దౌల్తాబాద్ మండలం లింగయిపల్లి తండా సర్పంచ్ ఎన్నిక ఏకగ్రీవం అయింది. సర్పంచ్ అభ్యర్థి గుగ్గులోతు లక్యనాయక్ ఒకే నామినేషన్ దాఖలు చేశారు. దీంతో ఆయన ఏకగ్రీవంగా ఎన్నికై నట్లు తండావాసులు సంబరాలు చేసుకున్నారు.
మూడు గ్రామాలు ఏకగ్రీవం
జగదేవ్‌పూర్ మండలం పలుగుగడ్డ, కొండాపూర్, అనంతసాగర్ గ్రామాలు ఏకగ్రీవం అయ్యాయి. శనివారం నామినేషన్ల చివరి రోజు వరకు ఆయా గ్రామాల్లో ఒక్క నామినేషన్ మాత్రమే దాఖలలయ్యాయి. పలుగుగడ్డ గ్రామ పంచాయతీలో సర్పంచ్ పదవికి అదే గ్రామానికి చెందిన నర్ర కనకయ్య, కొండాపూర్‌లో సుప్పరి పుష్ప, అనంతసాగర్‌లో క్యాసారం కుమార్‌లు ఒకే నామినేషన్ దాఖలు చేశారు. దీంతో ఈ గ్రామాల్లో ఏకగ్రీవం ఎన్నిక జరిగినట్లేనని భావిస్తున్నారు.
క్యూలో ఆశావహులు, మద్ధతుదారులు
టోకెన్లు జారీచేసిన అధికారులు


